సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రజాస్వామ్య దేశంలో ప్రజలను పాలించాలని నేతల వారసులు తహతహలాడుతున్న కారణంగా రాజకీయాలు, ఎన్నికలు వ్యాపారమై పోయాయని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ కిరుబాకరన్ వ్యాఖ్యానించారు. లోక్‌సభకు పోటీచేసే వారు ముందుగా ఇంగ్లిష్ నేర్చుకుంటే మంచిదని హితవు పలికారు. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు వేర్వేరు మేనిఫెస్టోలను విడుదల చేయాలని, ఆయా మేనిఫెస్టోలను నామినేషన్ పత్రంతో జత చేసేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ తిరుచెందూరుకు చెందిన న్యాయవాది రామ్‌కుమార్ ఆదిత్యన్ మదురై హైకోర్టు శాఖలో పిటిషన్ వేశారు.
ఇది ఈనెల 13న విచారణకు రాగా ఈ పిటిషన్‌ను సుమోటాగా స్వీకరించిన హైకోర్టు తమిళనాడులోని బీజేపీ, కాంగ్రెస్, డీఎంకే, అన్నాడీఎంకే తదితర 16 పార్టీలను ప్రతివాదులుగా చేర్చి నోటీసులిచ్చింది. ఈ కేసు మంగళవారం మరోసారి విచారణకు రాగా న్యాయమూర్తులు జస్టిస్ కిరుబాకరన్, జస్టిస్ ఎస్‌ఎస్ సుందర్ మాట్లాడుతూ ఈ పిటిషన్‌కు సంబంధించి అనేకసార్లు నోటీసులు ఇచ్చినా పార్టీల తరఫున నేతలు కాకుండా న్యాయవాదులు మాత్రమే హాజరైయ్యారని ఆక్షేపించారు. కోర్టు నోటీసులను నిర్లక్ష్యం చేసినందుకు ఆయా 16 పార్టీలు తలా రూ.లక్ష జరిమానా చెల్లించాలని, ఈ మొత్తాన్ని రక్షణ శాఖలోని దివంగత సైనికుల వితంతువుల నిధికి అందజేయాలని ఆదేశించారు.
వారసులొస్తే తప్పేంటి..?
రాజకీయాల్లోకి వారసులు రాకూడదని ఎక్కడా చట్టం లేదని..వస్తే తప్పేంటని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం బుధవారం వ్యాఖ్యానించారు. ప్రజా సేవకు అర్హత కలిగిన అభ్యర్థిని ప్రజలు ఎన్నుకుంటారని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment