గ్రెవాల్ అంత్యక్రియలకు నేతల క్యూ
భివానీ/న్యూఢిల్లీ: ‘ఒకే ర్యాంకు ఒకే పెన్షన్’ అంశంలో ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న మాజీ జవాను రామ్‌కిషన్ గ్రెవాల్ అంత్యక్రియలు గురువారం ఆయన స్వగ్రామం హరియాణా భివానీలోని బమ్లాలో జరిగాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితర రాజకీయ ప్రముఖులు గ్రెవాల్ అంత్యక్రియలకు క్యూ కట్టారు. మాజీ జవాను కుటుంబ సభ్యులను కలిసిన రాహుల్... తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్‌సింగ్ హుడాతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు సెల్జా, కుల్దీప్ బిషోని, కమల్‌నాథ్, రణదీప్ సుర్జేవాలా కార్యక్రమానికి హాజరయ్యారు.
రాహుల్ అరెస్టు.. విడుదల: మాజీ జవాను ఆత్మహత్యకు నిరసనగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టిన రాహుల్‌గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. ఇండియా గేట్ వైపు వెళుతున్న ర్యాలీని నియంత్రించి రాహుల్‌ను అరెస్టు చేశారు. వ్యానులో ఫిరోజ్ షా రోడ్డు వరకు తీసుకువెళ్లి వదిలిపెట్టారు. గ్రెవాల్ కుటుంబానికి కేజ్రీవాల్ రూ. కోటి నష్టపరిహారాన్ని ప్రకటించారు.