Clean India
-
వైరల్: మంత్రిగారి బహిరంగ మూత్రవిసర్జన!
జైపూర్: ఓవైపు స్వచ్ఛ్ భారత్ కోసం దేశ ప్రజలంతా కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిస్తుంటే.. మరోవైపు ఆయన పార్టీకే చెందిన రాజస్తాన్ మంత్రి శంభు సింగ్ ఖేటసర్ మాత్రం బహిరంగ మూత్ర విసర్జన చేసి నవ్వులపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక ఆ సదరు మంత్రిగారు తమ ముఖ్యమంత్రి వసుంధర రాజే పోస్టర్ పక్కనే మూత్ర విసర్జన చేయడం విశేషం. తను చేసిన ఈ పనిని ఇది పెద్దవారి సాంప్రదాయమని సమర్ధించుకోవడం మరో విశేషం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన ఓ భారీ బహిరంగ సభకు హాజరయ్యే క్రమంలో శంభు సింగ్ బహిరంగ మూత్ర విసర్జన చేశారు. దీనిపై మీడియా వివరణ కోరగా.. తను తమ సీఎం పోస్టర్ పక్కన మూత్ర విసర్జన చేయలదని, ఓ గోడపక్కన చేశానని, అక్కడ ఎలాంటి పోస్టర్ లేదని తెలిపారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన స్వచ్ఛ్ భారత్ ఉద్దేశం బహిరంగ మల విసర్జన చేయవద్దని కానీ, మూత్ర విసర్జన కాదని చెప్పుకొచ్చారు. మల,మూత్ర విసర్జనలు రెండు వేర్వేరన్నారు. బహిరంగ మల విసర్జన వల్ల వ్యాధులొస్తాయని, కానీ మూత్ర విసర్జన వల్ల ఎలాంటి సమస్య ఉండదని తెలిపారు. తను ఈ పని చేసిన చోటు చాలా విశాల ప్రాంతమని, అక్కడ జనవాసం లేకపోవడంతో అసలు సమస్యే ఉండదని ఈ రాజస్తాన్ మంత్రి అభిప్రాయపడ్డారు. ఆ రోజు ఉదయం నుంచి బిజీగా గడిపానని, దగ్గరల్లో ఎక్కడా టాయిలెట్స్ లేవన్నారు. #India A state Minister in Rajasthan a northern Indian state has landed in a controversy after a photo of him urinating near a wall went viral on social media. Minister Shambhu Singh Khatesar said urinating in the open was "an age-old tradition". pic.twitter.com/L3bzR405rT — Eugene Makai (@EugeneMakai) October 7, 2018 -
కోహ్లి చాలెంజ్ సంతోషానిచ్చింది: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : మాన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పలు ఆసక్తికరమైన అంశాలపై మాట్లాడారు. క్లీన్ ఇండియా, యోగా, ఫిట్నెస్, సాంప్రదాయ క్రీడలు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మోదీ మాట్లాడుతూ... దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ, స్వాతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్‌కు నివాళి అర్పించారు. 1857లో జరిగిన తొలి స్వాతంత్ర్య సంగ్రామంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వీరుడిగా వీర్ సావర్కర్‌ను వర్ణించారు. ఫిట్నెస్ ట్రెండ్ నడుస్తోంది ఫిట్నెస్ పై అందరూ అవగహన పెంచుకోవాలని ప్రధాని కోరారు. ఫిట్నెస్ ఛాలెంజ్‌ను అందరూ స్వీకరించాలని, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, సైనికులు, ఉద్యోగులు ఇతరులుకు ఫిట్‌నెస్‌పై అవగహన కల్పించాలన్నారు. ‘హమ్ ఫిట్ ఇండియా ఫిట్’ అని నినాదమిచ్చారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తనకు ఫిట్నెస్ చాలెంజ్ చేయడం సంతోషానిచ్చిందని, ఆ చాలెంజ్‌ను తాను స్వీకరిచానని మోదీ తెలిపారు. క్రీడలపై మాట్లాడుతూ.. సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించాలని అన్నారు. సాంప్రదాయ క్రీడలు భారతీయ సంస్కృతిలో భాగమని పేర్కొన్నారు. మన క్రీడలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత యువతపై ఉందని, ప్రతి ఒక్కరి బాల్యం క్రీడలతోనే ప్రారంభవుతుందని గుర్తుచేశారు. క్లీన్ ఇండియా, గ్రీన్ ఇండియా ప్రపంచ పర్యవరణ దినోత్సవంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. పర్యవరణంపై ప్రతీ ఒక్కరు శ్రద్ధ వహించాల్సిందిగా కోరారు. ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పులు ప్రకృతిపై ప్రభావం చుపుతున్నాయన్నారు. ఇటీవల పలు ప్రాంతాల్లో దుమ్ము తుఫానుల బీభత్సం, అకాల వర్షలకు ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ప్లాస్టిక్ కాలుష్యంపై అవగహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రకటించారు. -
భారత్‌ను శుభ్రం చేయండి
మంత్రులకు మోదీ సూచన.. 15 నుంచి ‘స్వచ్ఛతా హీ సేవా’ న్యూఢిల్లీ: ‘పరిశుభ్ర భారత్’ కోసం కృషిచేయాలని ప్రధాని మోదీ తన కేబినెట్ మంత్రులను కోరారు. ‘స్వచ్ఛ్ భారత్ మిషన్’ ప్రారంభమై మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సెప్టెంబర్ 15 నుంచి చేపట్టనున్న ‘స్వచ్ఛతా హీ సేవా’ను విజయవంతం చేయాలని సూచించారు. ‘క్లీన్ ఇండియా’ను మాటల్లో కాకుండా చేతల్లో చూపేలా ప్రయత్నాలు జరగాలని పిలుపునిచ్చారు. మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశం తరువాత ఈ మేరకు తాగునీరు, పారిశుధ్య శాఖ ఓ ప్రజెంటేషన్ ఇచ్చింది. 15 రోజుల పాటు జరిగే ఈ ప్రచార కార్యక్రమంలో జాతీయ క్రికెట్, హాకీ, సాకర్, బ్యాడ్మింటన్ జట్లు ఒక్కో మురికి వాడను దత్తత తీసుకుని శుభ్రం చేయాలని అందులో ప్రతిపాదించారు. కొత్తగా జారీచేసే పాస్‌పోర్టులపై స్వచ్ఛ భారత్ మిషన్ సందేశం, లోగోలను ముద్రించే అంశాన్ని విదేశాంగ శాఖ పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. మంత్రులు, ఉన్నతాధికారులు కొన్ని గంటలపాటు శ్రమదానం చేయాలని సూచించారు. అక్టోబర్ 2 వరకు ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. -
ఆ పథకాలు విజయవంతమైతే భారతే సూపర్‌పవర్: ప్రణబ్
చండీగఢ్: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘క్లీన్ ఇండియా’, ‘డిజిటల్ ఇండియా’ వంటి పథకాలు విజయవంతమైతే భారతదేశం ప్రపంచంలోనే ఆధునిక ఆర్థిక శక్తిగా మారుతుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఆదివారం ఇక్కడ జరిగిన సీఐఐ ఆగ్రో-టెక్ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ర్యువెన్ రివ్లిన్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘‘ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన అన్ని రంగాల్లోనూ కేంద్ర ప్రభుత్వం పలు కొత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రత్యేకించి మేక్ ఇన్ ఇండియా, క్లీన్ ఇండియా, స్మార్ట్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి సరికొత్త పథకాలను చేపట్టింది. వీటిని కనుక విజయవంతంగా అమలు చేసినట్లరుుతే భారతదేశం ప్రపంచంలోనే ఒక సుసంపన్నమైన, శక్తివంతమైన, ఆధునిక ఆర్థిక శక్తిగా మారడం తథ్యం’’ అని ప్రణబ్ పేర్కొన్నారు. ఆధునిక ఆర్థిక శక్తిగా మారడానికిగాను మనకున్న వనరులను సమర్థంగా వినియోగించుకోవడం ఎంతో కీలకమని ఆయన అన్నారు. -
లక్ష్మీదేవి ఎందుకెళ్లిపోతుందో తెలుసా?
సంపదతోపాటు, సుఖసంతోషాలను ఇచ్చే దేవత లక్ష్మీదేవి. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ సంపద సమృద్ధిగా ఉంటుందని చాలామంది భారతీయుల విశ్వాసం. అందుకే పొద్దున్నలేవగానే లక్ష్మీదేవికి నిష్ఠగా పూజలుచేసి.. స్తోత్రాలను పఠిస్తూ ఉంటారు. మరీ అలాంటి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో తెలుసా.. తమ ఇంటితోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేవారి ఇంట్లోనే లక్ష్మీదేవి తాండవం ఆడుతుందట. ఎవరైతే శుభ్రతను పాటిస్తారో వారు దేవుడికి సన్నిహితంగా ఉంటారని ఒక నానుడి. అదే నానుడిని నిజంచేస్తూ ఎవరైతే శుభ్రతను పాటిస్తూ.. తమ ఇంటిని, పరిసరాలను ఎవరైతే స్వచ్ఛంగా ఉంచుకుంటారో వారి ఇంటిలోనే లక్ష్మీదేవి పీటవేసుకొని పదిలంగా ఉంటుందని, ఎవరైతే పరిసరాలను నిర్లక్ష్యంగా చెత్తచెదారంతో నింపివేస్తారో వారి నుంచి దూరంగా వెళ్లిపోతుందని సందేశం ఇస్తూ.. 'స్వచ్ఛభారత్' షార్ట్ ఫిలిం అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రధాని నరేంద్రమోదీకి అత్యంత ఇష్టమైన పథకమైన 'స్వచ్ఛభారత్' ప్రచారం కోసం రూపొందించిన ఈ షార్ట్‌ఫిలింలో లక్ష్మీదేవిగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అలరించగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన గళాన్ని ఇచ్చారు. ఇషా కోప్పికర్, రవికిషాన్, ఓంకార్ కపూర్ వంటి ప్రముఖులతో రూపొందిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. శుభ్రత ప్రాధాన్యాన్ని గుర్తుచేస్తూ స్వచ్ఛతను పాటించకపోతే లక్ష్మీదేవి మిమ్మల్ని వదిలిపొతుందనే సందేశంతో ఈ న్యూ యాడ్ ఫిలిం రూపొందింది. -
కోట్లు తెస్తానని చెప్పి.. యోగా చేయమంటున్నారు
పాట్నా: ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం విఫలమైందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. మోదీ ప్రభుత్వంపై యువతకు రానురాను విశ్వాసం సన్నగిల్లుతోందని చెప్పారు. బీహార్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మోదీ ప్రభుత్వం విమర్శలు చేశారు. ఇదే వేధిక నుంచి ఢిల్లీలో రానున్న కాలంలో విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయని పరోక్షంగా చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు విదేశాల్లో ఉన్న నల్లధనం మొత్తాన్ని తిరిగి భారత్‌కు తెప్పిస్తామన్న మోదీ.. అధికారంలోకి వచ్చాక మాత్రం యోగా చేయమంటున్నారని ఆరోపించారు. ఎలాంటి ఫలితం ఇవ్వని స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రచారం కోసం కోట్ల రూపాయలు వెచ్చించారని విమర్శించారు. దీనివల్ల కనీసం ఒక్క వీధి కూడా శుభ్రంగా కనిపించడంలేదని కేజ్రీవాల్ చెప్పారు. బీహార్ ప్రజలు ఎలాంటి ప్రభుత్వాలను ఎన్నుకోవాలని ప్రశ్నించగా ప్రస్తుతం రెండు మోడల్ ప్రభుత్వాలు ఉన్నాయని అందులో ఒకటి ఢిల్లీ ప్రభుత్వం కాగా మరొకటి కేంద్రప్రభుత్వం అని ఇందులో ఎలాంటి తరహా ప్రభుత్వాన్ని కోరుకుంటారో ఢిల్లీ ప్రజలే నిర్ణయించుకోవాలని తెలిపారు. -
'కోట్లాది ప్రజల ఆకాంక్షకు ప్రతిబింబమే అస్సీ ఘాట్'
వారణాసి: కోట్లాది మంది ప్రజల ఆకాంక్షకు ప్రతిబింబమే అస్సీ ఘాట్ అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వారణాసికి అస్సీ ఘాట్ ప్రత్యేక గుర్తింపు తెచ్చిందన్నారు. గురువారం అస్సీ ఘాట్ ను సందర్శించిన మోదీ..అక్కడ స్వచ్ఛతను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ ను అన్ని వర్గాల ప్రజలు ముందుకు నడిపిస్తున్నారన్నారు. స్వచ్ఛ భారత్ కోసం వ్యక్తులు, సంస్థలను ఆహ్వానిస్తున్నాని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. దేశ ప్రజలందరికీ మోదీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. -
‘క్లీన్ ఇండియా’ ధ్యేయం
కొరుక్కుపేట: ‘క్లీన్ ఇండియా..గ్రీన్ ఇండియా’ స్థాపనే ధ్యేయంగా ప్రతి భారతీయుడు స్వచ్ఛభారత్‌లో భాగస్వాములు కావాలని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం చెన్నై నగరంలోని ఓ హోటల్లో రోటరీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యం లో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. దీనికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. రోటరీ ఇంటర్నేషనల్ డెరైక్టర్ ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ 2014 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు దేశ ప్రధాని నరేంద్రమోదీ స్వచ్ఛభారత్ మిషన్‌కు శ్రీకారం చుట్టారని అన్నారు. పరిశుభ్రతతోనే దేశం అభివృద్ధి చెందుతుందన్న మహాత్మాగాంధీని ఆదర్శంగా తీసుకుంటూ స్వచ్ఛభారత్‌కు శ్రీకారం చుట్టారని అన్నారు. ఇందులో కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, గవర్నర్‌తోపాటు, ప్రముఖ వ్యక్తులు, సెలబ్రెటీలను, ప్రజలను సైతం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చామన్నారు. క్లీన్ ఇండియా...గ్రీన్ ఇండియా స్థాపనకు అడుగులుపడడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం సైతం వచ్చే ఐదేళ్లలో దేశ అభివృద్ధికి రూ.2లక్షల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. రూ.1.34 కోట్లు మరుగుదొడ్ల నిర్మాణానికి ఖర్చు చేస్తుందన్నారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధి పూర్తిస్థాయిలో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పరిసరాల శుభ్రంగాల ఏకపోవడం వల్లే విద్యార్థులు మలేరియా, డెంగీ, డయేరియా లాంటి వ్యాధులతో మృత్యువాత పడుతుండడం బాధాకరమన్నారు. 2019 మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల నాటికి భారత్‌ను క్లీన్ ఇండియా, గ్రీన్ ఇండియాగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామన్నారు. రోటరీ బృందాలు స్వచ్ఛభారత్‌లో మేము సైతం అంటూ ముందుకు రావటం సంతోషంగా ఉందని వారిని అభినందించారు. ఈ సందర్భంగా స్వచ్ఛభారత్‌లో భాగస్వాములుగా నిలుస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రోటరీ సభ్యులు పాల్గొన్నారు. -
స్వచ్ఛ భారత్‌లో ఐసీఐసీఐ చీఫ్ కొచర్
ముంబై: స్వచ్ఛ భారత్ అభియాన్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ చందా కొచర్ పాల్గొన్నారు. మంగళవారం ముంబైలోని ఐసీఐసీఐ బ్యాక్బే రిక్లమేషన్ బ్రాంచ్ సమీపంలో ఆమె, ఇతర ఉద్యోగులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని చందా కొచర్ వ్యాఖ్యానించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఐసీఐసీఐ బ్రాంచ్‌ల సమీపంలోని ప్రాంతాలను శుభ్రపరుస్తామని, ఈ కార్యక్రమం ఏడాది పొడవునా నిర్వహిస్తామని వివరించారు. పటిష్టమైన, పరిశుభ్రమైన భారత దేశాన్ని సాధించడానికి అందరూ కలసికట్టుగా పనిచేయాల్సి ఉందని చెప్పారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఐసీఐసీఐ తోడ్పాటు ఉంటుందని హామీ ఇచ్చారు. -
హృతిక్ రోషన్ కు ప్రధాని మోడీ ప్రశంస!
న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాలుపంచుకున్న బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ను ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఎంతోమందికి స్పూర్తిని కలిగించారని మోడీ తెలిపారు. హృతిక్ నుంచి మీరందరూ స్పూర్తిని పొందుతారనే విశ్వాసాన్ని మోడీ వ్యక్తం చేశారు. పరిశుభ్రతపై మహాత్మా గాంధీ జన్మదినం అక్టోబర్ 2 తేదిన మోడీ ఇచ్చిన పిలుపుకు దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. ముంబైలోని జుహూలో తన నివాస సమీపంలోని వీధుల్లో క్లీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టాం. స్వచ్ఛ భారత్ లో పాల్గొనడం ద్వారా ఎంతో నేర్చుకున్నాను అని హృతిక్ ట్వీట్ చేశారు. నా దేశాన్ని, నగరాన్ని, విధులను, నివాసంలో పాటించాలని ఓ నిర్ణయం తీసుకున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనేలా మరికొంతమందిని చైతన్య పరుస్తానని హృతిక్ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. Am sure you all will get inspired by @iHrithik's efforts! He has made a significant effort towards creating a Swachh Bharat. #MyCleanIndia — Narendra Modi (@narendramodi) October 26, 2014 #swachhbharat I started cleaning my own surroundings and learnt so much. Started with my lanes In juhu pic.twitter.com/GkBVdEIjcg — Hrithik Roshan (@iHrithik) October 25, 2014 -
అనీల్ అంబానీపై మోడీ ప్రశంసల జల్లు!
న్యూఢిల్లీ: 'స్వేచ్చ భారత్' ప్రచార కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీపై భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలు కురిపించారు. ముంబైలోని చర్చ్ గేట్ స్టేషన్ ప్రాంతాన్ని తన స్నేహితులతో కలిసి శుభ్ర చేసిన అనిల్ అంబానీ కృషి అభినందించదగినది అని ట్విటర్ లో మోడీ తన సందేశాన్ని పోస్ట్ చేశారు. ముంబై డౌన్ టౌన్ ప్రాంతంలోని రన్సర్స్ క్లబ్ ను తన సహచరులతో కలిసి అనిల్ అంబానీ శుభ్రం చేశారు. దేశవ్యాప్తంగా పరిశుభ్రత పాటించే విధంగా మహాత్మాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని 'స్వేచ్చ భారత్' పేరుతో ప్రధాని మంత్రి మోడీ ఓ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. స్వేచ్ఛ భారత్ మిషన్ ను ప్రజల్లోకి తీసుకుపోవడానికి అనిల్ అంబానీతోపాటు సచిన్ టెండూల్కర్, సల్మాన్ ఖాన్, ప్రియాంక చోప్రా, కమల్ హసన్, యోగా గురువు రాందేవ్ బాబా, కాంగ్రెస్ నేత శశి థరూర్ లను మోడీ ఎంపిక చేశారు. -
మోదీపై బిల్‌గేట్స్ ప్రశంసల జల్లు
న్యూఢిల్లీ: భారత్‌లో పారిశుద్ధ్యంపై ప్రధాని నరేంద్రమోదీ చేపడుతున్న కార్యక్రమాలపై మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ప్రశంసల జల్లు కురిపిం చారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచి మోదీ స్థాయిలో ఏ నాయకుడు కూడా ఈ అంశంపై దృష్టి సారించలేదని, ఇది అభినందనీయమని కొనియాడారు. టాయిలెట్లపై ఆయన ఎలాంటి భేషజాలకు పోకుండా అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారని తాజాగా తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ‘‘భారత్‌లో వినూత్న ఆవిష్కరణలు మనల్ని అబ్బురపరచవచ్చు. కానీ అక్కడ 63 కోట్ల జనాభాకు మరుగుదొడ్ల వసతి లేదు. బహిరంగ మల విసర్జనే దిక్కు. ఇలా మరుగుదొడ్లకు నోచుకోలేనివారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల దాకా ఉంది. ఈ అంశంపై మాట్లాడేందుకు నాయకులు అంతగా ఆసక్తి చూపరు. కానీ మోదీ టాయిలెట్ల ఆవశ్యకతపై అవగాహన కల్పించేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారు. ఇది గొప్ప విషయం’’ అని అందులో అన్నారు. సెప్టెంబర్‌లో భారత్‌కు వచ్చిన సందర్భంగా మోడీని కలిసిన ఫొటోను కూడా బిల్‌గేట్స్ తన బ్లాగ్‌లో పోస్ట్ చేశారు. బిల్‌గేట్స్, మిలిందా ఫౌండేషన్ల ద్వారా పేదలకు టాయిలెట్ల వసతి కల్పించేందుకు పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. -
స్వచ్ఛ భారత్‌కు కలిసి కృషి చేద్దాం
స్వచ్ఛ భారత దేశం కోసం అందరం కలిసి కృషి చేద్దాం అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు నటుడు సూర్య మద్దతు పలికారు. భారత దేశాన్ని స్వచ్ఛమైన భారత దేశం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ క్లీన్ ఇండియా పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అందుకు గాంధీ జయంతి రోజున ఆయన ఢిల్లీలో చీపురు చేత బట్టి రోడ్లను శుభ్రపరిచే కార్యక్రమానికి శ్రీకారం చట్టారు. ఈ సందర్భంగా ప్రధాని కళా, క్రీడా రంగాలకు చెందిన కమల్ హాసన్, సల్మాన్‌ఖాన్, ప్రియాంక చోప్రా, సచిన్ టెండూల్కర్ వంటి ప్రముఖులను క్లీన్ ఇండియా పథకానికి ఆహ్వానించగా, వారు అంగీకరించారు. ప్రధాని ఆహ్వానానికి స్పందించిన కమల్ 90 లక్షల మంది అభిమానుల్ని ఈ పథకంలో చేర్చుతానని ప్రకటించారు కూడా. తాజాగా నటుడు సూర్య స్వచ్ఛ భారత్ కోసం తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే పలువురికి విద్యా దానం చేస్తున్న సూర్య క్లీన్ఇండియా పథకానికి మద్దతు పలికారు. సూర్య పేర్కొం టూ మనల్ని మన ఇంటిని పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం అన్నారు. ఇది ప్రతి మనిషి ఆరోగ్యానికి దోహదం చేస్తుందన్నారు. మన పిల్లలకు విద్యా బుద్ధ్దులు నేర్పించడం ఎంత ముఖ్యమో పరిశుభ్రత కల్పించడం అంతే ముఖ్యమన్నారు. ఆరోగ్యకరమైన భారత దేశాన్ని పరిశుభ్ర మైన భారత దేశంగా మార్చుదాం. ప్రధాని నరేంద్ర మోదీ క్లీన్ ఇండియా పథకాన్ని సంపూర్ణ మద్దతు పలుకుదాం అంటూ పేర్కొన్నారు. -
దుర్గామాత విగ్రహాల నిమజ్జనం యమునా నది పరిసరాలు అపరిశుభ్రం
న్యూఢిల్లీ: విరిగిపోయిన కుండలు... కుళ్లిపోయిన పూలు... చిరిగిపోయిన గుడ్డముక్కలు..తడిసిపోయిన రంగులు... ఇదీ యుమునా నది ఒడ్డున ఆది వారం కనిపించిన దృశ్యం. శరన్నవరాత్రులు ముగి సిననేపథ్యంలో శనివారం నగరంలోని పలు ప్రాం తాలకు చెందిన మండపాల యజమానులు దుర్గామాత ప్రతిమలను యుమునా నదిలో నిమజ్జనం చేసిన సంగతి విదితమే. ఇప్పటికే కాలుష్యపు కోరల్లో చిక్కుకుపోయిన యమునా నది ఒడిలోకి వందలాది దుర్గామాత విగ్రహాలు చేరిపోయాయి. క్లీన్ ఇండియా పేరిట ప్రధానమంత్రి నరేంద్రమోడీ గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ నెల రెండో తేదీన దేశవ్యాప్తంగా స్వచ్ఛ్ భారత్ అభియాన్‌ను ప్రారంభించిన సంగతి విదితమే. వచ్చే ఐదేళ్లలోగా భారత్నుపరిశుభ్రతకు మారుపేరుగా నిలపాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మోడీ చేపట్టారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ శరన్నవరాత్రులు పూర్తయి దుర్గామాత విగ్రహాల నిమజ్జనం అనంతరం ఆదివారం యుమనా నది పరిసరాలకు వచ్చినవారికి బోలెడంత చెత్త కనిపించింది. ఈ నేపథ్యంలో ప్రధాని విన్నపాన్ని నగరవాసులెవరూ పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ నది ఒడ్డున ఎంతకాలమైనా భూమిలో కలిసిపోయే గుణమేలేని చెక్కలు, ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ నీటి సీసాలు, ఖాళీ చిప్ ప్యాకెట్లు, బిస్కట్ ప్యాకెట్లతోపాటు విషలక్షణాలు కలిగిన అనేక వస్తువులు చిందరవందరగా పడేసి ఉన్నాయి. సగం తిని వదిలేసిన ఆహార పదార్థాలకోసం కుక్కలు గాలిస్తూ కనిపిం చాయి. ఈ విషయమై కాళిందీకుంజ్ ఘాట్‌లో పడవ నడిపే 17 ఏళ్ల జమ్నాసింగ్ మాట్లాడుతూ ఇక్కడ మొత్తం ఆరు ప్రాంతాల్లో దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు సంబంధిత అధికారులు అనుమతించారని అన్నారు. ఈ చెత్త కొద్దిరోజులపాటు ఇక్కడ ఇలాగే పడిఉంటుందన్నారు. సింగ్ స్నేహితుడు దేవేంద్ర మాట్లాడుతూ ఈ కథ ప్రతి ఏడాదీ సర్వసాధారణమేనని, నిమజ్జనానికి వచ్చిన భక్తులు ప్లాస్టిక్ తదిరత వ్యర్థపదార్థాలను ఇష్టమొచ్చినట్టుగా పడేస్తుంటారని అన్నాడు. అధికారిక గణాంకాల ప్రకారం కాళిందీకుంజ్ ఘాట్ వద్ద దాదాపు 200 దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేస్తుంటారు. కాగా యుమునా నదిలోని జలాలు 70 శాతం మంది నగరవాసుల తాగునీటి అవసరాలను తీరుస్తోంది. కాగా యుమునా నది కాలుష్యానికి అసంఘటిత పూజా కమిటీలే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. తాము పర్యావరణ అనుకూల సామగ్రినే దుర్గామాత విగ్రహాల తయారీకి వినియోగిస్తామని సామ్రాట్ బెనర్జీ అనే ఓ సంఘటిత పూజా కమిటీ సభ్యుడు ఆరోపించారు. అయితే అసంఘటిత పూజా కమిటీలు ఇష్టమొచ్చిన సామగ్రిని వినియోగిస్తున్నాయంటూ ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపించారు. -
‘ప్రజలారా.. మీ శక్తిని గుర్తించండి’
రేడియోలో మోదీ ‘మన్‌కీ బాత్’ న్యూఢిల్లీ: ప్రచారంలో కొత్త పోకడలు పోయే ప్రధాని నరేంద్ర మోదీ విస్తృత జనబాహుళ్యానికి చేరువ కావడానికి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన శుక్రవారం ఆలిండియా రేడియోలో తొలిసారిగా ‘మన్‌కీ బాత్’(మనసులో మాట) పేరుతో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 15 నిమిషాల పాటు సాగిన ఈ కార్యక్రమం దసరా పండుగరోజున ప్రసారం కావడం విశేషం. ప్రజలు నైరాశ్యాన్ని పారదోలి, తమ శక్తిని గుర్తించాలని, నైపుణ్యాలను దేశ సౌభాగ్యానికి వెచ్చించాలని మోదీ తన ప్రసంగంలో కోరారు. జాతిపిత మహాత్మాగాంధీకి నివాళిగా ఖాదీ దుస్తులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. ‘మన శాస్త్రవేత్తలు అంగారక యాత్రను అతి తక్కువ ఖర్చుతో విజయవంతం చేశారు. ఇకపై తరచూ రేడియోలో మాట్లాడతానన్నారు. కాగా, ‘స్వచ్ఛ భారత్’తో దేశంలో వెల్లువెత్తిన ఉత్సాహాన్ని ఆ కార్యక్రమం విజయవంతయ్యేంతవరకు కొనసాగించాలని మోదీ పిలుపునిచ్చారు. -
'స్వచ్ఛ భారత్ ను కొనసాగించండి:మోదీ
న్యూఢిల్లీ: దేశాన్ని పరిశుభ్రం చేయడానికి చేపట్టిన ‘స్వచ్ఛ భారత్’తో దేశంలో వెల్లువెత్తిన ఉత్సాహాన్ని ఆ కార్యక్రమం విజయవంతయ్యేంతవరకు కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ‘ఈ ఉత్సాహం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఈ ఉత్సాహాన్ని కొనసాగించాలి'అని మోదీ స్పష్టం చేశారు. దేవెగౌడ కర్ణాటకలోని హసన్ రైల్వేస్టేషన్లో చీపురు పట్టి ఊడ్చడంపై మోదీ స్పందించారు. మాజీ ప్రధాని దేవెగౌడ కూడా ఇందులో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఇది బలమైన సంకేతం’ అని శనివారం ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా, శనివారం రాష్ట్రపతి భవన్లో స్వచ్ఛ భారత్ రన్ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జెండా ఊపి ప్రారంభించారు. -
తొంభై లక్షల మందికి కమల్ హాసన్ సవాల్
చెన్నై : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలెంజ్‌ను నటుడు కమల్ హాసన్ స్వీకరించారు. దేశాన్ని పరిశుభ్రంగా మార్చాలని కంకణం కట్టుకున్న మోడీ స్వచ్ఛ భారత్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ప్రధాని చాలెంజ్‌ను కమల్ హాసన్ స్వీరించారు. అంతే కాకుండా ఆయన 'నైన్ మిలియన్ పీపుల్'కు చాలెంజ్ చేశారు. 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో లో ప్రధాని తనను భాగస్వామ్యం చేయటంపై కమల్ ధన్యవాదాలు తెలిపారు. ఇది తనకు నూతన బాధ్యత అన్నారు. అయితే పరిశుభ్రతపై తాను ఇప్పటికే పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్‌లో పాల్గొనాలని కమల్ తొంభై లక్షల మంది ప్రజలకు పిలుపు నిచ్చారు. ఈ మేరకు ఆయన ఓ వీడియాలో మాట్లాడుతూ పారిశుద్ధ్యం విషయంలో గత ఇరవై ఏళ్లుగా పాల్గొంటున్నానని, తనతో పాటు అభిమానులు సామాజిక సేవ చేస్తున్నట్లు చెప్పారు. తన పని కొనసాగుతోందని, అయితే ఇది ప్రజల పని అని, అందులో తాను ఓ భాగమన్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని రాజకీయంగా మార్చవద్దని సూచించారు. ప్రస్తుతం కమల్ హాసన్ మళయాళం, తెలుగులో విజయవంతమైన 'దృశ్యం' షూటింగ్లో బిజీగా ఉన్నారు. తమిళంలో ఈ చిత్రాన్ని 'పాపనాశం' పేరుతో కమల్ తెరకెక్కిస్తున్నారు. కాగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ పరిశుభ్ర భారతావని ఆవశ్యకతపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలంటూ పలు రంగాల్లోని తొమ్మిది మంది ప్రముఖులకు ఆహ్వానం పలికారు. అలాగే ఆ ప్రముఖుల్లో ఒక్కొక్కరూ మరో తొమ్మిదేసి మందిని ఈ ప్రచారంలో పాల్గొనాల్సిందిగా కోరాలని సూచించారు. మోడీ ఎంపిక చేసిన 9 మంది ప్రముఖుల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్, నటులు కమల్‌హాసన్, సల్మాన్‌ఖాన్, ప్రియాంకా చోప్రా, గోవా గవర్నర్ మృదుల సిన్హా, ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌తోపాటు తారక్ మెహతా ఉన్నారు. -
స్వచ్ఛభారత్ కు సంకల్పం
-
స్వచ్ఛభారత్ కు సంకల్పం
* దేశంలోనే అతిపెద్ద పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని * ఐదేళ్లలో 2 లక్షల కోట్లతో ‘క్లీన్ ఇండియా’ లక్ష్యం * ఇది గాంధీజీ స్వప్నం.. 125 కోట్ల భారతీయుల బాధ్యత న్యూఢిల్లీ: ‘పరిశుభ్ర భారత్’ దిశగా దేశం తొలి అడుగు వేసింది. జాతిపిత జయంతి రోజు ఆయన స్వప్నం ‘క్లీన్ ఇండియా’కు భారత ప్రధాని నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు. స్వయంగా చీపురు పట్టి, చెత్త ఊడ్చి కార్యక్రమం పట్ల తన అంకితభావాన్ని ప్రదర్శించారు. ఐదేళ్లలో భారత్‌ను ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్ర దేశాల్లో ఒకటిగా మార్చే బాధ్యత 125 కోట్ల భారతీయులందరిపై ఉందంటూ.. 2019లో మహాత్ముడి 150వ జయంతి నాటికి స్వచ్ఛమైన భారతదేశాన్ని ఆయనకు నివాళిగా అందిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. దాదాపు రూ. 2 లక్షల కోట్ల ఖర్చుతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారతదేశ అతిపెద్ద పారిశుద్ధ్య కార్యక్రమం ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని ఢిల్లీలోని రాజ్‌పథ్ రోడ్లో గురువారం ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. దేశాన్ని స్వచ్ఛంగా మారుస్తామంటూ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఒక్కరు 9 మందిని, ఆ 9 మంది ఒక్కొక్కరు మరో 9 మందిని.. ఇలా గొలుసుకట్టుతో స్వచ్ఛభారత్ మిషన్‌లో దేశ ప్రజలను భాగస్వాములు చేయాలని పిలుపునిచ్చారు. దీన్ని కేవలం ఫోటోలు దిగే కార్యక్రమంగా భావించరాదని, పరిశుభ్రత కోసం దేశప్రజలందరూ వారానికి రెండు గంటలు, సంవత్సరానికి 100 గంటలు కేటాయించాలని కోరారు. తాను కూడా ఆ మేరకు సమయం కేటాయిస్తానన్నారు. అనంతరం మోదీ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో లక్షలాదిగా ప్రజలు స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పాల్గొని, తమ ఇళ్లు, కార్యాలయాల పరిసరాలను పరిశుభ్రం చేశారు. బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ కూడా పాల్గొన్న ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ‘స్వచ్ఛ భారత్’ భాధ్యత ప్రభుత్వానిదో, పారిశుద్ధ్య కార్మికులదో, స్వచ్ఛంద సంస్థలదో మాత్రమే కాదని, 125 కోట్ల మంది భారతీయులు ఇందులో భాగస్వాములని తేల్చి చెప్పారు. ‘అత్యంత చవకగా అంగారక గ్రహానికి చేరుకోగలిగిన మనం.. మన దేశాన్ని శుభ్రం చేసుకోలేమా?’ అంటూ దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపారు. ‘ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతమైంది. ఇది దేశభక్తి నుంచి స్ఫూర్తి పొందిన కార్యక్రమం’ అని స్పష్టం చేశారు. ‘రాజకీయాలపై దృష్టి పెట్టి ఈ పని చేయొద్దు. స్వచ్ఛమైన మనస్సుతో చెబుతున్నా. ఇందులో రాజకీయాలు చేరితే.. మరోసారి భరతమాత సేవలో మనం విఫలమైనట్లే’ అన్నారు. భారత్‌ను పరిశుభ్రంగా మార్చేందుకు గత ప్రభుత్వాలు కూడా కృషి చేశాయని పేర్కొన్నారు. పలు రాజకీయ, సామాజిక, సాంస్కృతిక సంస్థలు కూడా ఈ దిశగా ప్రయత్నించాయన్నారు. ‘మహాత్మాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ కూడా ఈ పని చేపట్టింది. అయితే, ఇందులో ఎవరు విజయవంతమయ్యారు? ఎవరు విఫలమయ్యారన్న విషయాల్లోకి మనం వెళ్లొద్దు. మన బాధ్యత మనం సక్రమంగా నిర్వర్తిద్దాం’ అని వ్యాఖ్యానించారు. గ్రామీణ మహిళల వెతలపై ఆవేదన: దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా 60% ప్రజలు ఇంకా బహిరంగ ప్రదేశాల్లోనే మల విసర్జన చేస్తున్నారన్న మోదీ.. టాయిలెట్లు లేని గ్రామీణ మహిళల వెతలను తీర్చాల్సి ఉందన్నారు. సామాజిక బాధ్యతగా భావించి పాఠశాలల్లో బాలికల కోసం ప్రత్యేక టాయిలెట్ల నిర్మాణాన్ని చేపట్టాలని తాను కార్పొరేట్ సంస్థలకు విజ్ఞప్తి చేశానన్నారు. విదేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయరని, ఆ విషయంలో విదేశాల నుంచి భారత్ ఎంతో నేర్చుకోవాల్సి ఉందని మోదీ వ్యాఖ్యానించారు. ‘అలవాట్లు అంత తొందరగా మారవు. అయినా చిత్తశుద్ధితో ప్రయత్నించాలి’ అన్నారు. స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. ఇందుకు ఝడ జౌఠి.జీ అనే ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించామని తెలిపారు. క్లీన్ ఇండియాకు ప్రత్యేకంగా వెబ్సైట్, ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ప్రారంభించామన్నారు. అనారోగ్య కారణాలతో ప్రతీవ్యక్తి ఏటా రూ. 6500 ఖర్చు చేస్తున్నాడన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలను ప్రస్తావిస్తూ.. పరిశుభ్ర పరిసరాలతో ప్రజలు అరోగ్యంగా ఉండి, ఆ ఖర్చును తగ్గించుకోవచ్చన్నారు. లోగో రూపకర్తలకు అభినందనలు మహాత్మాగాంధీ కళ్లద్దాలను ‘స్వచ్ఛ్ భారత్’ లోగోగా రూపొందించిన మహారాష్ట్రకు చెందిన అనంత్‌ను, ‘ఏక్ కదమ్ స్వచ్ఛతా కీ ఓర్(స్వచ్ఛత దిశగా ఒక అడుగు)’ను కార్యక్రమ నినాదంగా ఇచ్చిన గుజరాత్‌కు చెందిన భాగ్యశ్రీలను ఈ సందర్భంగా మోదీ అభినందించారు. ‘భారత్‌ను స్వచ్ఛంగా చేశామా లేదా? అని ఈ కళ్లద్దాల ద్వారా గాంధీజీ మనల్ని చూస్తున్నట్లుగా అనిపిస్తోంది’ అన్నారు. మోదీ ప్రసంగంలోని మరికొన్ని ముఖ్యాంశాలు.. ఈ రోజు గాంధీజీ, లాల్‌బహదూర్ శాస్త్రిల జయంతి. శాస్త్రి ఇచ్చిన జై జవాన్ పిలుపునకు రైతాంగం కదిలి దేశ ధాన్యాగారాలను నింపింది. గాంధీ కల ‘క్విట్ ఇండియా’, ‘క్లీన్ ఇండియా’. క్విట్ ఇండియా పిలుపుతో స్వాతంత్య్రం సాధించారు. కానీ ‘క్లీన్ ఇండియా’ కల అసంపూర్తిగానే మిగిలింది. ఆ కల నెవవేర్చడానికి ఇప్పుడు సమయం వచ్చింది. ఎక్కడైనా చెత్త ఉంటే ఫోటోను, ఎత్తివేసిన తరువాత ఫోటోను అప్లోడ్ చేయండి. పారిశుధ్యం కోసం కృషి చేస్తున్న యువసంఘాలను వెలుగులోకి తీసుకురావాలని మీడియాను కోరుతున్నా. 2 లక్షల కోట్లు: రెండు స్థాయిల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. రూ. 62 వేల కోట్లతో(ఇందులో కేంద్ర వాటా రూ. 14,623 కోట్లు) దేశవ్యాప్తంగా 4041 పట్టణాల్లో.. రూ. 1.34 లక్షల కోట్లతో గ్రామాల్లో ‘స్వచ్ఛ్ భారత్’ను నిర్వహిస్తారు. గ్రామాల్లో పరిశుభ్రత కోసం ప్రారంభించిన ‘నిర్మల్ భారత్ అభియాన్’ను ఈ కార్యక్రమంలోనే విలీనం చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. స్వచ్ఛ్ భారత్‌లో ఏం చేయాలి...! * ప్రతీఒక్కరు ‘పరిశుభ్ర భారత్’లో భాగస్వాములు కావాలి. * అందరూ వారానికి రెండు గంటల చొప్పున సంవత్సరానికి కనీసం 100 గంటల సమయం పరిశుభ్రతకు కేటాయించాలి. * తాము నివాసం ఉంటున్న ప్రాంతాలు, ఆ పరిసరాలు.. కార్యాలయాలు, కార్యాలయ ప్రాంగణాలను శుభ్రంగా ఉంచాలి. * పరిసరాల్లోని మురికికాల్వలను శుభ్రం చేయాలి. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయరాదు. * విద్యార్థుల తమ పాఠశాలలను స్వచ్ఛంగా ఉంచుకోవాలి. * పాఠశాలల్లో బాలికల కోసం ప్రత్యేక టాయిలెట్లను నిర్మించాలి. (ఇందుకు కార్పొరేట్ సంస్థల సాయం కోరినట్లు ప్రధాని మోదీ తెలిపారు) * గ్రామీణప్రాంతాల్లో బహిరంగ మలవిసర్జనను నిర్మూలించాలి. వ్యక్తిగత టాయిలెట్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలి. * గ్రామీణ మహిళల కోసం కమ్యూనిటీ టాయిలెట్లను నిర్మించాలి. * ‘మేన్యువల్ స్కావెంజర్’ వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి. గ్రామాల స్వచ్ఛతకు ఏటా 20 లక్షలు న్యూఢిల్లీ: ‘స్వచ్ఛ భారత్’ ఉద్యమంలో భాగంగా దేశంలోని 2.47 లక్షలకుపైగా ఉన్న గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు గ్రామ పంచాయతీలకు ఏటా రూ. 20 లక్షల చొప్పున నిధులు అందిస్తామని కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్యశాఖ మంత్రి నితిన్ గడ్కారీ ప్రకటించారు. గురువారం ఢిల్లీలోని తన శాఖ కార్యాలయం ఆవరణలో అధికారులతో కలిసి చీపురుపట్టిన గడ్కారీ అనంతరం మీడియాతో మాట్లాడారు. త్వరలోనే కొన్ని గ్రామాలకు ఈ నిధులను అందిస్తామన్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం ప్రకటించిన రూ. 1.96 లక్షల కోట్ల నిధి నుంచి ఈ సొమ్మును గ్రామాలకు అందిస్తామని అధికారులు చెప్పారు. స్వచ్ఛ భారత్ నిధి గ్రామాలు ప్రత్యేకించి స్కూళ్లలో పారిశుద్ధ్య సేవలకు కార్పొరేట్ కంపెనీలు, వ్యక్తుల నుంచి నిధుల సేకరణ కోసం కేంద్రం గురువారం స్వచ్ఛ భారత్ నిధిని ఏర్పాటు చేసింది. సాధించేదాకా కొనసాగిద్దాం! సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రారంభమైన ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమాన్ని ఐదేళ్లపాటు కొనసాగించాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. పనిచేసే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి పని వాతావరణాన్ని సృష్టించాలని ఉద్యోగులకు సూచించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో గురువారం జరిగిన ర్యాలీలో వెంకయ్య టీషర్టు, క్యాప్ ధరించి విద్యార్థులతో కలిసి 4 కిలోమీటర్లు నడిచారు. -
అటు ప్రారంభం.. ఇటు ముగింపు
దేశవ్యాప్తంగా ప్రారంభమైన ‘స్వచ్ఛ భారత్’ ముగిసిన స్వచ్ఛ తెలంగాణ వారోత్సవాలు సాక్షి, హైదరాబాద్: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గురువారం దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఇండియా గేట్ మార్గంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహాత్ముడు కలలుకన్న పరిశుభ్ర భారతావనిని ఐదేళ్లనాటికి ఆయున 150వ జయంతికల్లా సాధించాలనే లక్ష్యంతో ప్రధాని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. సరిగ్గా ఇదే లక్ష్యంతో వారం రోజుల కింద రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ‘స్వచ్ఛ తెలంగాణ’ వారోత్సవాలను ప్రారంభించి ‘స్వచ్ఛ భారత్’ ప్రారంభమయ్యే సమయానికి ముగించడం విశేషంగా మారింది. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ‘స్వచ్ఛ భారత్’ను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని పట్టణ, నగర ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత నెల 25న ప్రారంభించిన స్వచ్ఛ తెలంగాణ వారోత్సవాలు గురువారంతో ముగిశాయి. ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలోని 67 నగరాలు, పట్టణాల్లో గత వారం రోజులుగా వివిధ రకాల పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించారు. రోడ్లు, డ్రైనేజీలు, ప్రభుత్వ, ప్రైవేటు బడులు, ఆస్పత్రులు, కార్యాలయాలు, సామూహిక మరుగుదొడ్లు, దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్ల పరిసర ప్రాంతాల్లో ప్రజల భాగస్వామ్యంతో తొలి ఆరు రోజులు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. చివరి రోజు గురువారం స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలతో పారిశుద్ధ్యంపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమం ఇలా సాగింది...: 534 కిలోమీటర్ల రోడ్లు, 507 కిలోమీటర్లమేర మురికి కాల్వలు శుభ్రం 21,155 మెట్రిక్ టన్నుల వ్యర్థాల తొలగింపు పాలుపంచుకున్న వ్యక్తులు 28,129 మంది -
హైదరాబాద్‌ను క్లీన్‌సిటీగా చూడాలనేది నా కోరిక
హైదరాబాద్ :హైదరాబాద్‌ను క్లీన్‌సిటీగా చూడాలనేది తన కోరిక అని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోదీ నూతనంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని గవర్నర్ తన సతీమణితో కలిసి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మన ఇంటినే కాకుండా పరిసరాలనూ పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. తద్వారా అనారోగ్యం దరిచేరదన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వాలు స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌ను క్లీన్‌సిటీగా తయారు చేసేందుకు అందరూ కృషిచేయూలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన పరిశుభ్రత ఉండదని, పారిశుధ్య లోపాన్ని నివారించేందుకే గాంధీ ఆస్పత్రిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించావుని తెలిపారు. అంతకుముందు సతీమణి విమలా నరసింహన్‌తో కలిసి గాంధీ ఆస్పత్రి ఓపీ విభాగంలోని కొంతప్రాంతాన్ని చీపురుతో ఊడ్చి, కిటికీ అద్దాలను పరిశుభ్రం చేశారు. ఆస్పత్రి ప్రాంగణంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మీకు బాధ్యత లేదా? స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం జరుగుతుండగా కొంతమంది రోగులు, రోగి సహాయకులు వచ్చి గాంధీ ఆస్పత్రిలో పారిశుధ్యలోపం ఉందని చెప్పడంతో గవర్నర్ అసహనం వ్యక్తం చేశారు. ‘పరిశుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత.. మీకు బాధ్యత లేదా’ అని ప్రశ్నించడంతో వారంతా అక్కడి నుంచి నిష్ర్కమించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌చందా, డీఎంఈ పుట్టా శ్రీనివాస్, ‘గాంధీ’ ప్రిన్సిపాల్ శ్రీలత, సూపరింటెండెంట్ అశోక్‌కుమార్, ఆస్పత్రి అధికారులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పరిశుభ్రతా దినంగా గాంధీజయంతి
భివండీ, న్యూస్‌లైన్ : ప్రధాన మంత్రి ఆదేశాల మేరకు భివండీ నిజాంపూర్ శహర్ మహానగర్ పాలిక ముఖ్య కార్యాలయంలో కమిషనర్ జీవన్ సోనావునే నాయకత్వంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని గురువారం పారిశుద్ధ్య చర్యలను ప్రారంభించారు. కార్పొరేషన్ మూడవ అంతస్తులోని సమావేశ మందిరంలో జీవన్ సోనావునే, డిప్యూటీ కమిషనర్ విజయ కంఠేతోపాటు ఇతర అధికారులు గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. స్వచ్ఛతలో భాగంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లోని తెలుగు సేవ సంస్థలు, కార్పొరేటర్లు తమ పరిసర మురికి కాలువలతో పాటు రోడ్లను శుభ్రపరిచారు. భివండీ కార్పోరేషన్ కమిషనర్‌తోపాటు ఇతర అధికారులు, ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకొన్నారు. స్వచ్ఛతను ఎళ్లవేలలా పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. తెలుగు ప్రజలు అధిక సంఖ్యలో ఉండే పద్మనగర్ ప్రాంతంలోని బాలాజీ సేవ సోసైటీ, బాలాజీ మిత్ర మండల్ కార్యకర్తలు ఉదయం తమ పరిసర ప్రాంతాల్లో ఉన్న మురికి కాలువలు, రోడ్లను శుభ్రపర్చారు. సోసైటీ అధ్యక్షులు పూల రవి మాట్లాడుతూ...ప్రధాన మంత్రి చేపట్టిన స్వచ్ఛతా భారత్ అభియాన్‌ను ప్రతి భారతీయుడు పాటించాలని అన్నారు. కామత్‌ఘర్‌లోని బీజేపీ కార్పోరేటర్ హనుమాన్ చౌదరి కార్యాకర్తలతో కలిసి వార్డులోని పరిసర ప్రాంతాల్లో గల రోడ్లను ఊడ్చారు. మరి కొంత మంది స్థానికులు కార్పొరేటరును చూసి పరిసర ప్రాంతంలో గల రోడ్లను ఊడ్చారు. -
మహాత్మా గాంధీ కలల్ని నిజం చేద్దాం!
-
సల్మాన్, కమల్, ప్రియాంకలకు మోడీ ఛాలెంజ్!
న్యూఢిల్లీ : ఐస్ బక్కెట్ ఛాలెంజ్.... ఇప్పుడు స్వచ్ఛ భారత్‌కు కూడా పాకింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...తొమ్మిదిమంది సెలెబ్రెటీలకు సవాల్ విసిరారు. బహిరంగ ప్రదేశాల్లో పారిశుద్ధ్యంలో పాల్గొనాలని ఆయన ఆ తొమ్మిదిమందికి ఆహ్వానం పలికారు. . స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఆ తొమ్మిది మంది స్వచ్ఛ భారత్‌లో పాల్గొని...వారి మరో తొమ్మిదిమందికి ఆహ్వానం పలకాలని కోరారు. మోడీ ఆహ్వానం పలికినవారిలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, ప్రియాంకా చోప్రా, శశిథరూర్, సచిన్ టెండుల్కర్, కమల్ హాసన్, తారక్ మెహతా, అనీల్ అంబానీ, మృదుల సిన్హా, బాబా రాందేవ్ తదితరులు ఉన్నారు. కాగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ పాల్గొన్నాడు. -
పాత అలవాట్లు మానుకోవటం కష్టమే...అయితే
న్యూఢిల్లీ : దేశంలో ఉన్న పరిస్థితులను మహాత్మా గాంధీ కళ్లద్దాల ద్వారా చూస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా గురువారమిక్కడ మాట్లాడుతూ మహాత్మాగాంధీ పరిశుభ్ర భారత్ నినాదానికి పిలుపు ఇచ్చారన్నారు. అయితే ఆ నినాదం ఇప్పటికీ అసంపూర్తిగా ఉండిపోయిందన్నారు. బాపూజీ ఆశయ సాధన కోసం మనమంతా చేయాల్సింది ఒక అడుగు ముందుకు వేయటమేనని మోడీ పిలుపునిచ్చారు. భారతీయులంతా కలిసికట్టుగా పనిచేసి ఒక ప్రేరణాత్మక వాతావరణాన్ని సృష్టించాలన్నారు. మనమంతా దేశభక్తితో ఇది చేయాలే కానీ...రాజకీయ ఉద్దేశంతో కాదని ఆయన అన్నారు. సర్పంచ్ల ప్రోత్సాహంతో వందశాతం పరిశుభ్రతంగా మారిన గ్రామాలను అనేకం తాను చూశానన్నారు. పరిశుభ్రత కేవలం సఫాయి కార్మికులదేనా అని మోడీ ప్రశ్నించారు. 125 కోట్ల భారతీయులు ఇక భారతమాతను మురికిగా ఉండాలని అనుకోరని ఆయన అన్నారు. పాత అలవాట్లను మానుకోవటం కొంచెం కష్టమే అని అయితే అందుకు మనకు ఇంకా 2019 వరకూ సమయం ఉందని మోడీ అన్నారు. చెత్త ఉన్న ప్రాంతం ఫోటో తీయండి, ఆ తర్వాత వాటిని శుభ్రం చేశాక ఫోటో తీసి నెట్ లో పెట్టాలని మోడీ అన్నారు. మార్స్ మిషన్ పూర్తి చేసింది ప్రధాని, మంత్రులు కాదని, భరతమాత బిడ్డలని అన్నారు. అతి తక్కువ ఖర్చుతో అంగారకుడిపై మార్స్‌ను ప్రయోగించిన మనం దేశాన్ని శుభ్రం చేసుకోలేమా అని ప్రశ్నించారు. బహిరంగ ప్రదేశాలలో పరిశుభ్రత కార్యక్రమంలో తాను తొమ్మిదిమంది పాల్గొనాలని పిలుపునిచ్చానని...వారు మరో తొమ్మిది మందికి ఆహ్వానం పంపాలని మోడీ కోరారు. అపరిశుభ్రత వల్ల వచ్చే రోగాలకు కుటుంబం ఏటా ఆరువేలు ఖర్చు పెడుతుందని మోడీ గుర్తు చేశారు. పరిశ్రుభతను పాటిస్తే ఆ ఆరువేలు ఆదా చేసినవారు అవుతారన్నారు. అనంతరం ఆయన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. -
డీయూలో ‘క్లీన్ ఇండియా’
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ‘ క్లీన్ ఇండియా’ పిలుపునకు ఢీల్లీ యూనివర్సిటీ(డీయూ) స్పందించింది. డీయూలో పారిశద్ధ్యం- ఆరోగ్య పరిరక్షణపై విద్యార్థులల్లో అవగాహన కల్పించడానికి 20 మంది సభ్యులతో కూడిన స్వచ్ఛ భారత్ అభియాన్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వర్సిటీ ప్రాంగణంలో పారిశుద్ధ్య పనితీరును పర్యవేక్షిస్తుంది. క్యాంపస్‌లో ఈ స్పెషల్ డ్రైవ్ ఒక్కరోజుతోనే పరిమితం కాదు, 2019 వరకూ నిరంతరం కొనసాగుతోంది. ఈ నెల 2వ తేదీ గాంధీ జయంతిన ప్రారంభించి, 150వ గాంధీ వర్ధంతి వరకూ నిరంతరం నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రణాళిక రూపొందించాం క్యాంపస్ ప్రాంగణాన్ని ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచడానికి అవసరమైన ప్రణాళికను రూపొందించామని డీయూ మీడియా కో ఆర్డినేటర్, జాయింట్ డీన్ మాలే నీరవ్ చెప్పారు. డీయూ విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది క్యాంపస్‌లో పారిశుద్ధ్య పరిరక్షణలో భాగస్వాములు అవుతారు. వీరితో కలిసి పనిచేయడానికి ఎంసీడీ కూడా పారిశద్ధ్య కార్మికులను నియమిస్తుంది. 2015, 2017, 2019 వరకు మూడు విడతలుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. యూనివర్సిటీ అధికారుల నేతృత్వంలో వివిధ కాలేజీల ప్రిన్సిపాల్స్ ఆయా కాలేజీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గాంధీ జయంతి రోజు శ్రీకారం: ఇందులో భాగంగానే నగర మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీడీ) నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమంలో ఢిల్లీ యూనివర్సిటీ పాలుపంచుకొంటోంది. ‘క్లీన్ ఇండియా’పై విద్యార్థుల్లో అవగాహన కల్పించడానికి శ్రీకారం చుట్టింది. ‘డీయూ స్వచ్ఛత అభియాన్’ ఆధ్వర్యంలో అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా వర్సిటీలోని గాంధీభవన్ వేదికగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. సుమారు 100 ఎంసీడీ సిబ్బందితో కలిసి పారిశుద్ధ్య కార్యమ్రాన్ని ప్రారంభిస్తున్నామని డీయూ సమాన అవకాశాల విభాగం డిప్యూటీ డీన్ బిపిన్ తివారి చెప్పారు. క్లీన్‌నెస్ ఆవశ్యకత-జవాబుదారీతనం గురించి విద్యార్థుల్లో అవగాహన కల్పించడమే ధ్యేయమని చెప్పారు. క్యాంపస్‌లో పారిశుద్ధ్య కార్మికులతో పాటు డీయూ సభ్యులు పాల్గొంటారు. దక్షిణ, ఉత్తర క్యాంపస్‌లోని అన్ని విభాగాల అధిపతులు, ప్రిన్సిపాళ్లు పాల్గొంటారు. క్యాంపస్ పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వైస్ చాన్స్‌లర్ పిలుపు ఇస్తారని తివారి చెప్పారు.