సాక్షి, ముంబై: ముంబై ఎవడబ్బ సొమ్ము కాదని, మహారాష్ట్రదేనని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉద్ఘాటించారు. కర్ణాటక న్యాయ శాఖ మంత్రి మధు స్వామి, ఎమ్మెల్యే లక్ష్మణ్ సౌదీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో... అసెంబ్లీలో ఫడ్నవీస్ కర్ణాటక ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. కర్ణాటక ఎమ్మెల్యేలు, మంత్రులు నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
దీటుగా సమాధానమివ్వకపోవడం వల్లే: పవార్
సరిహద్దు వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. బుధవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు సరిహద్దు వివాదాన్ని మళ్లీ తెరమీదకు తెచ్చాయి. చర్చించాల్సిందేనని పట్టుబట్టాయి. కర్ణాటక మంత్రి మధు స్వామి, లక్ష్మణ్ సౌదీ చేసిన వ్యాఖ్యలపై చర్చించాలని ప్రతిపక్ష నేత అజిత్ పవార్ పట్టుబట్టారు. వ్యాఖ్యలను ఖండిస్తూ కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. ‘కేంద్ర మంత్రి అమిత్‌షాతో కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల సంయుక్త సమావేశంలో సరిహద్దుపై ఎవరూ కొత్తగా దావా వేయవద్దని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి దావా వేయలేదు.
కానీ కర్ణాటక నేతలు, మంత్రులు మహారాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ పుండు మీద కారం చల్లినట్లుగా వ్యవహరిస్తున్నారు’ అని పవార్ ధ్వజమెత్తారు. కర్ణాటక నేతల వ్యాఖ్యలపై పవార్ ఘాటుగా స్పందించారు. వారికి దీటుగా సమాధానమివ్వపోవడం వల్లే కొవ్వెక్కి ఇష్టమున్నట్లు వ్యాఖ్యా నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవార్ డిమాండ్‌ను ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమరి్ధంచారు. ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతింటాయని, దీనిపై వెంటనే కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాస్తామని ఆయన స్పష్టం చేశారు.
చదవండి: ఉజ్బెకిస్తాన్‌లో 18 మంది చిన్నారులు మృతి.. ‘భారత్ కంపెనీల సిరప్‌లే కారణం’
భూకుంభకోణంపై గందరగోళం.. వాకౌట్
వాషీం జిల్లాలోని గాయ్‌రన్‌లో జరిగిన భూ కుంభకోణంపై చర్చించాలని ప్రతిపక్ష నేతలు సభలో గందరగోళం సృష్టించారు. దీనికి వ్యవసాయ శాఖ మంత్రి అబ్దుల్ సత్తార్ సమాధానమిస్తూ గాయ్‌రన్ భూ పంపిణీలో ఎలాంటి అవినీతి జరగలేదని తెలిపారు. నియమ, నిబంధనల ప్రకారమే స్థలాన్ని పంపిణీ చేశామన్నారు. ఒకవేళ నేరం రుజువైతే కోర్టు ఏ శిక్ష విధించినా తాను సిద్ధమేనన్నారు. అయినా ప్రతిపక్షాలు పట్టు వీడలేదు.
అబ్దుల్ సత్తార్ వెంటనే మంత్రి పదవికి రాజీనామ చేయాలని డిమాండ్ చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తరువాత సభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే స్థానిక సంస్థల పాఠశాలల్లో మౌలికసదుపాయాల కోసం పంపిణీ చేస్తున్న నిధులు ఎటూ సరిపోవడం లేదని ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నకు విద్యా శాఖ మంత్రి దీపక్ కేసర్కర్ సమాధానమిచ్చారు. నిధుల కోసం విద్యాశాఖ త్వరలో ఓ కమిటీ ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియను 2023 మార్చి వరకు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
విదర్భకు న్యాయం చేయండి: అజిత్‌పవార్
కరోనా కారణంగా రెండేళ్లుగా నాగ్‌పూర్‌లో అసెంబ్లీ సమావేశాలు జరగకపోవడంతో విదర్భ ప్రాంతానికి అన్యాయం జరిగిందని అజిత్‌పవార్ ఆవేదన వ్యక్తం చేశారు. విదర్భ, మరఠ్వాడ, రైతులు ఇతర అంశాలపై విస్తృతంగా చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలను మరో వారం రోజులు పొడగించాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి వర్గంలో ఒక్క మహిళకు కూడా స్థానం ఇవ్వలేకపోయారని, అది మహిళలను అవమానించడమేనని పవార్ అన్నారు. ఫడ్నవీస్ వద్ద ఏడు శాఖలున్నాయని, ఏ పనిమీద వెళ్లినా ఫడ్నవీస్‌ను అడగాలని చెబుతున్నారని ఆరోపించారు.
సాధ్యమైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ చేపట్టి, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని పవార్ సూచించారు. ఎన్సీపీ ప్రదేశ్ అధ్యక్షుడు జయంత్ పాటిల్ మాట్లాడుతూ... నందుర్బార్ జిల్లా ఆదివాసీ పాడలకు, కుగ్రామాలకు, నర్మద నదీ తీరంలోని 33 పల్లెకు వైద్య సేవలందడం లేదని ఫడ్నవీస్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఫడ్నవీస్ స్పందిస్తూ ఆశ వర్కర్లను అవసరమైతే వైద్యులను, ఇతర వైద్య సిబ్బందిని నియమిస్తామని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment