సంచార హోటల్‌కు సన్నాహం | Maharashtra Tourism Development Corporation set up a five star hotel at Gorai Sea coast | Sakshi
Sakshi News home page

సంచార హోటల్‌కు సన్నాహం

Published Sun, Jul 6 2014 11:24 PM | Last Updated on Mon, Oct 8 2018 6:16 PM

Maharashtra Tourism Development Corporation set up a five star hotel at Gorai Sea coast

సాక్షి, ముంబై : ముంబైకి అంతర్జాతీయ నగరంగా గుర్తింపు లభించడంతోపాటు పర్యాటకుల సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో మహారాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్థి సంస్థ (ఎంటీడీసీ) వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ‘లండన్ ఐ’ తరహాలో ముంబైలోని గొరాయి సముద్ర తీరం (బీచ్)లో సూపర్ స్పెషాలిటీ ‘సుదర్శన్ చక్ర’ పేరుతో ఐదు నక్షత్రాల సంచార హోటల్ ఎంటీడీసీ ఏర్పాటు చేయాలని సంకల్పించింది.

 ఐఫిల్ టవర్ మోడల్‌గా నిర్మించి దాని మధ్యలో ఈ సుదర్శన చక్రం ఉంటుంది. అది జెయింట్ వీల్‌లాగా తిరుగుతుంటే అందులో పర్యాటకులు కూర్చుండి ఐదు నక్షత్రాల హోటల్ మాదిరిగా భోజనం, అల్పాహారం, టీ ఆస్వాదించవచ్చు. ఈ సుదర్శన చక్రం 958 అడుగుల ఎత్తు ఉంటుంది. ఒకవేళ ఇది కార్యరూపం దాలిస్తే ప్రపంచంలోనే మొదటి సంచార ఫైవ్ స్టార్ హోటల్‌గా పేరుగాంచనుంది.

 అంచనా వ్యయం : ఈ ప్రాజెక్టు పూర్తిచేయడానికి సుమారు ఐదు నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనావేశారు. ప్రైవేటు రంగాల భాగస్వామ్యంతో దీన్ని ఏర్పాటు చేయాలని ఎంటీడీసీ యోచిస్తోంది. మే లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రజెంటేషన్‌ను ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటాకు చూపించారు. టాటాతోపాటు ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఎల్ అండ్ టీ ఆసక్తి కనబరుస్తున్నట్లు ఎంటీడీసీ ఎండీ సతీష్ సోనీ, ఇంజనీర్ రాహుల్ వసయికర్ చెప్పారు.

 హోటల్ రూపశిల్పి ఆనంద్‌షా
 నగర్ జిల్లాకు చెందిన ఆనంద్ షా ఈ సుదర్శన్ చక్ర సంచార ఫైవ్‌స్టార్ హోటల్‌కు రూపకల్పన చేశారు. ఆయన వద్ద పేటెంట్ హక్కులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టును గుజరాత్‌లో చేపట్టాలని గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కూడా పట్టుబట్టారు. అందుకు మోడీ షాతో ప్రత్యక్షంగా చర్చలు కూడా జరిపారు. కానీ ఇలాంటి కీలకమైన ప్రాజెక్టు ముంబైలోనే చేపట్టాలనేది తన అభిలాష అని చెప్పడంతో మోడీ ఊరుకున్నారు. త్వరలో షా తో ఎంటీడీసీ ఒప్పందం కుదుర్చుకోనుంది.

 ప్రత్యేకతలు...........
 లండన్ ఐ ఎత్తు 443 అడుగులు ఎత్తు ఉండగా దీనికి రెట్టింపు అంటే 958 అడుగుల ఎత్తున సుదర్శన్ చక్ర ఉంటుంది. ఐఫిల్ టవర్ ఎత్తు 1,062 అడుగులు ఉంది.

{పతిపాదిత స్థలంలో అ ఆకారంలో రెండు 28 అంతస్తుల ట్విన్ టవర్లు ఉంటాయి. ఈ రెండు భవనాల మధ్యలో నుంచి ఈ చక్రం తిరుగుతుంటుంది.

 ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టిన కంపెనీకి 20 లక్షల చ.ట. స్థలం కమర్షియల్ డెవలప్‌మెంట్ కోసం లభించనుంది.

 ఈ హోటల్‌లో ఫ్యాషన్ షో, ఎగ్జిబిషన్ సెంటర్, సినిమా థియేటర్, షాపింగ్‌మాల్, షాపింగ్ సెంటర్, టూరిస్టు అక్టివిటిజ్  ఇలా ఉంటాయి.

 సుదర్శన్ చక్రంలో లోపల, వెలుపల ఇలా రెండు రింగులు ఉంటాయి. బయట రింగులో 76 డిస్క్‌లు ఉంటాయి. ఇందులో 38 డిస్క్‌లు అల్పాహారం, ఇతర తినుబండారాలు ఆరగించేందుకు పర్యాటకుల కోసం రిజర్వు చేస్తారు.

 లోపలి రింగులో 38 డిస్క్‌లు ఉంటాయి. ఇందులో ఐదు నక్షత్రాల హోటల్ నిర్మిస్తారు. ఇందులో బస చేసేందుకు సౌకర్యం ఉంటుంది.  

 సుదర్శన చక్రం ఒక్క చుట్టు పూర్తిచేయడానికి కనీసం గంట సమయం పడుతుంది. అది తిరుగుతున్నట్లు పర్యాటకులకు తెలియదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement