'ఆమెది రూ.200 కోట్ల కుంభకోణం'
ముంబయి: మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే దాదాపు రూ.200 కోట్ల కుంభకోణానికి పాల్పడిందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. పాఠశాలకు సంబంధించి కొనుగోలు చేసిన వస్తువుల విషయంలో కనీస ప్రమాణాలు కూడా పాటించలేదని, వీటికి చెందిన పూర్తి ఆధారాలు, దస్తావేజులతో సహా తమ వద్ద ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. పంకజ ముండే బీజేపీ ప్రముఖ నేత గోపినాథ్ కుమార్తె. వివిధ ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు, వాటర్ ఫిల్టర్స్ కొనుగోలు చేసే విధానంలో ప్రాథమిక విధి విధానాలను పాటించలేదని, దీని ద్వారా ఆమె 200 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు. గిరిజన విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దించే బాధ్యత చూడాల్సిన ఓ మంత్రి ఇలాంటి చర్యలకు పాల్పడటం ఏమాత్రం గర్హనీయం కాదని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆరోపించింది.
మహారాష్ట్రలో పంకజ మహిళా శిశు సంక్షేమశాఖను నిర్వహిస్తున్నారు. గత ఫిబ్రవరి 13న పాఠశాలల పరికరాల కోసం ఆమె మొత్తం 24 కాంట్రాక్టులకు ఆమోదం తెలిపారని, ఆ సమయంలో కనీస పద్ధతులు పాటించకుండా కుంభకోణానికి తెర లేపారని ఆరోపించారు. ఇదిలా ఉండగా, లక్ష రూపాయలు పై బడిన ప్రతి వస్తువు కొనుగోలు కోసం టెండర్లు ఖచ్చితంగా పిలవాలని తాను కఠిన నిబంధనలు విధించానని రాష్ట్ర ఆర్థికమంత్రి సుధీర్ ముంగన్ తివార్ తెలిపారు.
కాగా, తనపై వచ్చిన ఆరోపణలు పంకజ ముండే ఖండించారు. తాను ఎలాంటి నిబంధనలు అతిక్రమించలేదని, ప్రభుత్వం సూచించిన ధరల ప్రకారమే వాటిని కొనుగోలు చేశామని చెప్పారు. ఈ కొనుగోళ్లు జరిపే సమయంలో ఆన్లైన్ టెండర్ పద్ధతి ఇంకా ప్రారంభకాలేదని వివరణ ఇచ్చారు.