స్నేహమంటే ఇదేరా..
స్నేహితులకు మీరేదైనా చేస్తున్నారా? విపత్కర పరిస్థితుల్లో వారికి సహకరిస్తున్నారా? ఒక వేళ అలాంటి పనులేవీ చేయకపోతే.. ఇదిగో.. ఈ ఫొటోలోని వ్యక్తుల్ని చూసైనా తెల్సుకోండి.. చట్టాన్ని ఉల్లంఘించైనాసరే.. స్నేహితులకు సహాయపడటం ఎలాగో..
నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పనులేవో చేస్తున్నట్లు కనిపిస్తున్న వీళ్లంతా అంతకంటే గొప్పపని చేస్తున్నారక్కడ! పరీక్షల్లో ప్రశ్నలకు జవాబులు తెలియని తమతమ స్నేహితులకు కిటికీల నుంచి చిట్టీలు అందిస్తూ మీడియా కంటికి చిక్కారు! ఒకటికాదు రెండు కాదు తాడు, నిచ్చెన లేకుండా అమాంతం నాలుగు ఫ్లోర్లెక్కిమరీ మాస్ కాపీయింగ్కు సహకరిస్తున్నారు. ఈ తతంగమంతా జరిగింది బీహార్లో!
ప్రస్తుతం పరీక్షల సీజన్ కదా.. బీహార్ లోనూ ఎస్ఎస్ఎల్సీ పరీక్షలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల మాస్ కాపీయింగ్ జరుగుతోందని విపక్షాలు గగ్గోలు పెట్టాయి. అయితే అలాంటిదేమీ లేదని.. పరీక్ష హాలులో ప్రశ్న, జవాబు పత్రాలు తప్ప చిన్న పేపర్ ముక్క కూడా కనిపించదని బీహార్ సీఎం నితిశ్ కుమార్ స్పష్టం చేశారు. ఆయన అలా మాట్లాడిన తర్వాతిరోజే ఇదిగో మీరు చూస్తున్న ఈ చిత్రం వైశాలి జిల్లాలో ఆవిష్కృతమైంది.
మరి పోలీసుల భయం లేదా? అనుకుంటారేమో! అక్కడ కూడా చట్టం తనపని తాను చేసుకుపోయింది. కిటికీల నుంచి చిట్టీలు అందిస్తున్న విద్యార్థుల స్నేహితులు, బంధువుల్ని తరిమితరిమి కొట్టింది. ఈ ఉరుకులాటలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయికూడా!