మృగరాజుకు ఎంత కష్టం! | lions died with Disease | Sakshi
Sakshi News home page

మృగరాజుకు ఎంత కష్టం!

Published Sun, Oct 7 2018 1:30 AM | Last Updated on Sun, Oct 7 2018 1:30 AM

lions died with Disease - Sakshi

తమ ప్రాంతంపై ఆధిపత్యం కోసం సాగుతున్న అంతర్గత పోరులోనే గుజరాత్‌ గిర్‌ మృగరాజులు ఒకదాని వెనక ఒకటి మృత్యువాత పడుతున్నాయా?   అంతుపట్టని రోగాలు, ప్రాణాంతక వైరస్‌ కారణంగానే దాదాపు 15 రోజుల సమయంలోనే 23 సింహాలు మరణించాయా?   ఆధిపత్య పోరు వల్లే మరణిస్తున్నాయన్న వాదన ప్రస్తుత పరిణామాలు మాత్రం దాన్ని బలపరచట్లేదు. అడవులకు దగ్గరగా జనావాసాలు విస్తరించడంతో అంతుచిక్కని వ్యాధులతో పాటు గొర్రెలు, మేకలు ఇతర పెంపుడు జంతువుల నుంచి సింహాలకు సోకుతున్న వైరస్‌ ఈ మరణాలకు కారణంగా నిపుణులు అంచనా వేస్తున్నారు.

తాజాగా గిర్‌ ప్రాంతంలోని ఇతర సింహాలను అక్కడకు 100 కిలోమీటర్ల దూరంలోని పోర్‌బందర్‌ సమీపాన ఉన్న బర్ద దుంగర్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించాలని గుజరాత్‌ ప్రభుత్వం నిర్ణయించింది. బర్దాతో పాటు మధ్యప్రదేశ్‌లోని పాల్పుర్‌–కునో, మరో రెండు సంరక్షణ కేంద్రాలకు కూడా వీటిని తరలించాలని గతంలోనే కొన్ని ప్రతిపాదనలొచ్చాయి.

అడవి రాజుకు కష్టమొచ్చింది..!
సింహాన్ని అడవికి రాజుగా గొప్పగా చిత్రీకరించిన తీరును మనం చిన్నపుడు కథల పుస్తకాల్లో చదువుకున్నాం. తామున్న ప్రాంతంపై పట్టు, ప్రతిష్ట కోసం సింహాల మధ్య తీవ్రమైన సంఘర్షణ చోటు చేసుకుంటున్నట్లు వార్తలొచ్చాయి. రాజ్యం (భూభాగం)పై ఆధిçపత్యం కోసం పురుష సింహాలు ఒకదాన్ని మరొకటి చంపుకుంటాయని గతంలోనే వెల్లడైంది. ఈ పోరులో భాగంగా ఆడ సింహాలు అరుదుగా గాయపడతాయి. అయితే తాజాగా గుజరాత్‌లో మూడు ఆడసింహాలు కూడా మరణించడంతో గతంలోని సూత్రీకరణల్లో వాస్తవమెంత అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అంటువ్యాధుల జాడలు..
గిర్‌ ప్రాంతంలో గతంలో అంటువ్యాధులు ప్రబలిన దాఖలాలున్నాయి. గతంలో మరణించిన ఓ సింహం నుంచి భద్రపరిచిన కణజాలాన్ని 2012లో ఐవీఆర్‌ఐ జరిపిన పరిశోధనలో పెస్ట్‌ డెస్‌ పిటిట్స్‌ వైరస్‌ (పీపీఆర్‌వీ) ఉన్నట్టు వెల్లడైంది.

ఈ వైరస్‌ వల్ల వచ్చే జబ్బులు అంటువ్యాధిగా మారితే గిర్‌ సింహాల జనాభాలో 40 శాతం మేర కనుమరుగయ్యే అవకాశాలున్నాయంటూ బ్రిటన్‌ రాయల్‌ వెటర్నరీ కాలేజీకి చెందిన రిచర్డ్‌ కాక్‌ హెచ్చరించారు.2013లో గుజరాత్‌ బయో–టెక్నాలజీ మిషన్‌ గిర్‌ ప్రాంతంలోని 10 శాతం సింహాలపై నిర్వహించిన అధ్యయనంలో సీడీవీ, పీపీఆర్‌వీ వైరస్‌ రకాల దాఖలాల్లేవని స్పష్టమైంది. 1990ల మధ్యలో సీడీవీ వైరస్‌తో ప్రబలిన అంటువ్యాధుల వల్ల ఆఫ్రికాలోని మూడోవంతు సింహాలు తుడిచిపెట్టుకుపోయాయి.

అంతుపట్టని రోగాలే కారణం..
అంతుపట్టని రోగాల కారణంగానే ఇవి మరణిస్తున్నాయన్న వాదనలు తెరపైకి వచ్చాయి. పుణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ పరీక్షల్లో కొన్ని సింహాల రక్తం, కణజాల నమూనాల్లో ‘వైరల్‌ ఇన్ఫెక్షన్‌’ ఆధారాలు లభించినట్లు తెలిసింది. నాలుగు శాంపిళ్లలో కెనైన్‌ డిస్టెంపర్‌ వైరస్‌ (సీడీవీ) ఉన్నట్లు తేలింది.

జునాగఢ్‌లోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ల్యాబ్‌ పరీక్షల్లోని ఆరు శాంపిళ్లలో ప్రోటోజువా ఇన్ఫెక్షన్లు గుర్తించారు. తదుపరి పరీక్షల్లో ఈ రెండు పరిశోధనశాలలు నిమగ్నమయ్యాయి. వీటికి తోడు బరేలిలోని ఇండియన్‌ వెటర్నరీ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ బృందం గుజరాత్‌ వెళ్లి నమూనాలు పరిశీలించింది. ఎక్కువగా సింహాలు మరణించిన చోటుకు సమీపంలోని అటవీ ప్రాంతాల నుంచి 31 సింహాలను గిర్‌ అధికారులు మరో చోటికి తరలించారు. ఆ తర్వాత అవి అరోగ్యంగానే ఉంటున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement