కరువు ప్రాంతాల్లోని బాధితులకు తొందర్లోనే కేంద్ర ప్రభుత్వం నుంచి నష్టపరిహారం...
సాక్షి, ముంబై: కరువు ప్రాంతాల్లోని బాధితులకు తొందర్లోనే కేంద్ర ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందుతుందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా నష్టపరిహారం పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. కరాడ్‌లో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో యశ్వంత్‌రావ్ చవాన్ వ్యవసాయ, పారిశ్రామిక, పశు, పక్షుల ప్రదర్శనను ఆయన మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుమారు 19వేల గ్రామాల్లో కరువు పరిస్థితి నెలకొందన్నారు. ఈ గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వంకు చెందని ఓ బృందం పరిస్థితులను అధ్యయనం చేస్తోందని చెప్పారు. అనంతరం రైతులకు మద్దతు ప్రకటిస్తుందని చెప్పారు. ఇటీవలే అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను కూడా ఆదుకుంటామని చెప్పారు. అయితే కరువు ప్రాంతాలైన మరాఠ్వాడాలో శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే పర్యటన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.