OROP Protest
-
కశ్మీర్ తగలబడుతోంది
ఉజ్జయిని: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేసిన తప్పుల కారణంగా కశ్మీర్ తగలబడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపిం చారు. రెండురోజుల ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఆయన పర్యటించారు. ముందు గా ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివభక్తుడైన రాహుల్ గాంధీ 2010లోనూ ఈ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం మాల్వా– నిమాడ్ ప్రాంతంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాహుల్ మాట్లాడుతూ..ఒక ర్యాంకు– ఒక పెన్షన్ (ఓఆర్ఓపీ) పథకంపై ప్రధాని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. మరోవైపు గత కొద్దీ రోజులుగా కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారని, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ తప్పిదాల కారణంగా జవాన్లు తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉగ్రవాదులకు కశ్మీర్ తలుపులు బార్ల తీసిందని ఆరోపించారు. ఎప్పుడు సర్జికల్ స్ట్రైక్స్, ఆర్మీ, నేవీ గురించి మాట్లాడే మోదీ..సైనికుల సమస్యలపై మాత్రం పల్లెత్తు మాట మాట్లాడరని విమర్శించారు. అసలు సర్జికల్ స్ట్రైక్స్ వల్ల సాధించింది ఏమిటో ప్రజలకు చెప్పాలని మోదీని డిమాండ్ చేశారు. -
‘ఓఆర్ఓపీ’కి కట్టుబడి ఉన్నాం
న్యూఢిల్లీ: ఒకే ర్యాంకు–ఒకే పెన్షన్ (ఓఆర్ఓపీ) అమలుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. శనివారం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మాజీ సైనికులతో రాహుల్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సైనికుల సంక్షేమం, ఓఆర్ఓపీ అమలు తదితర అంశాలపై వారితో చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఓఆర్ఓపీ అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. 2019లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చేపడితే ఓఆర్‌ఓపీతో సహా సైనికుల డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రఫేల్ వ్యవహారంలో అనిల్ అంబానీకి రూ.30 వేల కోట్లు కేటాయించిన మోదీ సర్కార్‌కు సైనికుల డిమాండ్ల పరిష్కారానికి మాత్రం చేతులు రావటం లేదని విమర్శించారు. జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్రం తీరు సరిగా లేదని, దీని వల్ల సైనికులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రాహుల్ విమర్శలకు అధికార బీజేపీ దీటుగా సమాధానం ఇచ్చింది. అధికారంలో ఉండగా ఎన్నడూ సైనికుల సంక్షేమంపై మాట్లాడని రాహుల్ ఇప్పుడు తమను విమర్శించటం సిగ్గుచేటని బీజేపీ రాజ్యసభ సభ్యుడు అనిల్ బరూనీ విమర్శించారు. అధికారం కోల్పోయి నాలుగున్నరేళ్ల తర్వాత గానీ ఆయనకు సైనికులు గుర్తుకు రాలేదని ఎద్దేవా చేశారు. -
గ్రెవాల్ అంత్యక్రియలకు నేతల క్యూ
భివానీ/న్యూఢిల్లీ: ‘ఒకే ర్యాంకు ఒకే పెన్షన్’ అంశంలో ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న మాజీ జవాను రామ్‌కిషన్ గ్రెవాల్ అంత్యక్రియలు గురువారం ఆయన స్వగ్రామం హరియాణా భివానీలోని బమ్లాలో జరిగాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితర రాజకీయ ప్రముఖులు గ్రెవాల్ అంత్యక్రియలకు క్యూ కట్టారు. మాజీ జవాను కుటుంబ సభ్యులను కలిసిన రాహుల్... తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్‌సింగ్ హుడాతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు సెల్జా, కుల్దీప్ బిషోని, కమల్‌నాథ్, రణదీప్ సుర్జేవాలా కార్యక్రమానికి హాజరయ్యారు. రాహుల్ అరెస్టు.. విడుదల: మాజీ జవాను ఆత్మహత్యకు నిరసనగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టిన రాహుల్‌గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. ఇండియా గేట్ వైపు వెళుతున్న ర్యాలీని నియంత్రించి రాహుల్‌ను అరెస్టు చేశారు. వ్యానులో ఫిరోజ్ షా రోడ్డు వరకు తీసుకువెళ్లి వదిలిపెట్టారు. గ్రెవాల్ కుటుంబానికి కేజ్రీవాల్ రూ. కోటి నష్టపరిహారాన్ని ప్రకటించారు. -
జంతర్‌మంతర్ వద్ద ఉద్రిక్తత.. మళ్లీ రాహుల్!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని జంతర్‌మంతర్ వద్ద గురువారం రాత్రి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని మరోసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్మీ మాజీ జవాను ఆత్మహత్య ఘటనను నిరసిస్తూ రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు జంతర్‌మంతర్ వద్ద ర్యాలీ తీసేందుకు ప్రయత్నించారు. అయితే, ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీనిని ప్రతిఘటించడంతో రాహుల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్మీ మాజీ జవాను రాంకిషన్ గ్రేవాల్ ఆత్మహత్య గురించి తెలియడంతో బుధవారం ఆయన నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలోనూ రాహుల్‌ని రెండుసార్లు పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ శ్రేణులతోపాటు రాహుల్‌ను పోలీసులు అరెస్టు చేసి పార్లమెంటు స్ట్రీట్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం అక్కడి నుంచి పోలీసు జీపులో తుగ్లక్ రోడ్డు పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. రాహుల్ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.