సత్తుపల్లిలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు, పక్కన మంత్రి అజయ్‌కుమార్ తదితరులు
కొత్తగూడెం అర్బన్ /సత్తుపల్లి/సూర్యాపేట: ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్ గల్లీలో మిలియన్ మార్చ్ చేస్తామని చెబుతున్నారు. ఆయనకు దమ్ముంటే ఢిల్లీలో మిలియన్ మార్చ్ నిర్వహిస్తే దేశవ్యాప్తంగా నిరుద్యోగులు తరలివచ్చి పోరాటం చేస్తారు’ అని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించిన ఆయన సత్తుపల్లిలో 100 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపనతోపాటు పాల్వంచ నర్సింగ్, మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. విలేకరుల సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ బీజేపీ నేతల తీరుపై మండిపడ్డారు.
ఇచ్చిందెవరు.. ఇవ్వనిదెవరు?
బీజేపీ నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారని, ఉద్యోగాలు ఇచ్చిందెవరు, ఇవ్వనిదెవరో ఆత్మ పరిశీలన చేసుకోవాలని హరీశ్‌రావు సూచించారు. బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం ఎంత పెరి గిందో, నిరుద్యోగ యువత ఎంత బాధ పడుతుం దో బండి సంజయ్ తెలుసుకోవాలన్నారు. తమ ప్రభుత్వం నియామకాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని, వివిధ శాఖల్లో 1,32,899 ఉద్యోగాలను భర్తీ చేయగా, మరో 60 వేల పోస్టుల భర్తీకి కసరత్తు జరుగుతోందని తెలిపారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు లభించేలా కొత్త జోనల్ విధానాన్ని తీసుకొచ్చి, 317 జీవోను విడుదల చేస్తే దాన్ని కూడా అడ్డుకునేందుకు బీజేపీ నేతలు కుట్ర పన్నారని.. తద్వారా తెలంగాణలో స్థానిక యువత కు ఉద్యోగ అవకాశాలు దక్కకుండా చేస్తున్నారని ఆరోపించారు.
ఆర్‌ఆర్‌బీ ద్వారా రైల్వేలో 1.03 లక్షల పోస్టుల భర్తీకి 2019 ఫిబ్రవరిలో కేంద్రం నోటిఫికేషన్ ఇస్తే దాదాపు కోటి మంది నిరుద్యో గులు దరఖాస్తు చేసుకున్నారని, అయితే మూడేళ్లయినా ఇంతవరకు పరీక్ష నిర్వహించలేదని హరీశ్ విమర్శించారు. ఆర్మీ, రైల్వే, ప్రభుత్వరంగ బ్యాంకు ల్లో ఉన్న ఖాళీల భర్తీ కోసం ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలని సంజయ్‌కు హితవు పలికారు. ఇప్పటికే అనేక ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేసిన కేంద్రం, ఎయిరిండియాను సైతం టాటాలకు అప్పగించిందని.. ఇలాంటి పనులతో దాదాపు రెండున్నర లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారని తెలిపారు. బీజేపీ నేతలు చిల్లర రాజకీయా లు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని, నిబంధనలు పాటిస్తే థర్డ్‌వేవ్ నుంచి బయటపడతామని అన్నారు.
కాంగ్రెస్‌తో ఒరిగిందేమీ లేదు..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెద్దపెద్ద కాంగ్రెస్ నేత లున్నారని.. అయినా ఫలితం శూన్యమని, వారు జిల్లాకు చేసింది ఏమీ లేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సమైక్య పాలనలో మెడికల్ కాలేజీల కోసం ఆందోళనలు, ధర్నాలు చేసినా మంజూరు కాలేదని, కానీ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన కొద్ది కాలంలోనే జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందడమే కాకుండా.. మెడికల్ కళాశాలలు వచ్చాయన్నారు.
శనివారం ఆయన సూర్యాపేట జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి 20 పడకల నవజాత శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. హరీశ్‌రావు మాట్లాడుతూ నల్లగొండకు ఐదు, సూర్యాపేటకు మరో ఐదు డయాలసిస్ మిషన్లు మంజూరు చేస్తామన్నారు. ఇక నుంచి 3 షిఫ్ట్‌లలో 24 గంటలూ కిడ్నీ రోగులకు డయాలసిస్ సేవలు అందిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment