
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద నటుడని దాణా కుంభకోణం కేసును విచారించిన సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఉపెన్ విశ్వాస్ చెప్పారు. ఆయన నాటకాలు ఎవరూ కనిపెట్టలేరని చెప్పారు. కేసు విచారణ సమయంలో తనను ఆయన ముప్పుతిప్పలు పెట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగ విరమణ పొంది ఇంటి వద్దే ఉంటున్న ఉపెన్ విశ్వాస్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఈ కేసు విచారణ సమయంలో ఆయన ఎదుర్కొన్న అనుభవాలు తెలిపారు. లాలూ కేసు విషయంలో వచ్చిన ఒత్తిడిలను తట్టుకోలేక చివరకు తాను బౌద్ధమతం స్వీకరించినట్లు తెలిపారు.
మొట్టమొదటిసారి లాలూ కేసు విచారణ చేయాలని ఆదేశాలు వచ్చిన వెంటనే బిహార్ సీఎస్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని, అయితే, మాట్లాడింది మాత్రం లాలూనే అని చెప్పారు. ఈ కేసు విషయంలో చూసిచూడనట్లు వ్యవహరించాలని, తన ఇమేజ్‌కు దెబ్బతగలకుండా ఉండాలని లాలూ కోరినట్లు కూడా ఆయన వివరించారు. తాను అగ్ర కులస్తుడిని కాదని సానుభూతి పొందే యత్నం కూడా చేశారన్నారు. ముఖ్యంగా విచారణ సమయంలో తనను పట్నాలో విచారించాలని, తర్వాత ఢిల్లీలో అని, కోల్‌కతాలో అని ఇలా రకరకాలుగా ఇబ్బందుల పెట్టారని చెప్పారు. దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌వంటి నేతలు మాత్రమే కాకుండా ఆఖరికి సీబీఐ డైరెక్టర్ నుంచి కూడా ఒత్తిడిలు వచ్చాయని, ఎంతో ఇబ్బంది ఎదుర్కొన్నట్లు చెప్పారు.
ఎన్ని సమస్యలు ఎదురైనా తన వంతు బాధ్యతగా విచారణ పూర్తి చేశానని, ఆఖరికి అరెస్టు చేసేందుకు అనుమతి కోరితే తమ పైఅధికారులు ఆ అవకాశం ఇవ్వలేదని, కనీసం ఆరోజు ఫోన్ కూడా ఎత్తలేదని అన్నారు. ఓ న్యాయకోవిధుడి సలహా తీసుకొని మిలిటరీ అధికారుల సహాయంతో ఆయనను అరెస్టు చేద్దామనుకున్నానని, అయినా వారు కూడా అందుకు అంగీకరించలేదని, చివరకు తనకు పై అధికారుల నుంచి షోకాజ్ నోటీసులు వచ్చాయని చెప్పారు. దాంతో తనను ఆ కేసులో నుంచి తప్పించాలనుకుంటున్నారని అర్ధమైందని, కేసు విచారణ పూర్తి చేసి సీబీఐకి అప్పగించానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment