ప్రచారంలో కొత్త పోకడలు పోయే ప్రధాని నరేంద్ర మోదీ విస్తృత జనబాహుళ్యానికి చేరువ కావడానికి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
రేడియోలో మోదీ ‘మన్‌కీ బాత్’
న్యూఢిల్లీ: ప్రచారంలో కొత్త పోకడలు పోయే ప్రధాని నరేంద్ర మోదీ విస్తృత జనబాహుళ్యానికి చేరువ కావడానికి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన శుక్రవారం ఆలిండియా రేడియోలో తొలిసారిగా ‘మన్‌కీ బాత్’(మనసులో మాట) పేరుతో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 15 నిమిషాల పాటు సాగిన ఈ కార్యక్రమం దసరా పండుగరోజున ప్రసారం కావడం విశేషం. ప్రజలు నైరాశ్యాన్ని పారదోలి, తమ శక్తిని గుర్తించాలని, నైపుణ్యాలను దేశ సౌభాగ్యానికి వెచ్చించాలని మోదీ తన ప్రసంగంలో కోరారు. జాతిపిత మహాత్మాగాంధీకి నివాళిగా ఖాదీ దుస్తులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. ‘మన శాస్త్రవేత్తలు అంగారక యాత్రను అతి తక్కువ ఖర్చుతో విజయవంతం చేశారు. ఇకపై తరచూ రేడియోలో మాట్లాడతానన్నారు. కాగా, ‘స్వచ్ఛ భారత్’తో దేశంలో వెల్లువెత్తిన ఉత్సాహాన్ని ఆ కార్యక్రమం విజయవంతయ్యేంతవరకు కొనసాగించాలని మోదీ పిలుపునిచ్చారు.