కూతురితో నిప్పుల గుండంలో నడుస్తూ..
జలంధర్: చుట్టూ డప్పుమోతలు.. కుప్పలుకుప్పలుగా చేరిన జనం.. చెవులు చిల్లులు పడేలా కొమ్ముబూరల చప్పుళ్లు కూడా. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రత్యేక వస్త్రాల్లో ప్రతి ఒక్కరు అక్కడికి చేరారు. వారి కళ్ల ఎదుట కొంత బొందలాగా తీసిన నిప్పుల కుప్పను పొడవాటి చాపలాగా పరిచారు. చూస్తుండగానే పదుల సంఖ్యలో ఆ నిప్పుకణికలపై నడుస్తూ ఉండగా ఓ తండ్రి కూతురుమాత్రం అనూహ్యంగా అందులో పడిపోయారు. గట్టిగా గావు కేకలు.
ఈలోగా అక్కడ ఉన్నవాళ్లు వారికి సాయం చేసి పైకిలాగి ఆస్పత్రిలోకి చేర్పించగా ప్రస్తుతం తీవ్ర గాయాలతో పోరాడుతున్నారు. ఈ ఘటన పంజాబ్లో సోమవారం చోటుచేసుకుంది. జలంధర్లో ఓ అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన నిప్పుల గుండంలో నడుస్తూ తండ్రి కూతుర్లు ప్రమాదవ శాత్తు అందులో పడిపోయారు. తిరిగి పైకి లేవలేకపోయారు.
ఈ క్రమంలో వారి ఒళ్లంతా తీవ్ర గాయాలయ్యాయి. కొంతమంది యువకులు వారికి చేయందించి సాయం చేయడంతో ప్రాణగండం తప్పింది. 2013లో కూడా జలంధర్లో జరిగిన ఇదే ఉత్సవాల్లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. అప్పట్లో ఓ తల్లి తన కూతురుని ఎత్తుకొని నడుస్తూ అందులో పడి తీవ్ర గాయాలపాలవ్వగా ఇది మరో ఘటన. హిందూ సంప్రదాయంలో ఇప్పటికీ పలు చోట్ల నిప్పుల గుండాన్ని ఏర్పాటుచేసి తమ పాపాలు పోవాలి అని మొక్కుకుంటూ అందులో నడిచే అలవాటు కొనసాగుతున్న విషయం తెలిసిందే.