కోల్‌కతా/చండీఘడ్: పశ్చిమ బెంగాల్ సచివాలయ ముట్టడికై ‘‘ఛలో నబన్నా’’ పేరుతో బీజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై సిక్కు సోదరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసనకారులకు, పోలీసులకు మధ్య హౌరాలో జరిగిన గురువారం నాటి ఘర్షణలో బల్వీందర్ సింగ్ అనే వ్యక్తి పట్ల అనుచితంగా ప్రవర్తించి, తమ మనోభావాలు గాయపరిచారంటూ మండిపడుతున్నారు. కాగా ఆందోళనకారులను అదుపుచేసే క్రమంలో బెంగాల్ పోలీసులు టియర్‌గ్యాస్, నీటి ఫిరంగులు ప్రయోగించి లాఠీచార్జ్ చేస్తూ వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భాటిండాకు చెందిన బల్వీందర్ సింగ్ వద్ద తుపాకీ ఉందన్న అనుమానంతో అతడిని కిందపడేసి కొడుతూ టర్బన్ లాగిపడేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సిక్కు సమాజం నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.( చదవండి: బీజేపీ కార్యకర్తలపై దాడి.. దీదీపై నడ్డా ఫైర్)
పంజాబ్ సీఎం దిగ్భ్రాంతి
ఈ విషయంపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, క్రికెటర్ హర్భజన్ సింగ్, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ తదితరులు స్పందించారు. ‘‘ఇలా జరగాల్సింది కాదు. సిక్కు వ్యక్తిని అరెస్టు చేసే క్రమంలో అతడి టర్బన్ తొలగించిన అమానుష ఘటన పట్ల ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు’’అంటూ సీఎం అమరీందర్ సింగ్ మీడియా సలహాదారు రవీన్ తుక్రాల్ శుక్రవారం ట్వీట్ చేశారు. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలకు ఆదేశించాల్సిందిగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.
అదే విధంగా.. ‘‘దయచేసి ఈ విషయంపై విచారణ జరిపించండి. అసలు ఇలా జరిగి ఉండాల్సింది కాదు’’అని హర్భజన్ సింగ్ ట్విటర్ వేదికగా బెంగాల్ ప్రభుత్వాన్ని కోరాడు. ఇక ఇదొక విద్వేషపూరిత దాడి అంటూ బాదల్ పోలీసుల తీరుపై మండిపడ్డారు. బల్వీందర్ సింగ్ సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్నాడని, అతడి వద్ద గన్ ఉందంటూ ఇలాంటి అమానుష చర్యకు దిగి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కుల మనోభావాలు దెబ్బతీశారంటూ ధ్వజమెత్తారు. సిక్కులను అవమానపరిచిన పశ్చిమ బెంగాల్ పోలీసుల తీరును ఖండిస్తున్నామని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రకటన విడుదల చేశారు.
మా డ్యూటీ మేం చేశాం..
ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో పశ్చిమ బెంగాల్ పోలీసులు ట్విటర్ వేదికగా శుక్రవారం తమ స్పందన తెలియజేశారు. ‘‘నిన్నటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సదరు వ్యక్తి(బల్వీందర్ సింగ్) ఆయుధాలు కలిగి ఉన్నారు. అతడిని అడ్డుకునే క్రమంలో పగ్రీ(టర్బన్) కిందపడిందే తప్ప, ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. ఒక వర్గం మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం మాకు లేదు. మేం అన్ని మతాలను గౌరవిస్తాం. నిజానికి అరెస్టుకు ముందే టర్బన్ ధరించాల్సిందిగా సూచించాం. మా కర్తవ్యానికి కట్టుబడి, శాంతి భద్రతలు కాపాడేందుకు మా డ్యూటీ మేం చేశాం’’అంటూ బల్వీందర్ సింగ్ టర్బన్ ధరించి ఉన్న ఫొటోను షేర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment