
తొంభై లక్షల మందికి కమల్ హాసన్ సవాల్
చెన్నై : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలెంజ్ను నటుడు కమల్ హాసన్ స్వీకరించారు. దేశాన్ని పరిశుభ్రంగా మార్చాలని కంకణం కట్టుకున్న మోడీ స్వచ్ఛ భారత్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ప్రధాని చాలెంజ్ను కమల్ హాసన్ స్వీరించారు. అంతే కాకుండా ఆయన 'నైన్ మిలియన్ పీపుల్'కు చాలెంజ్ చేశారు. 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో లో ప్రధాని తనను భాగస్వామ్యం చేయటంపై కమల్ ధన్యవాదాలు తెలిపారు. ఇది తనకు నూతన బాధ్యత అన్నారు. అయితే పరిశుభ్రతపై తాను ఇప్పటికే పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్లో పాల్గొనాలని కమల్ తొంభై లక్షల మంది ప్రజలకు పిలుపు నిచ్చారు.
ఈ మేరకు ఆయన ఓ వీడియాలో మాట్లాడుతూ పారిశుద్ధ్యం విషయంలో గత ఇరవై ఏళ్లుగా పాల్గొంటున్నానని, తనతో పాటు అభిమానులు సామాజిక సేవ చేస్తున్నట్లు చెప్పారు. తన పని కొనసాగుతోందని, అయితే ఇది ప్రజల పని అని, అందులో తాను ఓ భాగమన్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని రాజకీయంగా మార్చవద్దని సూచించారు. ప్రస్తుతం కమల్ హాసన్ మళయాళం, తెలుగులో విజయవంతమైన 'దృశ్యం' షూటింగ్లో బిజీగా ఉన్నారు. తమిళంలో ఈ చిత్రాన్ని 'పాపనాశం' పేరుతో కమల్ తెరకెక్కిస్తున్నారు.
కాగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ పరిశుభ్ర భారతావని ఆవశ్యకతపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలంటూ పలు రంగాల్లోని తొమ్మిది మంది ప్రముఖులకు ఆహ్వానం పలికారు. అలాగే ఆ ప్రముఖుల్లో ఒక్కొక్కరూ మరో తొమ్మిదేసి మందిని ఈ ప్రచారంలో పాల్గొనాల్సిందిగా కోరాలని సూచించారు. మోడీ ఎంపిక చేసిన 9 మంది ప్రముఖుల్లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్, నటులు కమల్‌హాసన్, సల్మాన్‌ఖాన్, ప్రియాంకా చోప్రా, గోవా గవర్నర్ మృదుల సిన్హా, ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌తోపాటు తారక్ మెహతా ఉన్నారు.