మేజర్ నితిన్ లీతుల్ గోగోయ్
శ్రీనగర్: ఆర్మీ మేజర్ నితిన్ లీతుల్ గోగోయ్‌పై కోర్టు విచారణ చేపట్టాలని భారత సైన్యం ఆదేశించిన మరునాడే శ్రీనగర్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఈ ఉదంతంపై పూర్తి వివరాలు ఈ నెల 30లోపు సమర్పించాలని కశ్మీర్ పోలీసులను ఆదేశించింది. ఈ నెల 23న గోగోయ్ ఓ యువతితో కలిసి హోటల్‌లో పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై జమ్ము పోలీసులుగొగోయ్‌ని, అతడి కారుడ్రైవర్‌ను, యువతిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. కాగా ఆర్మీ నిబంధనల ప్రకారం గొగోయ్‌పై కోర్టు విచారణ చేపట్టనున్నట్టు ఆర్మీచీఫ్ బిపిన్ రావత్ తెలిపారు. గోగోయ్‌పై విచారించాల్సిందిగా జమ్మూ-కశ్మీర్ ఇంటర్నేషనల్ ఫోరం ఫర్ జస్టీస్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ మహ్మద్ హాసన్ ఆంటో చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌ను కోరారు. దీనిపై స్పందించిన మెజిస్టేట్ ఈ నెల 30లోపు నివేదిక సమర్పించాల్సిందిగా కశ్మీర్ పోలీసులను ఆదేశించింది.
గోగోయ్ బుధవారం శ్రీనగర్‌లోని ఒక హోటల్‌లో గదిని తీసుకున్నారు. అనంతరం ఒక యువతి సమీర్ అహ్మద్‌తో పాటు రావడంతో హోటల్ యాజమాన్యం వారిని లోపలికి అనుమతించడానికి నిరాకరించారు. దీంతో గొగోయ్ హోటల్ యాజమాన్యంతో ఘర్షణకు దిగారు. ఆ సమయంలో స్థానికుల నుంచి సమాచారం అందడంతో కశ్మీర్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. యువతిని తీసుకొచ్చిన వ్యక్తి సమీర్ అహ్మద్ కూడా ఆర్మీకి చెందిన వ్యక్తేనని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
ఫేస్‌బుక్ ద్వారా ఆ యువతి గోగోయ్‌కి పరిచమయిందని సమాచారం. అదిల్ అద్నాన్ అనే నకిలీ పేరుతో పరిచయం పెంచుకున్న యువతి కొద్ది రోజులకు అసలు పేరు వెల్లడించిందని, అప్పటి నుంచి వారి స్నేహం కొనసాగుతోందని ఓ అధికారి తెలిపారు.
కాగా గతంలో గొగోయ్ తమ ఇంటిపై రాత్రి సమయాల్లో రెండు సార్లు దాడి చేశారని, ఆసమయంలో ఆయనతో సమీర్ అహ్మద్ కూడా ఉన్నాడని యువతి తల్లి ఆరోపించింది. బుధవారం ఉదయం బ్యాంకుకు వెళ్లి మధ్యాహ్నం వస్తానని యువతి ఇంటి నుంచి బయటకు వెళ్లిందని అనంతరం జరిగిన విషయంపై సమాచారం తమకు తెలియదని ఆమె పేర్కొన్నారు.
గతంలో ఆర్మీవాహనంపై కొందరు ఆందోళకారులు రాళ్లు రువ్వినప్పుడు.. గొగోయ్ వారిలో ఒకరిని పట్టుకొచ్చి వాహనం ముందుభాగంలో కట్టివేశారు. దీంతో ఆందోళకారులు వెనక్కితగ్గారు. ఈ సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment