సాక్షి, ముంబై: త్వరలో రోడ్డు, సముద్ర మార్గాల్లో నడిచే ఉభయ చర బస్సులను నగరంలో ప్రవేశపెట్టనున్నారు. ఇటీవల ప్రారంభించిన సీ ప్లేన్ సేవలకు ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందనను దృష్టిలో ఉంచుకుని త్వరలో ‘అంఫిబియస్ బస్’ సేవలు ప్రారంభించాలని మహారాష్ట్ర పర్యాటక అభివద్థి సంస్థ (ఎంటీడీసీ) యోచిస్తోంది. పెట్టుబడి పెట్టే కంపెనీల కోసం వెతుకుతోంది. దుబాయ్, మలేషియా తదితర దేశాల్లో ఇప్పటికే అమల్లో ఉన్న ఈ విధానాన్ని ఇక్కడ కూడా పరిచయం చేయాలన్న దృఢ సంకల్పంతో ముందుకెళుతోంది. ‘అంఫిబియస్ బస్‌లు నీటిలో, నేలపై నడుస్తాయి. ఈ బస్సులు రోడ్లపై టైర్ల ద్వారా నడుస్తాయి.
నీటిలోకి వెళ్లగానే బస్సు కింది భాగంలో మార్పులు జరుగుతాయి. బస్సు ముందుకు వెళ్లడానికి, మలుపు తిరగడానికి ఈ టైర్లు సహకరిస్తాయి. ఇలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ బస్సులు ఇటు నేలపై, అటు నీటిపై సులభంగా వెళతాయ’ని ఎంటీడీసీ ఎండీ జగదీశ్ పాటిల్ తెలిపారు. ఈ వాహనాలలో దాదాపు 50 మంది ప్రయాణించే వీలుంటుందన్నారు. ఈ బస్సులు రోడ్డు మీది కొంత దూరం వెళ్లిన తర్వాత సముద్ర మార్గాన గమ్యాన్ని చేరేటట్లు ప్రణాళికలు రూపొంది స్తున్నామని వివరించారు. దీనివల్ల ప్రయాణికుల సమయం ఆదా అవుతుందని, పర్యాటక రంగం మరింత అభివద్థి చెందుతుందని జగదీశ్ పాటిల్ అభిప్రాయపడ్డారు. ‘ఇలాంటి బస్సులను కొనుగోలు చేయకుండా ఏదైనా ప్రైవేటు కంపెనీకి అప్పగించాలనుకుంటున్నాం.
ఒకవేళ ఆసక్తిగల కంపెనీలు ముందుకు వస్తే ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల నుంచి అనుమతులు లభించేలా చూసుకుంటాం. ఈ బస్సులను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడపాలి, ఏ మార్గంలో నడిపితే లాభదాయకుంగా ఉంటుంది. ముంబై-శివారు ప్రాంతాల మధ్య నడిపేందుకు వీలుపడుతుందా..? తదితరాలపై అధ్యయనం చేయాల్సి ఉంద’ని పాటిల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం నీటిపై, గాలిలో ఎగిరే విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో నేలపై, నీటిలో నడిచే బస్సు సేవలు కూడా అందుబాటులోకి తె స్తామని పాటిల్ ధీమా వ్యక్తం చేశారు. నగరంలో రోజురోజుకూ ఉగ్రరూపం దాలుస్తున్న ట్రాఫిక్‌జామ్ సమస్య నుంచి బయటపడాలంటే ఇలాంటి సేవలు అందుబాటులోకి తీసుకురావల్సిన అవసరం ఉందన్నారు. పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉన్నతాధికారులకు విలువైన సమయం ఆదా కావాలంటే ఇలాంటి సేవలు దోహదపడతాయని వివరించారు.
‘ఉభయచర బస్సు’లపై ఎంటీడీసీ దృష్టి
Published Wed, Feb 26 2014 10:57 PM | Last Updated on Mon, Oct 8 2018 6:16 PM
Advertisement
Advertisement