భాబర్: కాంగ్రెస్ నుంచి సస్పెండైన కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్‌పై ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. తన అడ్డుతొలగించుకునేందుకు పాకిస్తాన్ వెళ్లి సుపారీ (కాంట్రాక్టు) ఇచ్చారని పేర్కొన్నారు. ఉత్తర గుజరాత్‌లో రెండో దశ ఎన్నికలు జరగనున్న భాబర్‌లో జరిగిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు.
కాంగ్రెస్ నేతలు ‘నీచ’ పదాన్ని వినియోగించి తనపై విమర్శలు చేయటం ఇది తొలిసారేం కాదని.. గతంలోనూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, ఆమె కుటుంబసభ్యులు ఇలాంటి పదాలను వాడి చులకనగా మాట్లాడారని ప్రధాని పేర్కొన్నారు. అయ్యర్ వ్యాఖ్యల వివాదంతో గుజరాత్ ఎన్నికల్లో ఇబ్బందులు తలెత్తకుండా.. ఆయనపై చర్యలేమీ లేకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేసి సమస్యను పక్కదారి పట్టించారని విమర్శించారు. అయోధ్య కేసును రాజకీయ కారణాలతో ముడిపెట్టిన న్యాయవాద నేత (కపిల్ సిబల్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ)ను పార్టీ నుంచి ఎందుకు తొలగించరని ప్రశ్నించారు.
‘నీచ’ పదాన్ని వాడుతూనే ఉన్నారు
‘శ్రీమాన్ మణిశంకర్ అయ్యర్ ఏం చేశారో మీకు తెలుసా? ఆయన ‘నీచ్ ఆద్మీ’ అని నన్ను తిట్టాడా, లేక మిమ్మల్నా? భారత సంస్కృతిని అవమానించాడా? లేక నన్నా? గుజరాత్ ప్రజలు ఓటు ద్వారా వారికి (కాంగ్రెస్) బుద్ధి చెప్పాలి’ అని మోదీ పేర్కొన్నారు. ‘నేను ప్రధాని అయ్యాక, ఈయన (అయ్యర్) పాక్‌కు వెళ్లారు. అక్కడ పాకిస్తానీలతో మాట్లాడుతూ.. ఎప్పటివరకు మోదీని అడ్డుతొలగించుకోలేమో అప్పటివరకు భారత్–పాక్ మధ్య సంబంధాలు మెరుగవ్వవని అన్నారు.
ఇవన్నీ మీకు సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి. మీరెవరైనా చెప్పండి అడ్డు తొలగించుకోవటమంటే అర్థమేంటి? పాక్‌కు వెళ్లి నన్ను చంపేందుకు సుపారీ ఇచ్చారు. ఇదంతా మూడేళ్ల క్రితం జరిగింది. కాంగ్రెస్ ఈ అంశాన్ని దాచాలని ప్రయత్నించింది’ అని అన్నారు. కాంగ్రెస్ నేతలను తనపై వాడిన పరుషపదజాలాన్ని గుర్తుచేశారు. ‘కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ మూర్ఖ ప్రధాని అన్నారు.
దిగ్విజయ్ దేశంలో రాక్షస రాజ్యం నడుస్తోందన్నారు. మరో కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ అయితే.. నియంతలైన గడాఫీ, ముస్సోలిని, హిట్లర్‌లతో పోల్చారు. సోనియా మృత్యుబెహారీ అన్నారు. ఆనంద్‌శర్మ, మన్మోహన్‌లైతే ప్రధాని మానసిక స్థైర్యం కోల్పోయారన్నారు. ఓ చాయ్‌వాలా ప్రధాని అవటాన్నీ జీర్ణించుకోలేకే మీరు ఇలాంటి పదాలు వాడుతున్నారు. అయినా నేనెప్పుడూ మిమ్మల్ని ఏమీ అనలేదు. ఇప్పుడు మళ్లీ మీరు కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు’ అని కాంగ్రెస్ నేతలనుద్దేశించి మోదీ పేర్కొన్నారు.
అదే కాంగ్రెస్ సంస్కృతి
‘కాంగ్రెస్ పార్టీ అట్కానా (అడ్డుకోవటం), లట్కానా (అంశాలను పక్కన పెట్టడం), భట్కానా (పక్కదారి పట్టించటం)లపైనే ఎక్కువ విశ్వసిస్తుంది. ఇదే ఆ పార్టీ పని సంస్కృతికి నిదర్శనం’ అని మోదీ విమర్శించారు. ప్రజలెవరూ ఈ సుపారీల గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని, తనను ఎప్పుడూ భగవంతుడు కాపాడుతూనే ఉంటాడన్నారు.
సర్జికల్ దాడులు జరిగినప్పుడు యావద్భారతం హర్షం వ్యక్తం చేస్తే.. కాంగ్రెస్‌పార్టీ మాత్రం సర్జికల్ దాడులకు సంబంధించిన ఆధారాలివ్వాలంటూ ప్రశ్నించిందన్నారు. కాలోల్, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సభల్లోనూ మోదీ పాల్గొన్నారు. రాజ్‌కోట్ సభలో మాజీ ప్రధాని మన్మోహన్‌కు కాంగ్రెస్ హయాంలోని కుంభకోణాలపై రాసిన పుస్తకాన్ని బహూకరించిన మన్‌సుఖ్ కాకాను మోదీ అభినందించారు. ఈ సభలకు భారీ సంఖ్యలో పటీదార్లు పాల్గొని బీజేపీకి మద్దతు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment