
బ్యానర్లు, కటౌట్ల తొలగించాల్సిందే
రాజధాని నగరంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిజిటల్ బ్యానర్లను తొలగించాల్సిందేనని గురువారం మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. అన్నీ తొలగించాక నివేదిక సమర్పించాలని సూచించింది.
సాక్షి, చెన్నై: రాష్ర్టంలో బ్యానర్లు, డిజిటల్ బ్యానర్లు, కటౌట్ల సంస్కృతి తాండవం చేస్తున్నది. రాజకీయ పక్షాలు తమ పార్టీల నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆహ్వానాలు పలుకుతూ ఇష్టారాజ్యంగా ఎక్కడ బడితే అక్కడ బ్యానర్లను ఏర్పాటు చేసేస్తున్నారు. వీటిపై సంఘ సేవకుడు ట్రాఫిక్ రామస్వామి ఎప్పటి నుంచో కోర్టులో పోరాడుతూ వస్తున్నారు. కోర్టు ఆదేశాలిచ్చినా అమలు పరిచే వాళ్లు లేకపోవడంతో చివరకు తానే స్వయంగా రంగంలోకి దిగి అక్కడక్కడ ఉండే బ్యానర్లను ట్రాఫిక్ రామస్వామి తొలగించారు. దీంతో బ్యానర్లు, కటౌట్ల ఏర్పాటుకు ఆంక్షల కొరడాను కోర్టు ఝుళిపించింది. ముందుస్తు అనుమతిని తప్పనిసరి చేసింది. సభలు, సమావేశాలు ముగిసిన మరుసటి రోజున రోడ్ల మీద ఉండే బ్యానర్లను సంబంధిత పార్టీలు, వ్యక్తులు తొలగించని పక్షంలో వాటిని తొలగించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలను అమలు పరిచే వాళ్లే లేరు. దీంతో మళ్లీ ఇష్టారాజ్యంగా బ్యానర్లు వెలుస్తూ వస్తున్నాయి.
వీటి పుణ్యమా అని వాహన చోదకులు తంటాలు పడాల్సిన పరిస్థితి. అనేక చోట్ల ఫుట్ పాత్‌లను బ్యానర్లు ఆక్రమించేస్తున్నారు. దీన్ని ఆధారంగా చేసుకుని ట్రాఫిక్ రామస్వామి మళ్లీ హైకోర్టు మెట్లు ఎక్కారు. తొలగించాల్సిందే: నగరంలో ముందస్తు అనుమతులు లేకుండానే, ఇష్టా రాజ్యంగా బ్యానర్లు వెలుస్తున్నాయంటూ ట్రాఫిక్ రామస్వామి దాఖలు చేసిన పిటిషన్ విచారణ బుధవారం సాయంత్రం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అగ్ని హోత్రి, న్యాయమూర్తి సుందరేషన్‌ల నేతృత్వంలోని తొలి బెంచ్ విచారించింది. బ్యానర్లను తొలగించాల్సిందేనని కోర్టు ఆదేశించింది. ఇదే పిటిషన్ విచారణ గురువారం సైతం సాగింది. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ సోమయాజులు హాజరై వివరణ ఇచ్చారు. చెన్నైలో అనుమతులు లేని డిజిటల్ బ్యానర్లన్నీ తొలగించ మాని, ఈ పిటిషన్ విచారణ ముగించాలని సూచించారు. అయితే, న్యాయమూర్తులు ఆయన వాదనతో ఏకీ భవించలేదు. చెన్నైలోనే కాదు,
రాష్ట్ర వ్యాప్తంగా అనుమతులు లేకుండా వెలసిన ప్రతి డిజిటల్ బ్యానర్‌ను తొలగించాల్సిందేనని ఆదేశాలు ఇచ్చారు. వాటిని తొలగించే విధంగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఉత్తర్వులు ఇచ్చారు. తొలగించిన తర్వాత ఆయా జిల్లాల నుంచి ప్రత్యేక నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. ట్రాఫిక్ రాస్తారోకో : కోర్టులోనే కాదు, రోడ్డు మీద సైతం పోరాడుతోన్న ట్రాఫిక్ రామస్వామి ఉదయం రోడ్డెక్కారు. మెరీనా తీరంలో సీఎం జయలలితకు శుభాకాంక్షలు, ఆహ్వానాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన బ్యానర్లను తొలగించాలని పట్టుబడుతూ కామరాజర్ రోడ్డులోని డీజీపీ కార్యాలయం ఎ దుట ఆయన బైఠాయించారు. తానొక్కడినే రోడ్డు మీద బైఠాయించినా, అధికారులు గుండెల్లో మాత్రం గుబులు పుట్టించారు. ట్రాఫిక్ రామస్వామిని బుజ్జగించేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. ఆ బ్యానర్లను తొలగించే వరకు తాను కదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చివరకు ఆ బ్యానర్లు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాటి తొలగింపుతో తన ఆందోళనను ట్రాఫిక్ రామస్వామి విరమించారు. ఆయన ఆందోళన పుణ్యమా అని కాసేపు మెరీనా తీరంలోని కామరాజర్ రోడ్డులో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగాయి.