సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌లో భారీ ఉగ్రదాడి కుట్రను భద్రతా దళాలు సోమవారం భగ్నం చేశాయి. కథువా ప్రాంతంలోని దెవాల్ గ్రామంలో 40 కిలోల భారీ పేలుడు సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు భద్రతా దళాలు వెల్లడించాయి. దీనిపై మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఆర్మీ ఇంటెలిజెన్స్ దళాలు, కశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా అనుమానిత ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా దేశీయంగా తయారుచేసిన పేలుడు పదార్ధాలు లభించాయి. మరోవైపు బాలాకోట్‌లో ఉగ్ర శిబిరాలు తిరిగి చురుకుగా మారాయని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ పేర్కొన్నారు. సరిహద్దు ద్వారా 500 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం భారత్‌లో ఉగ్ర దాడులను ప్రేరేపించేందుకు పాకిస్తాన్ పలు ప్రయత్నాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోకి ఉగ్రవాదులను చొప్పించడంతో పాటు సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాక్ తెగబడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment