అగస్టా వ్యవహారంపై దద్దరిల్లిన లోక్ సభ
న్యూఢిల్లీ: నాలుగు రోజుల విరామం అనంతరం ప్రారభమైన పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు కొనసాగతున్నాయి. పెద్ద నోట్ల రద్దుపై చర్చ జరగాల్సిందే అంటూ ప్రతిపక్షాలు లోక్ సభలో ఆందోళన చేపట్టడంతో బుధవారం సభ ప్రారంభమైన కొద్ది సేపటికే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇవాళ లోక్ సభకు హాజరయ్యారు. భవిష్యత్ కోసమే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. చర్చ నుంచి కాంగ్రెస్ తప్పించుకుంటోందని ఆయ విమర్శించారు.
వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన లోక్ సభ అగస్టా వ‍్యవహారంపై దద్దరిల్లింది. ఈ సందర్భంగా మాజీ ఎయిర్ చీఫ్ అరెస్ట్‌ను రాజకీయం చేయొద్దని బీజేడీ పేర్కొంది. గత ప్రభుత్వం, ఇప్పటి ప్రభుత్వం చాలాకాలం ఈ వ్యవహారంపై నిశ్శబ్దంగా ఉన్నాయని బీజేడీ విమర్శించింది. అలాగే కిరణ్ రిజిజుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టడంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. దీంతో లోక్ సభను గురువారానికి వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.
రాజ్యసభ సమావేశాల్లో తమిళనాడుపై వర్దా తుఫాను ప్రభావంపై రాజ్యసభలో చర్చ జరిగింది. తుఫాను ప్రభావంతో తమిళనాడు పూర్తిగా దెబ్బతిందని, రాష్ట్రానికి వెంటనే 1000 కోట్లు విడుదల చేయాలని రాజా డిమాండ్ చేశారు.