
నాగ్‌పూర్: మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర రైతులకు తీపి కబురు అందించింది. రూ. 2 లక్షల వరకూ ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తున్నట్లు సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. 2019 సెప్టెంబర్ 30 వరకూ ఉన్న రుణాలు మాఫీ చేయనున్నట్లు చెప్పారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన శనివారం ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ రుణమాఫీకి ‘మహాత్మా జ్యోతిరావ్ ఫూలే’ పథకంగా పేరుపెట్టారు. మాఫీకి అర్హత పొందేందుకు కొన్ని పత్రాలు అవసరమవుతాయని చెప్పారు. దీని వల్ల రూ. 40 వేల కోట్ల భారం ప్రభుత్వంపై పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
లోన్ల మాఫీ కోసం గత ప్రభుత్వంలో మాదిరి గంటల తరబడి వరుసల్లో నిలబడాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి జయంత్ పాటిల్ చెప్పారు. కేవలం ఆధార్ కార్డుతో బ్యాంకుకు వెళితే సరిపోతుందని చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులని చెప్పారు. రుణమాఫీకి రూ. 2 లక్షల పరిమితి పెట్టడంపై బీజేపీ మండిపడింది. రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి ఉద్ధవ్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించారు. దీనిపై తాము రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని చెప్పారు. అకాల వర్షం కారణంగా అక్టోబర్ నెలలో పంట నష్టంతో దెబ్బ తిన్న రైతులను ఆదుకోవడంలో కూడా ప్రభుత్వం విఫలమైందన్నారు. 2017లో అప్పటి బీజేపీ–శివసేన ప్రభుత్వం 50 లక్షల మంది రైతులకు చెందిన రూ. 19 వేల కోట్ల రుణాలను చెల్లించింది.
Comments
Please login to add a commentAdd a comment