హైదరాబాద్‌ను క్లీన్‌సిటీగా చూడాలనేది నా కోరిక
హైదరాబాద్ :హైదరాబాద్‌ను క్లీన్‌సిటీగా చూడాలనేది తన కోరిక అని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోదీ నూతనంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని గవర్నర్ తన సతీమణితో కలిసి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మన ఇంటినే కాకుండా పరిసరాలనూ పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. తద్వారా అనారోగ్యం దరిచేరదన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వాలు స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌ను క్లీన్‌సిటీగా తయారు చేసేందుకు అందరూ కృషిచేయూలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన పరిశుభ్రత ఉండదని, పారిశుధ్య లోపాన్ని నివారించేందుకే గాంధీ ఆస్పత్రిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించావుని తెలిపారు. అంతకుముందు సతీమణి విమలా నరసింహన్‌తో కలిసి గాంధీ ఆస్పత్రి ఓపీ విభాగంలోని కొంతప్రాంతాన్ని చీపురుతో ఊడ్చి, కిటికీ అద్దాలను పరిశుభ్రం చేశారు. ఆస్పత్రి ప్రాంగణంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మీకు బాధ్యత లేదా?
స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం జరుగుతుండగా కొంతమంది రోగులు, రోగి సహాయకులు వచ్చి గాంధీ ఆస్పత్రిలో పారిశుధ్యలోపం ఉందని చెప్పడంతో గవర్నర్ అసహనం వ్యక్తం చేశారు. ‘పరిశుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత.. మీకు బాధ్యత లేదా’ అని ప్రశ్నించడంతో వారంతా అక్కడి నుంచి నిష్ర్కమించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌చందా, డీఎంఈ పుట్టా శ్రీనివాస్, ‘గాంధీ’ ప్రిన్సిపాల్ శ్రీలత, సూపరింటెండెంట్ అశోక్‌కుమార్, ఆస్పత్రి అధికారులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.