‘ఎవరూ ముందుకు రాలేదు.. నేనే దిగాను’ | Mangaluru BJP Corporator Enters Manhole to Clean Clogged Pipe | Sakshi
Sakshi News home page

మ్యాన్‌హోల్‌ శుభ్రం చేసిన కార్పొరేటర్‌.. ఫోటోలు వైరల్‌

Published Thu, Jun 25 2020 3:36 PM | Last Updated on Thu, Jun 25 2020 3:51 PM

Mangaluru BJP Corporator Enters Manhole to Clean Clogged Pipe - Sakshi

బెంగళూరు:  మ్యాన్‌హోల్‌ లాంటి వాటిలో అడ్డంకులు ఏర్పడితే.. అధికారులకో.. ప్రజా ప్రతినిధులకు ఫోన్‌ చేస్తాం. వారు పారిశుద్ధ్య కార్మికులను పంపించి శుభ్రం చేయించి సమస్యను పరిష్కరిస్తారు. అయితే స్వయంగా ఓ ప్రజాప్రతినిధే మ్యాన్‌హోల్‌లోకి దిగి శుభ్రం చేసిన సంఘటన గురించి ఇంతవరకు ఎప్పుడు వినలేదు. కానీ బీజేపీ కార్పొరేటర్ మనోహర్ శెట్టి ఈ సంఘటనను నిజం చేసి చూపారు. మనోహర్‌ శెట్టి స్వయంగా మ్యాన్‌హోల్‌లోకి దిగి.. శుభ్రం చేశారు. ఆయనను అనుసరించి మరో నలుగురు బీజేపీ కార్యకర్తలు మ్యాన్‌హోల్‌లోకి దిగారు. అందరూ కలిసి ఆ మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసి నీరు సాఫీగా పోయేలా చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. ఆ వివరాలు.. 

మంగళూరు సిటీ కార్పొరేషన్ పరిధిలోని కద్రీ-కంబాలా వార్డు వద్ద చెత్త కుప్పలుగా బయట వేయడంతో ఆ పక్కనే ఉన్న మ్యాన్‌హోల్లో చెత్త అడ్డుపడి.. నీరు బయటకు పొంగిపోయింది. రహదారిపై నీరు ప్రవహిస్తూ ట్రాఫిక్‌కు, రోడ్డు మీద నడిచేవారికి ఇబ్బంది కలిగించింది. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ మనోహర్ శెట్టి అక్కడికి చేరుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులను పిలిచి మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేయాలని కోరారు. అయితే రుతుపవనాల సమయంలో ఇది చాలా ప్రమాదకరమని, మ్యాన్‌హోల్ లోపలికి వెళ్లడానికి వారు నిరాకరించారు. దాంతో మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసేందుకు హై స్పీడ్ వాటర్ జెట్ అమర్చిన వాహనాన్ని పంపాలని మనోహర్‌ శెట్టి నగర కార్పొరేషన్‌ను ఆదేశించారు. ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. ఇక లాభం లేదనుకున్న మనోహర్ శెట్టి తానే స్వయంగా 8 అడుగుల లోతులో ఉన్న మ్యాన్‌హోల్‌లోకి దిగి నీటి ప్రవాహానికి అడ్డుపడిన చెత్తను తొలగించారు. (పిండికొద్దీ ప్లేటు)

ఈ సందర్బంగా కార్పొరేటర్ మనోహర్ శెట్టి మీడియాతో మాట్లాడుతూ.. ‘మ్యాన్‌హోల్‌లో ఏదో అడ్డుపడి నీరు బయటకు పొంగిపొర్లుతుంది. పారిశుద్ధ్య కార్మికులను శుభ్రం చేయమని అడిగితే.. ప్రస్తుత పరిస్థితుల్లో దిగలేమని చెప్పారు. మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇక లాభం లేదనుకుని.. నేనే మ్యాన్‌హోల్‌లోకి ప్రవేశించి.. పైపుకు అడ్డుగా ఉన్న చెత్తను తొలగించాను. ఇది చూసి బీజేపీ పార్టీ కార్యకర్తలు నలుగురు నన్ను అనుసరించారు. ఆ మ్యాన్‌హోల్ ఎనిమిది అడుగుల లోతులో ఉంది.లోపలంతా చీకటిగా ఉంది. టార్చ్ లైట్లు వేసుకుని శుభ్రం చేశాము’ అని పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించడం తన బాధ్యత అన్నారు. మరో సారి మ్యాన్‌హోల్‌లోకి దిగడానికి కూడా తాను వెనకాడనని తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరలవ్వడమే కాక.. మనోహర్‌ శెట్టిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. (నిప్పుల గుండంలో యోగా చేసిన ఎంపీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement