నేడే ఫైనల్.. రద్దుపై రేపటి నుంచి ఎలా?
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అంశంలో ఒక అంకం నేటితో ముగియనుంది. అత్యంత కీలకమైన పాత నోట్ల డిపాజిట్ వ్యవహారం నేటితో ఆఖరుకానుంది. సైన్యంలో పనిచేసేవారు, విదేశాల్లో ఉంటున్నవారు మాత్రం తమ వద్ద ఉన్న పాత నోట్లను నేరుగా ఆర్బీఐవద్ద జమ చేసుకునేందుకు మార్చి 31 వరకు గడువు ఉంది. ఇతరులు కూడా డిపాజిట్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ పలు ప్రశ్నలకు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. 50 రోజులు గడువు ఇచ్చినప్పటికీ దేశంలో ఉండి కూడా ఎందుకు జమ చేయలేదని అడగడంతోపాటు ఆ డబ్బు ఎక్కడిది? ఏమిటి విషయం? అనే పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో వారికి ఏమాత్రం అనుమానం వచ్చినా వారు ఆ డబ్బు డిపాజిట్ చేసుకోకపోగా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. చిన్నాచితక డబ్బు ఉన్నవారంతా ఇప్పటికే డిపాజిట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నవారు మాత్రం ఇతర మార్గాల ద్వారా ఆ డబ్బును డిపాజిట్ చేస్తున్నారని ఇప్పటికే పలు సంఘటనల ద్వారా బయటపడింది. వారికి బ్యాంకు అధికారులు కూడా పెద్ద మొత్తంలోనే సహకరిస్తున్నారని స్పష్టమైంది. నేడు (డిసెంబర్ 30) పాత నోట్ల డిపాజిట్ కు ఆఖరు కావడంతో ఈడీ అధికారులు, ఐటీ అధికారులు కూడా పెద్ద మొత్తంలో బ్యాంకులపై కన్నేసి ఉంచినట్లు సమాచారం.
నగదు మార్పిడి చేసేందుకు వారు సహకరించడంతోపాటు నకిలీ ఖాతాల్లో కూడా వారు జమ చేస్తున్న నేపథ్యంలో నిఘా పెంచినట్లు తెలుస్తోంది. పాత నోట్ల డిపాజిట్ల సంగతి ఎట్లున్నా, ప్రజల ఇబ్బందులు మాత్రం మారలేదు. ప్రధాని నరేంద్రమోదీ మాత్రం ఇవాళ్టితో అందరి సమస్యలు తీరుతాయని డెడ్ లైన్‌గా డిసెంబర్ 30ని ప్రకటించారు. కానీ, బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు మాత్రం ప్రజల క్యూలు అలాగే ఉన్నాయి. తమ నిత్యవసరాలకు సైతం డబ్బు దొరకని పరిస్థితి ఉంది. ఏ ఏటీఎంలను చూసినా నగదు నిల్వలేదు(నో క్యాష్) అంటూ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే చిన్నవ్యాపారులు చితికిపోగా.. లగ్జరీ వస్తువుల అమ్మకాలు తగ్గాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకాలు 50శాతానికి పడిపోయాయి. 50 రోజుల్లో పూర్తి స్థాయిలో డబ్బు ప్రజలకు అందుబాటులోకి వస్తుందని చెప్పినా అది జరగలేదు. బ్యాంకులు వారానికి రూ.24వేలు ఇస్తాయని చెబుతున్నా ఆ హామీ అమలుకావడం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో డిపాజిట్ గడువు ముగుస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్రమోదీ ఒక వేళ రేపు మరోసారి జాతినుద్దేశించి ప్రసంగిస్తే ఏం మాట్లాడుతారు? పెద్ద నోట్ల రద్దు నిర్ణయం విజయవంతం అయిందని ప్రకటిస్తారా.. ఓ పక్కన జనాలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉందని, చాలా చక్కగా సహకరించారంటూ ఆయన ఎప్పుడు చెప్పినట్లుగానే మరోసారి చెబుతారా? ఇక బ్యాంకుల విషయంలో విత్ డ్రాల పరిమితి పొడిగిస్తారా? ఏటీఎంల విషయంలో ఏదైనా ప్రకటన చేస్తారా అనేది ఓ ఉత్కంఠే. మరోపక్క, నేటితో గడువు తీరిపోతున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు పూర్తిగా మారుస్తారా? ఇంకా ఎన్ని రోజులు ఇలా కొనసాగిస్తారో? అంటూ సామాన్యజనం మాత్రం బిక్కుబిక్కుమంటున్నారు.
ఇంకొందరైతే.. కేంద్రం పూర్తి స్థాయిలో డబ్బు విడుదల చేసి బ్యాంకుల ద్వారా నల్ల కుభేరుల డబ్బును తెల్లడబ్బుగా మార్చిందని, ఈ క్రమంలో ప్రజలు గుర్తించకుండా ఉండేందుకే అక్కడక్కడా ఐటీ దాడులు చేయించి వాటిని బయటపెట్టి ప్రజల దృష్టిని మరల్చిందని అంటున్నారు. నిజంగా అలా జరగకుంటే ఇప్పటికే అన్ని ఏటీఎంలు, బ్యాంకులు పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉండాలిగా అంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నారు? ఏదేమైనా రేపటి నుంచి పరిస్థితి ఎలా ఉండనుందని ప్రజలంతా ఆసక్తిగా చూస్తున్నారు.