
'ఆ వార్తలు అవాస్తవం.. ఇప్పట్లో రిటైరవ్వను'
న్యూఢిల్లీ: తాను రాజకీయాల నుంచి రిటైరవుతున్నట్టు వచ్చిన వార్తలను రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ తోసిపుచ్చారు. ఇప్పట్లో రాజకీయాల నుంచి తప్పుకోబోనని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనకు అప్పగించిన బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించిన తర్వాతే తిరిగి గోవాకు వెళుతానని ఆయన చెప్పారు. డిసెంబర్ 13న 60వ ఏటా అడుగుపెడుతున్న నేపథ్యంలో రాజకీయాల నుంచి రిటైరవ్వాలని భావిస్తున్నట్టు పారికర్ చెప్పారని వార్తలు వచ్చాయి.
మూడుసార్లు గోవా ముఖ్యమంత్రిగా పనిచేసిన పారికర్ ఈ వార్తలపై ట్విట్టర్‌లో స్పందించారు. 'సాధారణంగా 60 ఏళ్ల వయస్సులో ప్రజలు తమ వృత్తి నుంచి రిటైరవ్వాలని భావిస్తారు. నేను కూడా గతంలో ఇలా ఆలోచించి ఉండవచ్చు. కానీ కేంద్రంలో నాపై ఉంచిన పెద్ద బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంది. ఆ బాధ్యతలను నిర్వర్తించిన తర్వాత నేను తిరిగివెళ్తాను' అని ఆయన ట్వీట్ చేశారు. రక్షణశాఖ మంత్రిగా పారికర్ మరో నెలలో ఏడాది పూర్తి చేసుకోనున్నారు. భద్రతా దళాల ఆధునీకరణ, భారీ ఆయుధ సేకరణను పారదర్శకంగా, వేగంగా పూర్తిచేయాల్సిన బృహత్ బాధ్యత పారికర్‌పై ఉంది.