శుక్రవారం ఢిల్లీలోని తన నివాసంలో బిల్ గేట్స్‌తో ప్రధాని మోదీ
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో ‘చాయ్ పే చర్చ’
కృత్రిమ మేధ దురి్వనియోగమయ్యే ప్రమాదం పొంచి ఉంది
డిజిటల్ విప్లవానికి ప్రజలే సారథులు కావాలన్న మోదీ
న్యూఢిల్లీ: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై తనకెంతో ఆసక్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. టెక్నాలజీలో తాను నిపుణుడిని కాకపోయినా దానిపై చిన్నపిల్లలకు ఉండే ఉత్సుకత తనకు కూడా ఉందని తెలిపారు. అదేసమయంలో టెక్నాలజీకి తాను బానిస కాలేదని వివరించారు. ప్రధాని మోదీ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో శుక్రవారం ‘చాయ్ పే చర్చ’ నిర్వహించారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతోపాటు విద్య, వైద్యం, వ్యవసాయం, వాతావరణ మార్పులు, మహిళా సాధికారత, కృత్రిమ మేధ వంటి కీలక అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఆయా రంగాల్లో భారత్ సాధిస్తున్న పురోగతిని బిల్‌గేట్స్‌కు తెలియజేశారు. ఇండియాలో వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో నూతన సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. బిల్‌గేట్స్‌తో మోదీ ఇంకా ఏం చెప్పారంటే...
కృత్రిమ మేధ.. మంత్రదండం కాదు
‘‘నేడు డిజిటిల్ ప్రజా మౌలిక సదుపాయాల అవసరం చాలా ఉంది. డిజిటల్ టెక్నాలజీపై ప్రజలకు అవగాహన పెంచాలి. కృత్రిమ మేధ(ఏఐ) వంటి శక్తివంతమైన సాంకేతికత దురి్వనియోగమయ్యే ప్రమాదం పొంచి ఉంది. నైపుణ్యం లేని వ్యక్తుల చేతుల్లో ఇలాంటి టెక్నాలజీ పడితే దుష్పరిణామాలు తప్పవు. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలి. నియమ నిబంధనలు అమలు చేయాలి. ఏఐతో సృష్టించే కంటెంట్‌లో వాటర్‌మార్క్‌ను జోడించాలి. ఏఐతో సృష్టించే డీప్‌ఫేక్‌ల విషయంలో అప్రమత్తత అవసరం. ఏఐని అన్నీ సాధించిపెట్టే మంత్ర దండంగా చూడొద్దు. అంటే కృత్రి మేధ విలువను తగ్గించడం నా ఉద్దేశం కాదు. గత ఏడా ది జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సులో ఏఐని నేను ఉపయోగించుకున్నా. పలు కార్యక్రమా ల్లో నా ప్రసంగాలను వేర్వేరు భాషల్లో ప్రసా రం చేయడానికి ఈ టెక్నాలజీ తోడ్పడింది.
భూగోళాన్ని కాపాడుకోవాలి
వాతావరణ మార్పులు ప్రపంచవ్యాప్తంగా పెను సవాళ్లు విసురుతున్నాయి. భూగోళాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. విద్యుత్ లేదా ఉక్కు వినియోగాన్ని అభివృద్ధికి కొలమానంగా చూపుతున్నారు. ఈ ధోరణి కచ్చితంగా మారాలి. విద్యుత్, ఉక్కు విచ్చలవిడి ఉత్పత్తి వల్ల పర్యావరణానికి చేటు తప్పదన్న సంగతి మర్చిపోవద్దు. ఇకపై గ్రీన్ జీడీపీ, గ్రీన్ ఎంప్లాయ్‌మెంట్ వంటి పరిభాషను ఉపయోగించాలి. వస్తువుల పునఃశుద్ధి, పునరి్వనియోగం ఇండియాలో చాలా సహజం. ఇప్పుడు నేను ధరించిన జాకెట్ రీసైకిల్ చేసిన ఉత్పత్తే. టెక్నాలజీ అంటే కేవలం సేవలను విస్తరించడానికే కాదు, సామాన్య ప్రజల జీవితాలను మరింత సులభతరం చేయాలని నేను నమ్ముతున్నా.
తృణధాన్యాల సాగుకు ప్రాధాన్యం
గత ఏడాది ఇండియాలో జీ20 సదస్సు నిర్వహించిన తర్వాత వాతావరణ మార్పులపై యుద్ధంలో వేగం పెరిగింది. వాతావరణ మార్పులను ఎదుర్కోవాలంటే మన జీవన శైలిని పర్యావరణ హితంగా మార్చుకోవాలి. ప్రకృతి, పర్యావరణహితమైన నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలి. విద్యుత్‌ను వృథా చేస్తే, నీటిని విచ్చలవిడిగా ఉపయోగిస్తే అనుకున్న లక్ష్యం సాధించలేం. తక్కువ నీరు అవసరమయ్యే తృణధాన్యాల సాగును పెంచడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. తృణధాన్యాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాం. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పెద్ద ముప్పుగా మారింది. త్వరలో కొలువుదీరే మా నూతన ప్రభుత్వ హయాంలో మహిళలకు.. ముఖ్యంగా బాలికలకు సరై్వకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తాం.
సాంకేతిక ప్రజాస్వామీకరణ
పునరుద్పాతక ఇంధన రంగంలో మేము శరవేగంగా దూసుకెళ్తున్నాం. గ్రీన్ హైడ్రోజన్ తయారీలో మరింత అభివృద్ధి సాధించడానికి కృషి చేస్తున్నాం. ‘సాంకేతిక ప్రజాస్వామీకరణ’ మా విధానం. డిజిటల్ విప్లవంలో గుత్తాధిపత్యానికి అడ్డుకట్ట వేశాం. ఈ రంగంలో అందరికీ సమాన అవకాశాలు కలి్పస్తున్నాం. డిజిటల్ విప్లవానికి సామాన్య ప్రజలే నాయకత్వం వహించాలన్నది మా ఆకాంక్ష. ఆ దిశగా ‘డ్రోన్ దీదీ’ పథకాన్ని ప్రవేశపెట్టాం.
నమో యాప్‌లో సెల్ఫీ
టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఇండియా చూపుతున్న చొరవను, వేగాన్ని బిల్‌గేట్స్ ప్రశంసించారు. ఈ విషయంలో ఇతర దేశాలకు మార్గదర్శిగా మారిందని కొనియాడారు. కృత్రిమ మేధను తాను ఉపయోగించుకుంటున్న తీరును గేట్స్‌కు మోదీ తెలియజేశారు. తన సెల్‌ఫోన్‌ను గేట్స్‌కు ఇచ్చి, అందులోని ‘నమో’ యాప్ ద్వారా సెల్ఫీ తీయాలని కోరారు. అందులోని టెక్నాలజీతో పాత ఫొటోలూ కనిపిస్తాయని అన్నారు. గతంలో తామిద్దరం దిగిన ఫొటోలను గేట్స్‌కు చూపించారు.
Comments
Please login to add a commentAdd a comment