థానే : ఆధార్ లింక్ పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు ఓ సీనియర్ సిటిజన్ అకౌంట్ నుంచి వేల రూపాయలు స్వాహా చేశారు. కోప్రి పోలీసు స్టేషన్ పరిధిలో ఇది చోటు చేసుకుంది. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఐపీసీ సంబంధిత చట్టాల కింద దీనిపై కోప్రి పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన బపురావు షింగోట్‌కు ఏప్రిల్ 2న ఓ ఫోన్ కాల్ వచ్చింది. మీ బ్యాంకు అకౌంట్‌ను, ఆధార్ నెంబర్‌తో లింక్ చేస్తున్నామని ఆ ఫోన్ చేసిన వ్యక్తులు చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి మీ మొబైల్ నెంబర్‌కు పంపిన ‘వెరిఫికేషన్ కోడ్’ను పంపించమని వారు అడిగారు. టెక్ట్స్ మెసేజ్ రూపంలో తాను పొందిన మెసేజ్‌ను షింగోట్ వారికి చెప్పాడు.
ఇక అంతే, షింగోట్ అకౌంట్ నుంచి కొద్ది క్షణాల్లో 75 వేల రూపాయలు విత్‌డ్రా అయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు తన బ్యాంకు అకౌంట్ నుంచి నగదు విత్‌డ్రా చేశారని తెలుసుకున్న షింగోట్ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. బ్యాంకులు నగదును ఆన్‌లైన్‌లో ట్రాన్సఫర్ చేయాలంటే వన్ టైమ్ పాస్‌వర్డ్‌లు ఎంతో అవసరం. ఓటీపీ టైప్ చేస్తే, లావాదేవీ పూర్తవుతుంది. దీన్నే క్యాష్ చేసుకున్న కొందరు బ్యాంకు వారిగా కాల్స్ చేస్తూ.. ఆధార్ లింక్ ప్రక్రియ చేపడుతున్నామంటూ... ఈ వన్‌టైమ్ పాస్‌వర్డ్‌ను రాబడుతున్నారు. నిజంగానే బ్యాంకు అధికారులు ఆధార్ లింక్ చేపడుతున్నారని భావిస్తున్న కస్టమర్లు ఈ పాస్‌వర్డ్ చెప్పి వేల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ప్రస్తుతం దీనిపై కేసు నమోదు చేసుకున్న కోప్రి పోలీసులు దీనిపై విచారణ చేపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment