మమత బెంగాల్‌నే కుప్పకూలుస్తారు | Mamata Banerjee will destroy Bengal: Narendra Modi | Sakshi
Sakshi News home page

మమత బెంగాల్‌నే కుప్పకూలుస్తారు

Published Fri, Apr 8 2016 3:04 AM | Last Updated on Fri, Aug 24 2018 2:20 PM

మమత బెంగాల్‌నే కుప్పకూలుస్తారు - Sakshi

మమత బెంగాల్‌నే కుప్పకూలుస్తారు

అసన్‌సోల్ , బిర్‌పారా, మదారిహట్: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై గురువారం ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అవినీతితో మమతా లాలూచీ పడ్డారంటూ అసన్‌సోల్, బిర్‌పారా, మదారిహట్ ఎన్నికల ప్రచారంలో మోదీ ఆరోపించారు. మదారిహట్ సభలో ప్రసంగిస్తూ... తృణమూల్ కాంగ్రెస్ నుంచి బెంగాల్‌ను కాపాడమని ప్రజలకు దేవుడిచ్చిన సందేశమే కోల్‌కతా ఫ్లైఓవర్ దుర్ఘటనని అన్నారు. ఈ రోజు బ్రిడ్జి కూలిందని, రేపు మమతా మొత్తం బెంగాల్‌నే కుప్పకూలుస్తారంటూ మోదీ విమర్శించారు. తృణమూల్ కాంగ్రెస్ అంటే బీభత్సం, మృత్యువు, అవినీతని వ్యాఖ్యానించారు.

తృణమూల్ నేతల అవినీతిని నారదా స్టింగ్ ఆపరేషన్‌లో చూపించినా... ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అవినీతితో మమతా కుమ్మక్కయ్యారని తప్పుపట్టారు. రాష్ట్ర సమస్యలపై కేంద్రం నిర్వహించే సమావేశాలకు పిలిచినా... మమత హాజరయ్యేవారు కాదని, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలిసినా దీదీ ఇష్టానుసారం ప్రవర్తించేవారని చెప్పారు. మోదీ అధ్యక్షత వహిస్తారనే సమావేశాలకు వచ్చేవారు కాద ని, ఢిల్లీ వచ్చినప్పుడు మాత్రం సోనియాగాంధీని కలిసేవారంటూ విమర్శించారు. ‘ఫ్లై ఓవర్ కూలిన సమయంలో సీఎం ఏం చేయాలి. ప్రజల్ని రక్షించేందుకు, సహాయక చర్యల్లో పాల్గొనాలి. మరి దీదీ ఏం చేశారు. ఫ్లైఓవర్ ప్రమాదం లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వ తప్పిదమని చెప్పారు’ అని మోదీ తప్పుపట్టారు.

లెఫ్ట్ లేదా రైట్ అన్నది వదిలేసి చనిపోతున్న ప్రజల గురించి ఆలోచించండి దీదీ అంటూ మమతకు చురకలంటించారు. కొందరు ఈ ప్రమాదాన్ని దైవ ఘటన అంటున్నారని, కాని ఇది అవినీతి తప్పిదమన్నారు. కేరళలో కమ్యూనిస్టులతో కాంగ్రెస్ పోరాడుతూ.. బెంగాల్లో పొత్తు పెట్టుకోవడాన్ని తప్పుపట్టారు.
 
సామాన్యుల సమస్యల్ని గుర్తించండి
న్యూఢిల్లీ: ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా సాంకేతిక పరిజ్ఞానం ఉండాలని శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగిన సీఎస్‌ఐఆర్ సదస్సులో మోదీ మాట్లాడారు. ఈమేరకు పీఎంఓ ప్రకటన విడుదల చేసింది. సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న వంద సమస్యల్ని గుర్తించి నిర్ణీత గడువులోగా వాటికి పరిష్కారాలను శాస్త్రవేత్తలు కనుగొనాలన్నారు. వ్యవసాయరంగంలో సౌరశక్తి వినియోగానికి అవసరమైన ఆవిష్కరణలు, సైనికులకు ప్రాణరక్షక సామగ్రి వాటి అభివృద్ధి, సికిల్ సెల్ ఎనీమియా వ్యాధికి (రక్తహీనత) మందులు కనుగొనడం వంటివి జరగాలని ఆకాంక్షించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement