సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తెలంగాణ, ఆంధ్రప్రాంత ఉద్యోగుల మధ్య వైషమ్యాలు పెంచేలా వ్యవహరిస్తున్నారని టీఆర్‌ఎస్ నేత, మాజీ ఎంపీ మందా జగన్నాథం ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఉద్యోగులకు న్యాయం చేసేందుకు వార్‌రూమ్ ఏర్పాటు చేసుకొని సమాచారాన్ని సేకరిస్తుంటే, చంద్రబాబు మాత్రం దాన్ని యుద్ధక్షేత్రంగా వర్ణిస్తూ, ‘యుద్ధానికి నేనే వస్తా’ అని రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్య లు మానుకోవాలని సూచించారు. ‘తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఇక్కడే తిష్ట వేయడానికి ఆంధ్రా ఉద్యోగులు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ఉద్యోగ నేత విఠల్‌ను ఆంధ్రాకి కేటాయించి, సచివాలయంలోని 18 మంది ఆంధ్రా ఉద్యోగులకు స్థానికత పత్రాలు ఇచ్చారు. ఇవన్నీ చూస్తూ కూర్చోవాలా?’ అని బాబును ప్రశ్నించారు.