సచివాలయంలో తీవ్ర ఉద్రిక్తత.. లోపలే సీఎం
పశ్చిమబెంగాల్ సచివాలయం కేంద్రంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికి దాదాపు 10 గంటలకు పైగా లోపలే ఉండి గడియ పెట్టుకున్నారు. బయటకు రావడానికి ఏమాత్రం అంగీకరించడం లేదు. రాష్ట్రంలోని అన్ని టోల్ ప్లాజాల వద్ద నుంచి సైన్యాన్ని ఉపసంహరిస్తే తప్ప తాను బయటకు వచ్చేది లేదని పట్టుబట్టారు. అయితే భారత సైన్యం మాత్రం ఆమె వాదనను కొట్టిపారేసింది. సైన్యం పశ్చిబెంగాల్‌లో కవాతు ఏమీ చేయడంలేదని, ఇది సర్వసాధారణంగా అన్నిచోట్లా తాము చేసే డ్రిల్లేనని చెప్పింది. పెద్దనోట్ల రద్దు మీద 190వ నిబంధన కింద చర్చిద్దామని అధికారపక్షం ప్రతిపాదించగా.. ఈరోజు కూడా ఆ అంశం మీద చర్చ జరిగే పరిస్థితి కనిపించడంలేదు. బెంగాల్ అంశం పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసే అవకాశం స్పష్టంగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తాను ఇక్కడే ఉంటానని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తన ప్రభుత్వాన్ని కూడా కాపాడుకుంటానని మమత మీడియాతో అన్నారు.
రాష్ట్రంలోని 12 జిల్లాల్లో సైన్యాన్ని మోహరించినట్లు తనకు సమాచారం ఉందని తృణమూల్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ అన్నారు. తాము పోలీసులతో సమన్వయం చేసుకుంటున్నామని.. వాళ్లకు ఆ విషయం తెలుసని ఆర్మీ ఈస్ట్రన్ కమాండ్ చెబుతున్న విషయం వాస్తవం కాదని చెప్పారు. సైన్యం అంటే తమకు గౌరవం ఉందిగానీ, వాహనాల లెక్కలు ఇప్పటికే సైన్యం వద్ద ఉన్నాయని చెబుతున్నారని అన్నారు. రాష్ట్రాల్లో ఇలా జరగడం ఇదేమీ కొత్త కాదని సైన్యానికి చెందిన వింగ్ కమాండర్ ఎస్ఎస్ బిర్ది అన్నారు. గురువారం అర్ధరాత్రి తర్వాత సచివాలయం సమీపంలో ఉన్న టోల్‌ప్లాజా నుంచి సైన్యాన్ని ఉపసంహరించారు.