సైన్యం వెళ్లినా.. సీఎం కదల్లేదు!
పశ్చిమబెంగాల్‌లోని కొన్ని టోల్ ప్లాజాల వద్ద సైన్యాన్ని మోహరించడంపై మొదలైన హైడ్రామా అర్ధరాత్రి దాటేవరకు కొనసాగుతూనే ఉంది. రాత్రంతా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సచివాలయంలోనే ఉండిపోయారు. ఆమె డిమాండు మేరకు సైన్యాన్ని టోల్ ప్లాజాల నుంచి తొలగించినా ఆమె మాత్రం అక్కడినుంచి కదల్లేదు. ''ప్రజలను కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది. వాళ్లను అభద్రతా భావంలో వదిలేసి నేను వెళ్లలేను. రాత్రంతా ఇక్కడే ఉండి పరిస్థితిని పరిశీలిస్తాను'' అని అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో మీడియాకు చెప్పారు. రెండో హూగ్లీ బ్రిడ్జి టోల్ ప్లాజా దగ్గర నుంచి ఆర్మీ వెళ్లిపోయింది కదా అని ప్రశ్నించగా, అక్కడి నుంచి వెళ్లొచ్చు గానీ మరో 18 జిల్లాల్లో వాళ్లు ఉన్నారని చెప్పారు. ఇదేమైనా సైనిక కుట్రా అని మమత ప్రశ్నించారు. సైన్యం ఎక్కడైనా మాక్ డ్రిల్ చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని, కానీ వాళ్లు ఏకంగా ఇక్కడ మోహరించినా అనుమతి తీసుకోలేదని చెప్పారు. ఆమె ప్రెస్‌మీట్ పెట్టడానికి ముందే పాత్రికేయులు టోల్ ప్లాజా వద్దకు వెళ్లి చూడగా, అక్కడ సైన్యానికి సంబంధించినవాళ్లు ఎవరూ లేరు. వాళ్ల కోసం ఏర్పాటుచేసిన తాత్కాలిక శిబిరాన్ని కూడా అక్కడినుంచి తీసేశారు. కాగా, ఉదయం 8.45 గంటల సమయానికి కూడా ఆమె సచివాలయంలోనే ఉన్నారు. అక్కడి నుంచి కదల్లేదు.
దేశవ్యాప్తంగా సైన్యం ఏడాదికి రెండుసార్లు ఇలాంటి ఎక్సర్‌సైజులు చేస్తుందని, ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే అందుబాటులో కావాల్సిన లోడ్ క్యారియర్ల గురించి లెక్కలు తీసి సిద్ధంగా ఉంచుకుంటుందని, ఇక్కడ కూడా అందుకోసమే సైన్యం వచ్చింది తప్ప.. వేరే ఉద్దేశం లేదని వింగ్ కమాండర్ ఎస్ఎస్ బిర్ది తెలిపారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఏదైనా ప్రాంతం గుండా నిర్దేశిత సమయంలో ఎన్ని వాహనాలు వెళ్తున్నాయో లెక్క చూస్తామని, అత్యవసర సమయంలో అక్కడ వాహనాలు ఆగిపోతే ప్రభావం ఎలా ఉంటుందో అంచనా వేస్తామని ఆయన అన్నారు. పశ్చిబెంగాల్ పోలీసులకు పూర్తి సమాచారం అందించిన తర్వాతే సైన్యం ఇక్కడకు వచ్చిందని.. టోల్ ప్లాజాలను ఆర్మీ స్వాధీనం చేసుకుందంటూ వచ్చిన ఆరోపణలు సరికావని ఈస్ట్రన్ కమాండ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. అసోంలోని 18 ప్రాంతాలు, అరుణాచల్‌ప్రదేశ్‌లో 13 ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్‌లో 6, నాగాలాండ్‌లో 5, మేఘాలయలో 5, త్రిపుర, మిజొరాంలలో ఒక్కో ప్రాంతంలో ఈ ఎక్సర్‌సైజులు జరుగుతున్నాయన్నారు. కోల్‌కతా పోలీసులు మాత్రం సైన్యం ఇక్కడకు రావడం వల్ల ట్రాఫిక్ సమస్య, భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తాయని అంటున్నారు.
సచివాలయం, టోల్ ప్లాజా రెండూ సున్నితమైన ప్రాంతాలని, ఇలాంటి చోట్ల సైన్యంఎందుకని మమత అన్నారు. వాళ్లు చెబుతున్న కారణాలు సహేతుకం కావని, వాళ్లు అబద్ధాలు ఆడుతున్నారని చెప్పారు. ఎప్పటికప్పుడు కారణాలు మార్చుకుంటూ వెళ్తున్నారని, వేర్వేరు రాష్ట్రాల్లో వాహనాల కదలికలకు సంబంధించిన పూర్తి సమాచారం కేంద్ర హోం మంత్రిత్వశాఖ వద్ద ఉందని ఆమె అన్నారు. తాను మహారాష్ట్ర, కేరళ, ఒడిషా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో చూశానని, ఎక్కడా ఇలా జరగలేదని ఆమె తెలిపారు. (ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్‌లో ఇలా చేసినట్లు సైన్యం వివరాలతో సహా చెప్పింది). ''ఇక్కడ ఏం జరుగుతోంది? వాళ్లు కాల్చేస్తారేమోనని నేను భయపడుతున్నాను. నేను బతికున్నా.. చనిపోయినా.. నేను మాత్రం సామాన్య ప్రజల గురించే మాట్లాడతా'' అని అన్నారు. కేంద్రం పదే పదే తప్పులు చేస్తోందని, ఇప్పుడు ఘోరమైన తప్పిదం చేసిందని మండిపడ్డారు. ఇది సమాఖ్య వ్యవస్థమీదే జరిగిన దాడిగా ఆమె అభివర్ణించారు.