సాక్షి ముంబై: మరాఠ్వాడాను కరువు ప్రాంతంగా ప్రకటిచాలని మరాఠ్వాడాకు చెందిన మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. గత మూడేళ్లుగా మరాఠ్వాడాలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవలేదు. ఈసారి కూడా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే అత్యల్పంగా వర్షపాతం నమోదైంది. దీంతో సాగునీటితోపాటు తాగునీటికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
మరాఠ్వాడలోని ఎనిమిది జిల్లాలతోపాటు విదర్భలోని బుల్డాణా జిల్లాను కరువు ప్రాంతాలు ప్రకటించాలని పాడిపరిశ్రమ, మత్స్యశాఖ మంత్రి మధుకర్ చవాన్, పీడబ్ల్యూడీ మంత్రి జయదత్ క్షీర్‌సాగర్, ఉన్నత సాంకేతిక విద్యాశాఖ మంత్రి రాజేష్ తోపే, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి రాజేంద్ర దర్డా, మంత్రి అబ్దుల్ సత్తార్‌లు డిమాండ్ చేశారు. మరాఠ్వాడాలో వర్షాభావం కారణంగా ఆగస్టులోనే పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. రైతులు నాటిన విత్తనాలు ఇప్పటికే రెండుసార్లు వృథా అయ్యాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు,. ఔరంగాబాద్, బీడ్ జిల్లాల్లో ప్రస్తుతం 200 నీటి ట్యాంకర్ల ద్వారా తాగు నీటిని సరఫరా చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవాలని మంత్రులు ప్రభుత్వానికి విన్నవించారు.
మరాఠ్వాడాను కరువు ప్రాంతంగా ప్రకటించినట్టయితే రైతులకు విద్యుత్ బిల్లుల్లో 33 శాతం రాయితీ లభిస్తుంది. విద్యార్థులకు స్కూల్ ఫీజులు, ైరె తుల రుణాలు మాఫీ అవుతాయి. వ్యవసాయ అవసరాలకు సబ్సిడీ లభిస్తుంది. అయితే మంత్రులు చేస్తున్న విన్నపాలపై రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. మరాఠ్వాడా ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా ప్రకటిస్తే ప్రభుత్వంపై ఎంతమేర భారం పడనుందనే విషయమై ఇప్పటికే చర్చిస్తున్నామని, మరాఠ్వాడా ప్రాంతంలో పరిస్థితిపై నిపుణుల బృందం అధ్యయనం చేస్తోందని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు.
కరువు ప్రాంతంగా ప్రకటించండి
Published Thu, Aug 7 2014 10:29 PM | Last Updated on Fri, May 25 2018 1:22 PM
Advertisement
Advertisement