అసెంబ్లీకి ఆలస్యంగా వస్తే.. 500 జరిమానా
రాజస్థాన్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఆలస్యంగా వెళ్లినందుకు దాదాపు 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు 500 రూపాయల చొప్పున జరిమానా చెల్లించుకోవాల్సి వచ్చింది. వీళ్లంతా లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఈ జరిమానా చెల్లించారు. ఇలా జరిమానా విధించడం మంచిదేనని, దీనివల్ల ప్రతి ఒక్కళ్లూ సరైన సమయానికి హాజరు కావాలన్న స్పృహ పెరుగుతుందని ఇలాగే ఆలస్యంగా వచ్చి జరిమానా కట్టిన భవానీ సింగ్ రజావత్ అనే ఎమ్మెల్యే చెప్పారు.
ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీకి సరైన సమయానికే హాజరు కావాలని, అలా రాని వాళ్లపై చర్యలు తప్పవని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె ఇంతకుముందే హెచ్చరించారు. తాను అన్నట్లే ఆమె జరిమానా విధించారు. గతంలో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేసిన రజావత్ ఈ చర్యను ఎంతగానో సమర్థించారు. సర్వసాధారణంగా ఏ కార్యక్రమానికైనా ఆలస్యంగానే వెళ్లే అలవాటున్న ఎమ్మెల్యేలు.. ఇప్పటికైనా సమయపాలన విలువ తెలుసుకుంటారని ఆయన అన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలయితే.. రెట్టింపు జరిమానా, అంటే వెయ్యి రూపాయలు కట్టడమే కాక, తాము ఇక మీదట ఎప్పుడూ ఆలస్యంగా రాబోమని కూడా చెప్పారట.