Maharashtra Tourism Development Corporation (MTDC)
-
మూడు పుణ్యక్షేత్రాలకు త్వరలో సీ ప్లేన్ సేవలు
ముంబై: షిర్డీవాసులతోపాటు సాయిభక్తులకు శుభవార్త. ఈ నెల 19వ తేదీనుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీకి సమీపంలోని ములా డ్యాంతోపాటు శనిసింగణాపూర్, మెహరాబాద్లకు సీ ప్లేన్ సేవలు ప్రారంభం కానున్నాయి. మహారాష్ట్ర పర్యాటక సంస్థ సహకారంతో మారీటైమ్ ఎనర్జీ హెలీ ఎయిర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఈహెచ్‌ఏఐఆర్) సంస్థ ఈ సేవలను అందించనుంది. ఈ విషయాన్ని ఎంఈహెచ్‌ఏఐఆర్ డెరైక్టర్ సిద్ధార్థ్ వర్మ వెల్లడించారు. అహ్మద్‌నగర్ జిల్లాలోని ములా డ్యాంవరకు ఈ సేవలను అందిస్తామని, అందువల్ల సాయి భక్తులు వీలైనంత తక్కువ సమయంలో షిర్డీకి చేరుకోగలుగుతారన్నారు. గత నెల 25వ తేదీన ముంబై నుంచి లోణావాల మధ్య తాము ప్రారంభించిన సీప్లేన్ సేవలకు విశేష స్పందన లభించిందన్నారు. తాము ములా డ్యాం వరకూ ప్రారంభించనున్న తాజా సేవల వల్ల ఆయా పుణ్యక్షేత్రాలకు భక్తులు అత్యంత తక్కువ సమయంలోనే చేరుకుంటారన్నారు. దీంతోపాటు నాసిక్‌లోని గంగాపూర్ డ్యాం, మహాబలేశ్వర్ సమీపంలోని ధూమ్ డ్యాంలకు కూడా త్వరలోనే సీ ప్లేన్ సేవలను ప్రారంభిస్తామన్నారు. -
ముంబై దర్శన్‌లో మరిన్ని ప్రాంతాలు
సాక్షి, ముంబై: నగరానికి వచ్చే పర్యాటకులకు శుభవార్త. మహారాష్ట్ర పర్యాటక అభివృద్థి సంస్థ (ఎంటీడీసీ) ‘ముంబై దర్శన్’ జాబితాలో కొత్త ‘పర్యాటక’అందాలను చేర్చనుంది. ఇందులో బాంద్రా-వర్లీ సీ లింకు, మెట్రో, మోనో రైళ్లు ఉన్నాయి. కొన్నేళ్లుగా నగరంలో అనేక పర్యాటక ప్రాంతాలు అవిర్భవించాయి. ఇప్పటి వరకూ పర్యాటకులకు వాటి దర్శన భాగ్యం కల్పించడం లేదు. నూతన జాబితాతో త్వరలో మరిన్ని నగర అందాలు తిలకించే భాగ్యం పర్యాటకులకు లభించనుంది. సీ లింకు, మెట్రో, మోనో లాంటి ఈ కొత్త వింతలు ఆస్వాదించే అవకాశం కల్పించడానికి నిర్ణయించింది. రోజూ ఇలా.. ముంబై నగర అందాలు, పర్యాటక ప్రాంతాలను తిలకించడానికి రోజూ వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది పర్యాటకులు తరలి వస్తారు. ఇక్కడి వింతలు, విశేషాలు వారికి తెలియకపోవడంతో ఎంటీడీసీని ఆశ్రయిస్తారు. ముంబై దర్శన్ పేరుతో ప్రత్యేక బస్సుల్లో నగరంలోని పర్యాటక ప్రాంతాలను చూపిస్తారు.ఇందులో గేట్ వే ఆఫ్ ఇండియా, ఛత్రపతి శివాజీ టర్మినస్, అసెంబ్లీ భవనం, మెరైన్ డ్రైవ్, ఓవల్ మైదాన్, రాజాబాయి టవర్, ఏషియేటిక్ లైబ్రరీ, తారపోర్వాలా ఫిష్ ఎక్వేరియం, కమలా నెహ్రూ పార్క్, బూట్ బంగ్లా, బంగారు మహాలక్ష్మి, హాజీఅలీ, నెహ్రూ సెంటర్, సిద్ధివినాయక మందిరం ఇలా అనేక పర్యాటక ప్రాంతాలున్నాయి. ప్రస్తుతం కొత్తగా చేరిన సీ లింకు, మెట్రో, మోనో, ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హై వే లాంటి వింతలు కూడా పర్యాటకులకు చూపించాలని ఎంటీడీసీ నిర్ణయించింది. గణేశ్ ఉత్సవాలు పూర్తికాగానే ఈ అందాలను పర్యాటకులకు చూపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంటీడీసీ అధికారి చెప్పారు. దీని కారణంగా ముంబైకి పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని ఆయన అన్నారు. -
సంచార హోటల్‌కు సన్నాహం
సాక్షి, ముంబై : ముంబైకి అంతర్జాతీయ నగరంగా గుర్తింపు లభించడంతోపాటు పర్యాటకుల సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో మహారాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్థి సంస్థ (ఎంటీడీసీ) వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ‘లండన్ ఐ’ తరహాలో ముంబైలోని గొరాయి సముద్ర తీరం (బీచ్)లో సూపర్ స్పెషాలిటీ ‘సుదర్శన్ చక్ర’ పేరుతో ఐదు నక్షత్రాల సంచార హోటల్ ఎంటీడీసీ ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఐఫిల్ టవర్ మోడల్‌గా నిర్మించి దాని మధ్యలో ఈ సుదర్శన చక్రం ఉంటుంది. అది జెయింట్ వీల్లాగా తిరుగుతుంటే అందులో పర్యాటకులు కూర్చుండి ఐదు నక్షత్రాల హోటల్ మాదిరిగా భోజనం, అల్పాహారం, టీ ఆస్వాదించవచ్చు. ఈ సుదర్శన చక్రం 958 అడుగుల ఎత్తు ఉంటుంది. ఒకవేళ ఇది కార్యరూపం దాలిస్తే ప్రపంచంలోనే మొదటి సంచార ఫైవ్ స్టార్ హోటల్‌గా పేరుగాంచనుంది. అంచనా వ్యయం : ఈ ప్రాజెక్టు పూర్తిచేయడానికి సుమారు ఐదు నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనావేశారు. ప్రైవేటు రంగాల భాగస్వామ్యంతో దీన్ని ఏర్పాటు చేయాలని ఎంటీడీసీ యోచిస్తోంది. మే లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రజెంటేషన్‌ను ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటాకు చూపించారు. టాటాతోపాటు ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఎల్ అండ్ టీ ఆసక్తి కనబరుస్తున్నట్లు ఎంటీడీసీ ఎండీ సతీష్ సోనీ, ఇంజనీర్ రాహుల్ వసయికర్ చెప్పారు. హోటల్ రూపశిల్పి ఆనంద్షా నగర్ జిల్లాకు చెందిన ఆనంద్ షా ఈ సుదర్శన్ చక్ర సంచార ఫైవ్‌స్టార్ హోటల్‌కు రూపకల్పన చేశారు. ఆయన వద్ద పేటెంట్ హక్కులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టును గుజరాత్లో చేపట్టాలని గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కూడా పట్టుబట్టారు. అందుకు మోడీ షాతో ప్రత్యక్షంగా చర్చలు కూడా జరిపారు. కానీ ఇలాంటి కీలకమైన ప్రాజెక్టు ముంబైలోనే చేపట్టాలనేది తన అభిలాష అని చెప్పడంతో మోడీ ఊరుకున్నారు. త్వరలో షా తో ఎంటీడీసీ ఒప్పందం కుదుర్చుకోనుంది. ప్రత్యేకతలు........... లండన్ ఐ ఎత్తు 443 అడుగులు ఎత్తు ఉండగా దీనికి రెట్టింపు అంటే 958 అడుగుల ఎత్తున సుదర్శన్ చక్ర ఉంటుంది. ఐఫిల్ టవర్ ఎత్తు 1,062 అడుగులు ఉంది. {పతిపాదిత స్థలంలో అ ఆకారంలో రెండు 28 అంతస్తుల ట్విన్ టవర్లు ఉంటాయి. ఈ రెండు భవనాల మధ్యలో నుంచి ఈ చక్రం తిరుగుతుంటుంది. ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టిన కంపెనీకి 20 లక్షల చ.ట. స్థలం కమర్షియల్ డెవలప్మెంట్ కోసం లభించనుంది. ఈ హోటల్లో ఫ్యాషన్ షో, ఎగ్జిబిషన్ సెంటర్, సినిమా థియేటర్, షాపింగ్‌మాల్, షాపింగ్ సెంటర్, టూరిస్టు అక్టివిటిజ్ ఇలా ఉంటాయి. సుదర్శన్ చక్రంలో లోపల, వెలుపల ఇలా రెండు రింగులు ఉంటాయి. బయట రింగులో 76 డిస్క్‌లు ఉంటాయి. ఇందులో 38 డిస్క్‌లు అల్పాహారం, ఇతర తినుబండారాలు ఆరగించేందుకు పర్యాటకుల కోసం రిజర్వు చేస్తారు. లోపలి రింగులో 38 డిస్క్‌లు ఉంటాయి. ఇందులో ఐదు నక్షత్రాల హోటల్ నిర్మిస్తారు. ఇందులో బస చేసేందుకు సౌకర్యం ఉంటుంది. సుదర్శన చక్రం ఒక్క చుట్టు పూర్తిచేయడానికి కనీసం గంట సమయం పడుతుంది. అది తిరుగుతున్నట్లు పర్యాటకులకు తెలియదు. -
నాలుగు నెలల్లో ఫ్లోటింగ్ రెస్టారెంట్ సేవలు
సాక్షి, ముంబై: దేశంలోనే మొట్టమొదటి నీటిలో తేలియాడే హోటల్ (ఫ్లోటింగ్ రెస్టారెంట్) ఏర్పాటుచేసిన ఘనత ముంబైకే దక్కింది. దీన్ని బుధవారం బాంద్రాలో సముద్ర తీరం వద్ద పర్యాటక శాఖ మంత్రి ఛగన్ భుజ్‌బల్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ హోటల్ పర్యాటకులకు ఆగస్టు 15 లేదా సెప్టెంబర్ నుంచి సేవలందించే అవకాశాలున్నాయని భుజబల్ చెప్పారు. సుమారు రూ.102 కోట్లతో నిర్మితమైన ఈ ఆధునిక రెస్టారెంట్ ప్రతీ రోజు ముంబైకి వచ్చే వేలాది దేశ, విదేశ పర్యాటకులకు మరింత ఆకర్షణగా నిలవనుంది. మహారాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (ఎంటీడీసీ) చొరవ తీసుకోవడంవల్ల డబ్ల్యూబీ ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్, ఎ.బి.హాస్పిటాలిటీ సహకారంతో ఇది కార్యరూపం దాల్చింది. బాంద్రా-వర్లీ సీ లింక్ మార్గంలో మేరి టైం బోర్డు ఏర్పాటుచేసిన జెట్టి (ప్లాట్ఫారం) వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఈ రెస్టారెంట్లోకి వెళ్లేందుకు వీలుంటుంది. ఫ్లోటింగ్ రెస్టారెంట్ ప్రత్యేకతలు మూడంతస్తులున్న ఈ రెస్టారెంట్ అమెరికాలో తయారైంది. 360 డిగ్రీల వరకు బాంద్రా-వర్లీ సీ లింక్ వంతెనతోపాటు ముంబై అందాలను తిలకించవచ్చు. లగ్జరీ డైనింగ్ ప్ల్లాట్‌తోపాటు స్కైడెక్ ఉంది. 24 గంటలూ ఇందులో టీ, కాఫీతోపాటు ఇతర తినుబండారాలు లభిస్తాయి. వేర్వేరు అంతస్తుల్లో ఉన్న రెస్టారెంట్లలో ఒకేసారి 660 మంది కూర్చుని భోజనం, అల్పాహారాన్ని ఆస్వాదించవచ్చు. ఇది సముద్రంలో నిలిచి ఉన్నప్పటికీ ఎలాంటి పడవలు, స్టీమర్ల సాయం లేకుండా నేరుగా జెట్టి ద్వారా అందులోకి ప్రవేశించవచ్చు. -
‘ఉభయచర బస్సు’లపై ఎంటీడీసీ దృష్టి
సాక్షి, ముంబై: త్వరలో రోడ్డు, సముద్ర మార్గాల్లో నడిచే ఉభయ చర బస్సులను నగరంలో ప్రవేశపెట్టనున్నారు. ఇటీవల ప్రారంభించిన సీ ప్లేన్ సేవలకు ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందనను దృష్టిలో ఉంచుకుని త్వరలో ‘అంఫిబియస్ బస్’ సేవలు ప్రారంభించాలని మహారాష్ట్ర పర్యాటక అభివద్థి సంస్థ (ఎంటీడీసీ) యోచిస్తోంది. పెట్టుబడి పెట్టే కంపెనీల కోసం వెతుకుతోంది. దుబాయ్, మలేషియా తదితర దేశాల్లో ఇప్పటికే అమల్లో ఉన్న ఈ విధానాన్ని ఇక్కడ కూడా పరిచయం చేయాలన్న దృఢ సంకల్పంతో ముందుకెళుతోంది. ‘అంఫిబియస్ బస్‌లు నీటిలో, నేలపై నడుస్తాయి. ఈ బస్సులు రోడ్లపై టైర్ల ద్వారా నడుస్తాయి. నీటిలోకి వెళ్లగానే బస్సు కింది భాగంలో మార్పులు జరుగుతాయి. బస్సు ముందుకు వెళ్లడానికి, మలుపు తిరగడానికి ఈ టైర్లు సహకరిస్తాయి. ఇలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ బస్సులు ఇటు నేలపై, అటు నీటిపై సులభంగా వెళతాయ’ని ఎంటీడీసీ ఎండీ జగదీశ్ పాటిల్ తెలిపారు. ఈ వాహనాలలో దాదాపు 50 మంది ప్రయాణించే వీలుంటుందన్నారు. ఈ బస్సులు రోడ్డు మీది కొంత దూరం వెళ్లిన తర్వాత సముద్ర మార్గాన గమ్యాన్ని చేరేటట్లు ప్రణాళికలు రూపొంది స్తున్నామని వివరించారు. దీనివల్ల ప్రయాణికుల సమయం ఆదా అవుతుందని, పర్యాటక రంగం మరింత అభివద్థి చెందుతుందని జగదీశ్ పాటిల్ అభిప్రాయపడ్డారు. ‘ఇలాంటి బస్సులను కొనుగోలు చేయకుండా ఏదైనా ప్రైవేటు కంపెనీకి అప్పగించాలనుకుంటున్నాం. ఒకవేళ ఆసక్తిగల కంపెనీలు ముందుకు వస్తే ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల నుంచి అనుమతులు లభించేలా చూసుకుంటాం. ఈ బస్సులను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడపాలి, ఏ మార్గంలో నడిపితే లాభదాయకుంగా ఉంటుంది. ముంబై-శివారు ప్రాంతాల మధ్య నడిపేందుకు వీలుపడుతుందా..? తదితరాలపై అధ్యయనం చేయాల్సి ఉంద’ని పాటిల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం నీటిపై, గాలిలో ఎగిరే విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో నేలపై, నీటిలో నడిచే బస్సు సేవలు కూడా అందుబాటులోకి తె స్తామని పాటిల్ ధీమా వ్యక్తం చేశారు. నగరంలో రోజురోజుకూ ఉగ్రరూపం దాలుస్తున్న ట్రాఫిక్‌జామ్ సమస్య నుంచి బయటపడాలంటే ఇలాంటి సేవలు అందుబాటులోకి తీసుకురావల్సిన అవసరం ఉందన్నారు. పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉన్నతాధికారులకు విలువైన సమయం ఆదా కావాలంటే ఇలాంటి సేవలు దోహదపడతాయని వివరించారు.