మిలియన్ మార్చ్‌లో పాల్గొన్న ఉద్యమకారులు
- రిజర్వేషన్ల డిమాండ్‌తో ముంబైలో భారీ ప్రదర్శన
- హాజరైన 3 లక్షల మంది ఉద్యమకారులు
- వెంటనే స్పందించిన ‘మహా’ ప్రభుత్వం
- ఉపకారవేతనాలు ఇచ్చేందుకు అంగీకారం
ముంబై: విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సహా పలు డిమాండ్లతో మరాఠా ప్రజలు చేపట్టిన భారీ ర్యాలీతో దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం బుధవారం కాషాయ సంద్రమైంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 3 లక్షల మంది మరాఠా ప్రజలు కాషాయ టోపీలు పెట్టుకుని, అదేరంగు జెండాలు పట్టుకుని ముంబైలో ‘మరాఠా క్రాంతి మోర్చా’ పేరుతో మౌన ప్రదర్శన నిర్వహించారు. గట్టి భద్రత మధ్య బైకుల్లాలోని జీజామాత ఉద్యానవనం నుంచి ర్యాలీ ప్రారంభమై 10 కి.మీలు సాగిన అనంతరం ఆజాద్ మైదానం వద్ద ముగిసింది. ఉద్యమంలో రాజకీయ జోక్యాన్ని వ్యతిరేకించిన మరాఠాలు తమ ర్యాలీకి మద్దతుగా శివసేన పార్టీ కట్టిన బ్యానర్లను చించేశారు.
12 కోట్ల జనాభా కలిగిన మహారాష్ట్రలో మరాఠాలు 30 శాతం ఉన్నారు. ర్యాలీని దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యగా కొన్ని మార్గాల్లో వాహనాల రాకపోకలను పోలీసులు నిషేధించారు. అటు రాష్ట్ర శాసనసభలోనూ మరాఠాలకు రిజర్వే షన్లు కల్పించాలంటూ అధికార, విపక్ష సభ్యు లు వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళన నిర్వహిం చారు. సభ 45 నిమిషాల్లో 3 సార్లు వాయిదా పడింది. ర్యాలీతో వెంటనే దిగొచ్చిన మహా రాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వం...మరాఠా సమాజం నాయకులు, ప్రతినిధులతో చర్చలు జరిపింది. అనంతరం సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ అసెంబ్లీలో మాట్లాడుతూ విద్యా సంస్థల్లో ప్రస్తుతం ఓబీసీలకు 605 కోర్సుల్లో ఇస్తున్న ఉపకారవేతనాలు, సౌకర్యాలను మరాఠా విద్యార్థులకు కూడా వర్తింపజేస్తున్నట్లు ప్రకటించారు.
ఎస్సీ, బీసీలకు ఉన్నట్లుగానే మరాఠా విద్యార్థులకు హాస్టళ్లు నిర్మించేందుకు ప్రతి జిల్లాలోనూ అవసరమైన భూమిని, రూ.5 కోట్ల నిధిని ఇస్తామన్నారు. రిజర్వేషన్ల అంశా న్ని బీసీ కమిషన్ పరిశీలిస్తుందన్నారు. మరాఠా ల కోసం ఉద్దేశించిన వివిధ పథకాల అమలు ను సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కొపర్ది హత్యాచారం కేసులో దోషులకు కఠిన శిక్ష పడేలా చూస్తామనీ, నిందితుల తరపు న్యాయవాదులు కేసు విచారణను ఆలస్యం చేయాలని చూస్తున్నారన్నారు. అలాగే 3 లక్షల మంది మరాఠా విద్యార్థులకు అన్నాసాహెబ్ పాటిల్ అభివృద్ధి సంస్థ ద్వారా నైపుణ్య శిక్షణను అందిస్తామనీ, రూ.10 లక్షలలోపు విద్యారుణాలు తీసుకునేవారికి వడ్డీలో రాయితీ కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ఏడాదిలో 58వ ర్యాలీ
గత ఏడాది కాలంలో మరాఠా ప్రజలు చేపట్టిన 58వ ర్యాలీ ఇది. 2016 జూలైలో అహ్మద్‌నగర్ జిల్లాలోని కొపర్దిలో 14 ఏళ్ల మరాఠా బాలికపై సామూహిక హత్యాచారం జరిగింది. ఈ కేసులో దోషులకు శిక్ష పడాలని కోరుతూ ఔరంగాబాద్‌లో గతేడాది ఆగస్టు 9న తొలిసారి మరాఠా ప్రజలు ర్యాలీ నిర్వహించారు. అప్పటి నుంచి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీలపై దురాగతాల నివారణ చట్టానికి సవర ణలు, రైతు రుణమాఫీ, పంటలకు మద్దతుధర కల్పించడం తదితర డిమాండ్లపై ప్రజలు ఉద్యమిస్తూనే ఉన్నారు.
సకల మరాఠా సమాజ్ అనే సంస్థ వివిధ మరాఠా సంఘాలను ఒకచోట చేర్చి ఈ ర్యాలీలను నిర్వహిస్తోంది. మరాఠాలకు 16% రిజర్వేషన్లు కల్పించాల నడాన్ని 2014లో బాంబే హైకోర్టు తిరస్కరించింది. 2003–04లోనూ మరాఠాలోనూ ఓబీసీల్లో చేర్చాలన్న ప్రతిపాదనను వెనుకబడిన వర్గాల జాతీయ కమిషన్ తిరస్కరించింది.