
మహిళతో సహజీవనం.. ఆపై దారుణహత్య!
న్యూఢిల్లీ: తనతో కొన్నేళ్ల నుంచి సహజీవనం చేస్తున్న మహిళను ఓ వ్యక్తి దారుణంగా హత్యచేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని గురువారం అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం.. ఒడిషాలోని ఝరియావాడకు చెందిన బలరామ్(48) కొన్నేళ్లుగా ఢిల్లీలో ప్లంబర్‌గా పనిచేస్తున్నాడు. న్యూఢిల్లీ సమీపంలోని గర్హిలో గత 25 ఏళ్లుగా అనార్కలీ అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఈమె టీ షాపు నిర్వహిస్తోంది. వీరి పరిచయం వివాహేతర సంబంధాలకు దారితీయడంతో చెన్నైకి చెందిన అనార్కలి(43)తో బలరామ్ సహజీవనం చేస్తున్నాడు. అనార్కలీ ఉంటున్న అద్దె ఇంట్లోనే వీరు సహజీవనం చేశారు.
మూడేళ్ల కిందట తన స్వగ్రామానికి వెళ్లిన బలరామ్ ఇటీవల ఢిల్లీకి వచ్చాడు. ఆ తర్వాత కూడా వీరిద్దరూ సహజీవనం చేశారు. ఈ క్రమంలో ఈ నెల 2న సుత్తితో అనార్కలీ మెడ, తలపై విచక్షణారహితంగా దాడిచేసి హత్యచేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు చేసి రెండు బ్యాగుల్లో సర్ది డ్రైనేజీలో పారవేశాడు. అనార్కలీ కనిపించడం లేదని స్థానికులు అడిగగా ఆమె తన స్వగ్రామానికి వెళ్లిందని చెప్పాడు. అయితే బలరామ్ పొంతన లేని విషయాలు చెబుతున్నాడని, అనార్కలీని హత్యచేసి ఉండొచ్చునని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు బలరామ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపెట్టాడు. తాను ఢిల్లీలో లేని సమయంలో అనార్కలీ వేరే వ్యక్తితో వివాహేతర సంబంధాలు పెట్టుకుందన్న కారణంగానే తాను ఆమెను హత్యచేశాడని విచారణలో చెప్పాడు. రెండు ఎయిర్ బ్యాగులో ఉన్న మృతదేహం భాగాలు అనార్కలీవేనని పోలీసులు గుర్తించారు.