* కాంగ్రెస్, ఎన్సీపీ మధ్యపెరుగుతున్న దూరం
* పరస్పరం విమర్శలుచేసుకుంటున్న పార్టీలు
* అసెంబ్లీ సీట్ల పంపకంలో తకరారు
* ఒంటరి పోరుకు సై అంటే సై అంటున్న మిత్రపక్షాలు
సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య సీట్ల పంపకాలపై నెలకొన్న విభేదాలు మరింత ముదిరి పాకాన పడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఈ కూటమి ఘోరపరాజయం పొందిన విషయం తెలిసిందే. అయినా అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపై రెండు పార్టీల మధ్య పొంతన కుదరడంలేదు. రోజురోజుకీ రెండు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు తీవ్రంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒంటరిపోరుకు సై అంటే సై అంటున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా ఎన్సీపీ నేత డి.పి.త్రిపాఠి వ్యాఖ్యలు ఈ రెండు పార్టీల మధ్య దూరాన్ని మరింత పెంచే అవకాశం కనిపిస్తోంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజాస్వామ్య కూటమిలో సీట్ల పంపకాలపై ఢిల్లీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మిత్రపక్షంతో ప్రభుత్వాన్ని నడిపించడం కాంగ్రెస్‌కు తెలియదని విమర్శించారు. మిత్రపక్షాలను అణగదొక్కేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందన్నారు.
ఒంటరి పోరుకు దిగుతామని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు కూటమికి చేటు చేస్తాయనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. లోక్‌సభలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే ఆ పార్టీకి అసెంబ్లీలో ఎక్కువ స్థానాలు కేటాయించాలనేది తమ మధ్య ఉన్న ఒప్పందమని, దానికి కాంగ్రెస్ తూట్లు పొడుస్తోందని వ్యాఖ్యానించారు. లోకసభ ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్ కంటే ఎన్సీపీకి అధిక స్థానాలు లభించాయి. దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే అధిక సీట్లు ఎన్సీపీకి కేటాయించాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు.
అయినా ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, పార్టీ రాష్ట్ర సునీల్‌తట్కరే కూడా 144 సీట్లు ఇవ్వాల్సిందేనని కోరుతున్నారని చెప్పారు. 2009 అత్యధికంగా లోకసభ సీట్లు కాంగ్రెస్‌కు ఉండడంతో అసెంబ్లీలో అధిక స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది. ఈసారి తమ పార్టీకి లోక్‌సభ సీట్లు అధికంగా ఉన్నాయని, దీంతో తమకు 144 సీట్లు ఇవ్వాల్సిందేనని సునీల్ తట్కరే డిమాండ్ చేశారని పేర్కొన్నారు.
కాగా దీనిపై ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే స్పందిసూ.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఎన్సీపీ కోరిన న్ని సీట్లు ఇవ్వడానికి తాము సిద్ధంగా లేమన్నారు. గత ఒప్పందాల మేరకే సీట్ల కేటాయింపులుంటాయని, లేనిపక్షంలో ఎవరి దారి వాళ్లు చూసుకుందామని ఘాటుగా స్పష్టం చేశారు.
ఆశావహులనుంచి దరఖాస్తుల ఆహ్వానం
ముంబై: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఎంపీసీసీ) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు అన్ని జిల్లా యూనిట్ కార్యాలయాలకు ఎంపీసీసీ నుంచి లేఖలు అందాయి. పార్టీ జిల్లా కార్యాలయాల్లో దరఖాస్తులు అందుబాటులో ఉన్నట్లు పార్టీ అధికార ప్రతినిధి సచిన్ సావంత్ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు నింపి తిలక్‌భవన్‌లో ఉన్న రాష్ట్ర పార్టీ కార్యాలయానికి ఈ నెల 11వ తేదీలోగా పంపాలని కోరారు.
రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా, గత ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిగా పోటీచేసి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. అప్పుడు 174 స్థానాల్లో కాంగ్రెస్, 114 స్థానాల్లో ఎన్సీపీ పోటీచేసిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఎన్సీపీ 144 స్థానాలు కావాలని డిమాండ్ చేస్తోంది. దీంతో రెండుపార్టీల మధ్య విభేదాలు పొడసూపుతున్నాయి. ఎన్సీపీకి మరో 10 సీట్లు అదనంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న కాంగ్రెస్, 50ః50 ఫార్ములాకు అంగీకరించడంలేదు.
డీఎఫ్‌కు బీటలు?.
Published Fri, Aug 1 2014 10:56 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement