
మమతా బెనర్జీ-నరేంద్ర మోదీ (ఫైల్ ఫోటో)
కోల్‌కత్తా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ బుధవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు. ఈ విషయాన్ని ధ్రువీకరించిన మమత.. మోదీని ఢిల్లీలో మర్యాదపూర్వకంగానే కలవనున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న నిధుల విడుదలతో పాటు, రాష్ట్రం పేరును మార్చే విషయాలను ప్రధానితో చర్చించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
బీజేపీని అన్ని విషయాల్లో విమర్శించే మమత అకస్మాత్‌గా మోదీతో భేటీతో రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మోదీ రెండోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమానికి అలాగే జూన్‌లో జరిగిన నీతిఅయోగ్ సమావేశానికి కూడా మమత గైర్హాజరు అయ్యారు. అయితే మమత ఎవరు ఊహించని విధంగా మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ఆ తర్వాత రోజే ఆయనతో భేటీ ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. దీంతో మమత అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు సీపీఐ(యమ్), కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి.
శారద స్కామ్ విషయంలో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు, కొల్‌కత్తా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను సీబీఐ విచారణ చేస్తున్న నేపథ్యంలో ప్రధాని-మమతా భేటీ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు మమత ప్రధానిని కలవనుండటంతో...దీదీని విమర్శించడాని బీజేపీకి మంచి అస్త్రం దొరికినట్లయింది. సీబీఐ నుంచి తనను తాను కాపాడుకోవడానికి మమత విఫలయత్నం చేస్తున్నారంటూ బీజేపీ వర్గాలు విమర్శిస్తున్నాయి.
ఈ విషయం పై బీజేపీ జాతీయ కార్యదర్శి రాహుల్ సిన్హా మాట్లాడుతూ ‘ఎన్నికలకు ముందు, ఆ తరువాత ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి ఆమె (మమత బెనర్జీ)ఏవిధంగా మాట్లాడారో మనందరికి తెలుసు. సమాఖ్య వ్యవస్థ పట్ల మమతకు గౌరవం లేదు. దేశానికి ప్రధానిగా భావించి అయిన నరేంద్రమోదీని ఆమె ఎప్పుడూ గౌరవించలేదు. అలాంటిది ఇంత అకస్మాత్తుగా మమత ఢీల్లీకి ఎందుకు వెళుతున్నారనేది బహిరంగ రహస్యమే’ అని ఆయన పేర్కొన్నారు. కాగా 2018 మే 25న జరిగిన విశ్వభారతి విశ్వభారతి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో నరేంద్రమోదీని మమత కలిశారు.
Comments
Please login to add a commentAdd a comment