రాజస్థాన్ అడవుల్లో పులిపిల్లలు..
న్యూఢిల్లీః ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పులుల సంఖ్య తగ్గుతున్న తరుణంలో పర్యాటకులకు పులిపిల్లలు కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వన్యప్రాణ ప్రేమికులకు, అధికారులకు ప్రత్యేక వార్తగా మారింది. ఇండియాలో క్రమంగా పులుల సంఖ్య పెరగడంపై అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రాజస్థాన్ లోని రణతంబోర్ టైగర్ రిజర్వ్ లో పర్యటనకు వెళ్ళిన కొందరు పర్యాటకులకు రెండు పులి పిల్లలు కనిపించాయి. దీంతో వన్యప్రాణ ప్రేమికులు సహా అధికారులు అనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఓ శుభ పరిణామంగా భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పులుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో ఇండియాలోని రాజస్థాన్ రణతంబోర్ రిజర్వ్ అడవుల్లో పులి కూనలు కనిపించడంతో అధికారులు సంబరాలు జరిపారు. పార్కులోని జోన్ 5 కు చెందిన కచిడా ఏరియాలోని ధకడా ప్రాంతంలో టూరిస్టులు ఈ పులి పిల్లలను కనుగొన్నారు. ఈ పిల్లలకు సుమారు రెండు మూడు నెలల వయసు ఉంటుందని, వీటి తల్లి రిజర్వ్ లో నివసిస్తున్న టి-73 అయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అంతేకాక ఆ పెద్దపులి మరిన్ని పిల్లలను కూడ కని ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
జోన్ లో అత్యంత ఎక్కువమంది సందర్శించిన పులిగా పేరుతెచ్చుకున్న... అకాసుందరి పేరుగల టి-17 కు పుట్టిన ఆడపులే టి-73 అని, ఇప్పుడు ఈ టి-73 కూడ ముద్దులొలికే పులి కూనలను కనడం ఎంతో ఆనందంగా ఉందని అధికారులు చెప్తున్నారు. దీనికి తోడు తాను ఉండేందుకు ఈ ప్రాంతాన్ని ఎంచుకుని, ఇక్కడే నివసిస్తున్న మొదటి ఆడపులి ఈ టి-73 అని, చాలా కాలం తర్వాత ఇక్కడే ఈ పులి పిల్లలను పెట్టడం వన్యప్రాణ ప్రేమికులకు నిజంగానే శుభవార్త అని అధికారులు అంటున్నారు. ఈ అభయారణ్యంలో మరిన్ని ఆడ పులులు పిల్లలు పెట్టి ఉండొచ్చని వాటిని కూడ గుర్తిస్తామని తెలిపారు.