
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కాన్వాయ్ వద్ద జై శ్రీరాం అంటూ నినదించిన బీజేపీ కార్యకర్తలపై దీదీ మండిపడ్డారు. పశ్చిమ మిడ్నపూర్ జిల్లా పల్లవ్‌పూర్ గ్రామం వద్ద మమతా బెనర్జీ ప్రచార ర్యాలీ ముగించుకుని వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. జై శ్రీరాం నినాదాలు చేస్తున్న కాషాయ పార్టీ శ్రేణులను చూసి ఆమె వాహనం నుంచి దిగిరాగా, బీజేపీ కార్యకర్తలు అక్కడి నుంచి పరుగున జారుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది.
తన కాన్వాయ్ వెంబడి నినాదాలు చేస్తున్న వారిని గమనించిన దీదీ కారును ఆపి వారి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఎందుకు పారిపోతున్నారు..ఇక్కడకు రండి అంటూ ఆమె గద్దించారు. రోడ్డుకు ఇరువైపులా గుమికూడిన కొందరు వ్యక్తులు అసభ్య పదజాలం వాడారని ఆరోపించారు. కాగా, ఈ ఘటన అనంతరం పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలో ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన మమతా బెనర్జీ బీజేపీ కార్యకర్తల నినాదాలతో తాను భయపడనని, లోక్‌సభ ఎన్నికల తర్వాత తాము బెంగాల్‌లోనే ఉండాలన్న సంగతిని ఇలాంటి కార్యక్రమాలను చేపట్టే వారు మరువరాదని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment