జయ మృతిపై అనుమానాలున్నాయి
► ఆమె మృతదేహాన్ని వెలికితీసి ఎందుకు పరీక్షించకూడదో చెప్పండి
► కేంద్రంతో పాటు తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు ప్రశ్న
సాక్షి ప్రతినిధి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి వెనుక సందేహాలు ఉన్నందున ఆమె పార్థివదేహాన్ని వెలికితీసి ఎందుకు పరీక్షించకూడదో చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. పిటిషనర్‌కే గాక తమకు కూడా వ్యక్తిగతంగా సందేహాలు ఉన్నాయని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. అసలేం జరిగిందో ప్రజలకు తెలియాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయంతో పాటు కేంద్ర హోం శాఖ, న్యాయ శాఖ, సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, అపోలో ఆస్పత్రి చైర్మన్ తదితరులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ‘అమ్మ’ మృతి అనుమానాస్పదమని పేర్కొంటూ చెన్నైకి చెందిన అన్నాడీఎంకే కార్యకర్త పీఏ జోసెఫ్ మద్రాస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
జయలలిత ఆరోగ్యం మెరుగుపడుతోందని, త్వరలో ఇంటికి చేరుకుంటారని అపోలో యాజమాన్యం ప్రకటిస్తూ వచ్చిందని, ఈ నెల 4న జయలలితకు గుండెపోటు రావడానికి కొద్దిసేపటికి ముందు కూడా జయ క్షేమంగా ఉన్నారని ప్రకటించారని పిటిషనర్ పేర్కొన్నాడు. 5వ తేదీ సాయంత్రం కూడా ఆమె మరణించిందనే వార్తలను ఖండించారని, కానీ అదే రోజు రాత్రి జయలలిత మరణించిందని చేసిన ప్రకటన అనేక సందేహాలకు తెరదీసిందని పిటిషనర్ పేర్కొన్నాడు. పిటిషన్ ను న్యాయమూర్తులు జస్టిస్ వైద్యనాథన్ , జస్టిస్ వి.పార్తిబన్ తో కూడిన వెకేషన్ బెంచ్ గురువారం విచారించింది.
సందేహాలు తొలగించాల్సిందే..
పిటిషనర్ లేవనెత్తిన అంశాలను తోసిపుచ్చలేమని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. జయలలిత మృతిపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. అన్ని విషయాలు తెలిసినప్పటికి కేంద్రప్రభుత్వం కూడా నోరు మెదపడం లేదని పేర్కొన్నారు. గతంలో విదేశాల్లో చికిత్స పొందుతున్న సమయంలో మాజీ సీఎం ఎమ్జీఆర్ ఫొటోనే విడుదల చేసినప్పుడు.. చెన్నైలోనే చికిత్స పొందుతున్న జయలలిత ఫొటోను ఎందుకు విడుదల చేయలేదని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఒక న్యాయమూర్తి అనే విషయాన్ని పక్కనపెట్టి వ్యక్తిగతంగా తనకు కూడా అనేక అనుమానాలున్నాయని న్యాయమూర్తి జస్టిస్ వైద్యనాథన్ పేర్కొన్నారు.
జయలలిత కోలుకుంటున్నారని ఒకరోజు, పేపర్లపై సంతకాలు చేస్తున్నారని మరోరోజు, చివరకు సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారంటూ ప్రకటించారని, మరి హఠాత్తుగా ఆమె ఎలా మరణించారని ప్రశ్నించారు. అలాగే రక్త సంబంధీకులను కూడా జయను చూసేందుకు అనుమతించలేదని, వారు ఎందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదో అర్థం కావడం లేదన్నారు. జయ మృతదేహాన్ని సమాధి నుంచి వెలికితీస్తేనే వాస్తవాలు వెలుగు చూస్తాయనే పక్షంలో.. ఇందుకు ఎం దుకు అనుమతించకూడదో చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను జస్టిస్ వైద్యనాథన్ ప్రశ్నిం చారు. తదుపరి విచారణ జనవరి 9కి వాయిదా వేశారు.
హెబియస్ కార్పస్ పిటిషన్ కొట్టివేత
అన్నాడీఎంకే కార్యకర్తల చేతిలో దాడికి గురైన శశికళ పుష్ప భర్త లింగేశ్వర తిలకన్ ను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ ను గురువారం మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. బెయిల్‌పై ఆయన ఇప్పటికే విడుదలైనందున విచారణ అవసరం లేదని జస్టిస్ ఎస్ వైదయనాథన్, జస్టిస్ వి. పార్థీభన్ లతో కూడిన ధర్మాసనం తేల్చిచెప్పింది.