
మోదీపై బిల్‌గేట్స్ ప్రశంసల జల్లు
న్యూఢిల్లీ: భారత్‌లో పారిశుద్ధ్యంపై ప్రధాని నరేంద్రమోదీ చేపడుతున్న కార్యక్రమాలపై మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ప్రశంసల జల్లు కురిపిం చారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచి మోదీ స్థాయిలో ఏ నాయకుడు కూడా ఈ అంశంపై దృష్టి సారించలేదని, ఇది అభినందనీయమని కొనియాడారు. టాయిలెట్లపై ఆయన ఎలాంటి భేషజాలకు పోకుండా అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారని తాజాగా తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ‘‘భారత్‌లో వినూత్న ఆవిష్కరణలు మనల్ని అబ్బురపరచవచ్చు. కానీ అక్కడ 63 కోట్ల జనాభాకు మరుగుదొడ్ల వసతి లేదు. బహిరంగ మల విసర్జనే దిక్కు. ఇలా మరుగుదొడ్లకు నోచుకోలేనివారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల దాకా ఉంది. ఈ అంశంపై మాట్లాడేందుకు నాయకులు అంతగా ఆసక్తి చూపరు.
కానీ మోదీ టాయిలెట్ల ఆవశ్యకతపై అవగాహన కల్పించేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారు. ఇది గొప్ప విషయం’’ అని అందులో అన్నారు. సెప్టెంబర్‌లో భారత్‌కు వచ్చిన సందర్భంగా మోడీని కలిసిన ఫొటోను కూడా బిల్‌గేట్స్ తన బ్లాగ్‌లో పోస్ట్ చేశారు. బిల్‌గేట్స్, మిలిందా ఫౌండేషన్ల ద్వారా పేదలకు టాయిలెట్ల వసతి కల్పించేందుకు పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు.