‘పెద్ద’పులి మరణించింది..!
రాంథమ్‌బోర్: భారీ దేహం.. గంభీరమైన రూపం.. అది ఎదురుపడిందంటే ఫొటోగ్రాఫర్లకు పండగే. ప్రత్యేకంగా దానిని చూసేందుకే వచ్చేవారు ఎందరో! దాని పేరు.. మచ్లీ. నివాసం రాజస్థాన్‌లోని రాంథమ్‌బోర్ రిజర్వు ఫారెస్టు. ఇదంతా దేనిగురించో మీకిప్పటికే అర్థమై ఉంటుంది. అవును దేశంలోకెల్ల ‘పెద్ద’పులిగా పిలిపించుకున్న 19 ఏళ్ల మచ్లీ గురువారం ఉదయం 9.40 గంటలకు మరణించింది.
వయోభారంతోపాటు తినడానికి ఇబ్బంది పడుతున్న ఈ వ్యాఘ్రం గత రెండ్రోజులుగా తిండి తిప్పలు మానేసింది. దీంతో అటవీశాఖ సిబ్బంది అమా ఘాటిలో అబ్జర్వేషన్‌లో ఉంచారు. 48 గంటలుగా ఏమీ తినకపోవడంతో నీరసించిపోయి.. కన్నుమూసింది. నిజానికి పులులు 14 నుంచి 15 ఏళ్లు బతుకుతాయి. అలాంటిది మచ్లీ 19 ఏళ్లు బతికింది. ఇటీవలే కోరలు ఊడిపోవడంతో పస్తూలుండాల్సి వచ్చింది. దీంతో బక్కచిక్కిపోయి ప్రాణాలు కోల్పోయింది.