సాక్షి, న్యూఢిల్లీ : గృహ అవసరాల కోసం వినియోగించే గ్యాస్‌పై రూ. 1.50, విమాన ఇంధనంపై 6 శాతం ధరలను పెంచుతున్నట్లు ఇంధన దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకటించింది. అంతర్జాతీయ ఇంధన ధరల ప్రకారమే ధరల్లో మార్పులు చేస్తున్నట్ల ఐఓసీ తెలిపింది. కొత్తగా పెరిగిన ఇంధన ధరల ప్రకారం ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ ఢిల్లీలో కిలో లీటర్‌కు రూ.53,045కు చేరింది. గతంలో ఇది రూ.50,020గా ఉండేది. అంతర్జాతీయంగా ఇంధన ధరలు దిగివస్తున్నా.. విమాన ఇంధనధరలు పెరగడం వరుసగా ఇది మూడోసారి. ఇక గృహ అవసరాల కోసం వినియోగించే ఎల్‌పీజీ గ్యాస్ ధర రూ.1.50 పెరిగింది. గ్యాస్‌పై సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసే క్రమంలో గ్యాస్ ధరలను ప్రతినెలా కేంద్రం పెంచుతూ వస్తోంది. గత ఏడాది నుంచి ఇప్పటివరకూ గ్యాస్ ధరలు.. రూ. 69.50 పెరిగాయి.