'నోర్ముయ్.. చెంప పగులుద్ది'
సాక్షి, కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి ఒకరు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ బ్యాంకులోకి వెళ్లి అందులో ఉద్యోగిపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఎక్కువమాట్లాడితే లాగిపెట్టి కొట్టి ఈడ్చి బయటకు గెంటేస్తానంటూ కళ్లెర్రజేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. టీఎంసీ మంత్రి రవీంద్రనాథ్ ఘోష్ గుగుమారి అనే ప్రాంతంలో తన కారులో వెళుతూ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద బారులు తీరిన జనాల్ని చూశారు.
అయితే, వెంటనే కారు ఆపుజేయించి నేరుగా వారి వద్దకు వెళ్లి సమస్య ఏమిటని ప్రశ్నించారు. కొద్ది రోజులుగా బ్యాంకు సరిగా పనిచేయడం లేదని, అంతర్జాలం (ఇంటర్నెట్) సమస్య కారణంగా లావాదేవీలు సక్రమంగా జరగడం లేదని చెప్పారు. దీంతో వేగంగా లోపలికి దూసుకెళ్లిన ఆయన.. 'ఎవరు దీనికి బాధ్యులు?' అని ప్రశ్నించగా 'మా బాధ్యతే సర్' అంటూ ఉద్యోగి బదులు ఇచ్చారు.
అయితే, ఆయన మాటలు ఏవి పట్టించుకోకుండా.. 'నోర్ముయ్.. నీ హద్దులు దాటొద్దు. లాగిపెట్టి చెంప మీద ఒక్కటిస్తాను' అని మంత్రి అన్నారు. 'మీరు అలా మాట్లాడకూడదు. మేం కూడా పనిచేస్తున్నాము' అని ఉద్యోగి అనగా.. మంత్రి ఆగ్రహంతో.......(చెప్పరాని మాటలు) నోర్ముయ్.. నిన్ను బయటకు గెంటేస్తా' అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో కూడా రికార్డయ్యాయి. దీనిపై బ్యాంకు సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరుపునుంచి మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు.