Dynastic politics
-
ఇంగ్లీష్ రాని వారంతా లోక్‌సభకు పోటీనా?
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రజాస్వామ్య దేశంలో ప్రజలను పాలించాలని నేతల వారసులు తహతహలాడుతున్న కారణంగా రాజకీయాలు, ఎన్నికలు వ్యాపారమై పోయాయని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ కిరుబాకరన్ వ్యాఖ్యానించారు. లోక్‌సభకు పోటీచేసే వారు ముందుగా ఇంగ్లిష్ నేర్చుకుంటే మంచిదని హితవు పలికారు. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు వేర్వేరు మేనిఫెస్టోలను విడుదల చేయాలని, ఆయా మేనిఫెస్టోలను నామినేషన్ పత్రంతో జత చేసేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ తిరుచెందూరుకు చెందిన న్యాయవాది రామ్‌కుమార్ ఆదిత్యన్ మదురై హైకోర్టు శాఖలో పిటిషన్ వేశారు. ఇది ఈనెల 13న విచారణకు రాగా ఈ పిటిషన్‌ను సుమోటాగా స్వీకరించిన హైకోర్టు తమిళనాడులోని బీజేపీ, కాంగ్రెస్, డీఎంకే, అన్నాడీఎంకే తదితర 16 పార్టీలను ప్రతివాదులుగా చేర్చి నోటీసులిచ్చింది. ఈ కేసు మంగళవారం మరోసారి విచారణకు రాగా న్యాయమూర్తులు జస్టిస్ కిరుబాకరన్, జస్టిస్ ఎస్ఎస్ సుందర్ మాట్లాడుతూ ఈ పిటిషన్‌కు సంబంధించి అనేకసార్లు నోటీసులు ఇచ్చినా పార్టీల తరఫున నేతలు కాకుండా న్యాయవాదులు మాత్రమే హాజరైయ్యారని ఆక్షేపించారు. కోర్టు నోటీసులను నిర్లక్ష్యం చేసినందుకు ఆయా 16 పార్టీలు తలా రూ.లక్ష జరిమానా చెల్లించాలని, ఈ మొత్తాన్ని రక్షణ శాఖలోని దివంగత సైనికుల వితంతువుల నిధికి అందజేయాలని ఆదేశించారు. వారసులొస్తే తప్పేంటి..? రాజకీయాల్లోకి వారసులు రాకూడదని ఎక్కడా చట్టం లేదని..వస్తే తప్పేంటని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం బుధవారం వ్యాఖ్యానించారు. ప్రజా సేవకు అర్హత కలిగిన అభ్యర్థిని ప్రజలు ఎన్నుకుంటారని వ్యాఖ్యానించారు. -
భిక్షాటన చేయాలా లేక రాజకీయాల్లోకి ప్రవేశించాలా!
సాక్షి వెబ్ ప్రత్యేకం (భోపాల్): కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలకు చిరునామా అని కాంగ్రెస్‌ను ఎద్దేవా చేసే కమలనాథులు ఇప్పుడు స్వరం మార్చి తమ వారసుల రాజకీయ భవిష్యత్తు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్నాళ్లూ ప్రత్యర్థి కాంగ్రెస్‌ను విమర్శించిన వారే ఇప్పుడు తమ పిల్లలకు ఎన్నికల్లో పోటీచేసే అవకాశమివ్వాలని పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇందుకు ఉదాహరణగా మధ్యప్రదేశ్ విపక్ష బీజేపీ నేత గోపాల్ భార్గవ మాటల్ని చెప్పవచ్చు. బీజేపీ సీనియర్ నాయకులు తమ వారసులకు లోక్‌సభ టిక్కెట్ల కోసం ఆశిస్తున్నారట, నిజమేనా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. ‘‘రైతు కొడుకు మళ్లీ తండ్రిలాగే వ్యవసాయం, అధికారి కుమారుడు తిరిగి తన నాన్నలాగే సేవారంగం, వ్యాపారి తనయుడు వ్యాపారం చేయగా లేనిది.. 20 సంవత్సరాలు ప్రజల్లో ఉన్న రాజకీయ నాయకుల వారసులు భిక్షాటన చేయాలా లేక రాజకీయాల్లోకి ప్రవేశించాలా’’ అని ఘాటుగా సమాధానమిచ్చారు. సోషల్ మీడియాను యాక్టివ్‌గా ఉపయోగించే గోపాల్ భార్గవ కుమారుడు అభిషేక్ ప్రస్తుత మధ్యప్రదేశ్ బీజేపీ యువజన మోర్చా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. వారసులూ అర్హులే.. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన గౌరీశంకర్ కూడా తన కూతురు మౌసమ్ బీ సేన్‌కు బాలాఘాట్ నియోజకవర్గ లోక్‌సభ టిక్కెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. 25 సంవత్సరాలు నిండి, పార్టీ భావజాలానికి అనుగుణంగా పనిచేసే నేతల వారసులు ఎంపీ సీట్లలో పోటీ చేయడానికి పూర్తిగా అర్హులని.. వారికి పార్టీ టిక్కెట్లు ఇవ్వాలని గౌరీ శంకర్ మీడియాతో అన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్వార్గియా మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడి కోసం మొన్నటి మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండోర్-3 నియోజకవర్గ సీటును వదులుకున్నానని , నాయకుల తనయులు టిక్కెట్లను ఆశించడంలో తప్పులేదని, కానీ సీట్ల కేటాయింపులో అంతిమ నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికే వదిలేస్తున్నామని తెలిపారు. పెరుగుతున్న ఒత్తిడి.. ఆగని విమర్శల తాకిడి మాజీ మంత్రి గౌరీ శంకర్ షెజ్వార్ తనయుడు ముదిత్ ఈసారి లోక్‌సభ టిక్కెట్ దక్కించుకున్నారు. లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ కుమారుడు మందర్, నరేంద్ర సింగ్ తోమర్ వారసుడు దేవేంద్రకు బీజేపీ టిక్కెట్లు ఇవ్వడానికి నిరాకరించింది. సీనియర్ నాయకుడు రాఘవాజీ తన కుమార్తె జ్యోతి షాను అసెంబ్లీ ఎన్నికల బరిలో దించాలని ప్రయత్నించినా బీజేపీ హైకమాండ్ తిరస్కరించింది. నిరుత్సాహపడిన రాఘవాజీ తన తనయకు లోక్‌సభ ఎన్నికల్లోనైనా పార్టీ నుంచి పోటీ చేసే అవకాశమివ్వాల్సిందేనని బీజేపీపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. బీజేపీలో జరుగుతున్న వారసత్వ రగడను చూసి కాంగ్రెస్ సంబరపడుతోంది. ఇన్ని రోజుల నుంచి తమను విమర్శిస్తూ వచ్చిన కాషాయ నేతలపై ఇదే అదనుగా హస్తం నేతలు వాగ్బాణాలను సంధిస్తున్నారు. పార్టీలో నెలకొన్న వారసత్వ కుంపట్లను బీజేపీ అధిష్టానం ఎలా చల్లారుస్తుందో చూడాలి. -
వారసత్వ రాజకీయాలు వద్దు: మోదీ
హిస్సార్: హర్యానాలో వారసత్వ రాజకీయాలకు ముగింపు పలకాలని ఓటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 'కుటుంబ పాలన' నుంచి హర్యానాకు విముక్తి కల్పించాల్సిన అవసరముందన్నారు. హిస్సార్ లో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్నే ఎన్నుకోవాలని ఓటర్లకు సూచించారు. హర్యానాలో అన్ని రాజకీయ పార్టీలు వారసత్వ రాజకీయాలు చేస్తున్నాయని మోదీ విమర్శించారు. బీజేపీకి పూర్తి ఆధిక్యం కట్టబెట్టాలని ఆయన కోరారు. -
అన్ని పార్టీల్లో వారసత్వ రాజకీయాలున్నాయి: దిగ్విజయ్
దేశంలో వారసత్వ రాజకీయాలు సాధారణమేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సమర్థించారు. అన్ని పార్టీలలోనూ వారసత్వ రాజకీయాలు ఉన్నాయని పేర్కొన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ వారసత్వ రాజకీయాల్ని బద్దలు కొడదామంటూ చేసిన వ్యాఖ్యలకు దిగ్విజయ్ పైవిధంగా స్పందించారు. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి దిగ్విజయ్ ఆచితూచి మాట్లాడారు. రాష్ట్ర విభజన అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు రాసిన లేఖను చూడలేదని చెప్పారు. విభజన ప్రక్రియకు సంబంధించి రాజ్యాంగ నియమావళి ప్రకారం నడుచుకోవాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్లకు కిరణ్ లేఖలు రాశారు. -
రాహుల్ ను 'షెహజాదే' అనడం మానుకుంటాను: మోడీ
వారసత్వ రాజకీయాలకు ముగింపు పలికితే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని షెహజాదే(యువరాజు) అని తాను అనడం మానుకుంటానని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. తాను రాహుల్ ను షెహజాదే అనడం కాంగ్రెస్ నాయకులకు ఇబ్బందికి గురిచేస్తోంది. నాయకులకు నిద్ర కూడ పట్టడం లేదు అని బీహార్ లో పాట్నాలోని గాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన హుంకార్ ర్యాలీలో మోడీ అన్నారు. గత మూడేళ్లలో బీహార్ లో ఓ సభలో పాల్గొనడం ఇదే తొలిసారి అని అన్నాడు. వారసత్వ రాజకీయాలతో ప్రజలు విసిగెత్తారని ఆయన అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనం పడటానికి వారసత్వ రాజకీయాలు, కుటుంబ పాలన, కులం, మతం, అవకాశవాదం కారణమన్నారు.