మంత్రులకు మోదీ సూచన.. 15 నుంచి ‘స్వచ్ఛతా హీ సేవా’
న్యూఢిల్లీ: ‘పరిశుభ్ర భారత్’ కోసం కృషిచేయాలని ప్రధాని మోదీ తన కేబినెట్ మంత్రులను కోరారు. ‘స్వచ్ఛ్ భారత్ మిషన్’ ప్రారంభమై మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సెప్టెంబర్ 15 నుంచి చేపట్టనున్న ‘స్వచ్ఛతా హీ సేవా’ను విజయవంతం చేయాలని సూచించారు. ‘క్లీన్ ఇండియా’ను మాటల్లో కాకుండా చేతల్లో చూపేలా ప్రయత్నాలు జరగాలని పిలుపునిచ్చారు. మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశం తరువాత ఈ మేరకు తాగునీరు, పారిశుధ్య శాఖ ఓ ప్రజెంటేషన్ ఇచ్చింది.
15 రోజుల పాటు జరిగే ఈ ప్రచార కార్యక్రమంలో జాతీయ క్రికెట్, హాకీ, సాకర్, బ్యాడ్మింటన్ జట్లు ఒక్కో మురికి వాడను దత్తత తీసుకుని శుభ్రం చేయాలని అందులో ప్రతిపాదించారు. కొత్తగా జారీచేసే పాస్‌పోర్టులపై స్వచ్ఛ భారత్ మిషన్ సందేశం, లోగోలను ముద్రించే అంశాన్ని విదేశాంగ శాఖ పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. మంత్రులు, ఉన్నతాధికారులు కొన్ని గంటలపాటు శ్రమదానం చేయాలని సూచించారు. అక్టోబర్ 2 వరకు ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.