లక్ష్మీదేవి ఎందుకెళ్లిపోతుందో తెలుసా?
సంపదతోపాటు, సుఖసంతోషాలను ఇచ్చే దేవత లక్ష్మీదేవి. ఆమె ఎక్కడ ఉంటే అక్కడ సంపద సమృద్ధిగా ఉంటుందని చాలామంది భారతీయుల విశ్వాసం. అందుకే పొద్దున్నలేవగానే లక్ష్మీదేవికి నిష్ఠగా పూజలుచేసి.. స్తోత్రాలను పఠిస్తూ ఉంటారు. మరీ అలాంటి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో తెలుసా.. తమ ఇంటితోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేవారి ఇంట్లోనే లక్ష్మీదేవి తాండవం ఆడుతుందట. ఎవరైతే శుభ్రతను పాటిస్తారో వారు దేవుడికి సన్నిహితంగా ఉంటారని ఒక నానుడి.
అదే నానుడిని నిజంచేస్తూ ఎవరైతే శుభ్రతను పాటిస్తూ.. తమ ఇంటిని, పరిసరాలను ఎవరైతే స్వచ్ఛంగా ఉంచుకుంటారో వారి ఇంటిలోనే లక్ష్మీదేవి పీటవేసుకొని పదిలంగా ఉంటుందని, ఎవరైతే పరిసరాలను నిర్లక్ష్యంగా చెత్తచెదారంతో నింపివేస్తారో వారి నుంచి దూరంగా వెళ్లిపోతుందని సందేశం ఇస్తూ.. 'స్వచ్ఛభారత్' షార్ట్ ఫిలిం అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రధాని నరేంద్రమోదీకి అత్యంత ఇష్టమైన పథకమైన 'స్వచ్ఛభారత్' ప్రచారం కోసం రూపొందించిన ఈ షార్ట్‌ఫిలింలో లక్ష్మీదేవిగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అలరించగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన గళాన్ని ఇచ్చారు. ఇషా కోప్పికర్, రవికిషాన్, ఓంకార్ కపూర్ వంటి ప్రముఖులతో రూపొందిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. శుభ్రత ప్రాధాన్యాన్ని గుర్తుచేస్తూ స్వచ్ఛతను పాటించకపోతే లక్ష్మీదేవి మిమ్మల్ని వదిలిపొతుందనే సందేశంతో ఈ న్యూ యాడ్ ఫిలిం రూపొందింది.